సెర్ప్‌లోకి.. మెప్మా
● ఒకే గొడుగు కిందికి మహిళా సంఘాలు ● ప్రతిపాదనలు రూపొందించిన ప్రభుత్వం ● మున్సిపాలిటీల్లోని ఉద్యోగులు డీఆర్డీఏ పరిధిలోకి..
జిల్లా వివరాలు
మొత్తం మండలాలు : 18
స్వయం సహాయక సంఘాలు : 12,215
సభ్యులు : 1,34,002
గ్రామైక్య సంఘాలు : 505
మొత్తం మున్సిపాలిటీలు : 03
మెప్మా ఉద్యోగులు : 11
రిసోర్స్ పర్సన్లు : 95
నిర్మల్‌చైన్‌గేట్: పట్టణ ప్రాంతాల్లో పొదుపు సంఘా ల మహిళలకు బ్యాంకుల్లో రుణాలు ఇప్పించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న మెప్మా.. ఇక నుంచి డీఆర్డీఏ పరిధిలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో విలీనం కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లోని మెప్మా ఉద్యోగులు, సిబ్బందితో పాటు జిల్లా కేంద్రంలోని మెప్మా జిల్లా కార్యాలయ ఉద్యోగులంతా సెర్ప్ పరిధిలోకి వెళ్లనున్నారు.
కమిషనర్ల ఆధ్వర్యంలో విధులు
మున్సిపాలిటీల్లో మహిళలను గ్రూపుగా ఏర్పాటు చేసే మెప్మా ఉద్యోగులు జిల్లాలో 11 మంది, వార్డుల్లో క్షేత్రస్థాయిలో పనిచేసే మెప్మా రిసోర్స్ పర్సన్లు 95 మంది వరకు ఉన్నారు. వీరంతా మున్సిపల్ క మిషనర్ల ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు. మహిళా సంఘాలకు బ్యాంకుల్లో రుణాలు ఇప్పించడంతో పా టు నెలనెలా చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పనిని సెర్ప్ కార్యాలయం కింద పనిచేసే ఉద్యోగులు పర్యవేక్షిస్తున్నా రు. ఈ రెండు శాఖలను విలీనం చేస్తే సెర్ప్ కార్యాలయంలో విధులు నిర్వర్తించనున్నారు.
పట్టణాల్లో సర్వేలకు ఇబ్బందే..
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు, ఇతరత్రా పనులను క్షేత్రస్థాయిలో మెప్మా ఆర్పీలు, మెప్మా సీవోలు సర్వే చేస్తుంటారు. మెప్మా ఆర్పీలకు కాలనీల్లో ఉండే వివరాలు తేలికగా తెలిసే అవకాశం ఉంటుందని.. ప్రతీ సర్వేకు వారి సేవలను వినియోగించుకున్నారు. ఇక నుంచి వారు ఇతర శాఖ పరిధిలోకి వెళ్తే.. మున్సిపాలిటీ సేవలకు వారు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ప్రభుత్వం చేపట్టే సర్వే చేయాలంటే ఇక నుంచి మున్సిపల్ యంత్రాంగానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
జీత భత్యాల్లో తేడా...
పట్టణాల్లోని మెప్మా రిసోర్సు పర్సన్లకు నెలకు రూ.6వేల వేతనం చెల్లిస్తుంటే, సెర్ప్ ఆర్పీలకు రూ.5వేల చొప్పున చెల్లిస్తున్నారు. ఒకవేళ ఈ రెండు గ్రూపులు కలిపితే జీతాలు పెరుగుతాయా? తగ్గుతాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహిళా సంఘాల విలీనంపై త్వరలో మార్గదర్శకాలు విడుదల కానున్నాయని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. విలీన అంశంపై అధికార వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది.
కార్యకలాపాలు ఎప్పటిలాగేనా?
పురపాలక, గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పటిలాగే కార్యకలాపాలు ఉండే అవకాశమున్నట్లు సమాచారం. ఒకేశాఖ పరిధిలో ఉద్యోగులంతా పనిచేసేలా విధివిధానాలు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. సర్వేలు, ఓటర్ల జాబితాలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల పరిశీలన, ఇతర సంక్షేమ పథకాలతో పాటు మహిళా సంఘాల పనితీరు యధావిధిగా ఉండనున్నట్లుగా తెలుస్తోంది. గతంలో మాదిరిగా గ్రామీణ, పట్టణ సంస్థలు కాకుండా ఒకేచోట ఒకే అధికారి పర్యవేక్షణలో ఉద్యోగులంతా పనిచేయనున్నట్లు మెప్మా ఉద్యోగులు అంటున్నారు. మొత్తానికి విలీన అంశాన్ని ఉద్యోగులు స్వాగతిస్తున్నట్లుగా చెబుతున్నారు.
శుభ పరిణామం..
రాష్ట్ర ప్రభుత్వం మెప్మా ఉద్యోగులను సెర్ప్‌లో విలీనం చేయడం శుభపరిణామం. అలాగే మెప్మా ఉద్యోగులకు కూడా సెర్ప్ ఉద్యోగుల మాదిరి అన్నిరకాల బెనిఫిట్స్ అందించాలి. అధికారుల ఉత్తర్వుల ప్రకారం నడుచుకుంటాం.
– సుభాష్, మెప్మా ఇన్‌చార్జి పీడీ


