నిర్మల్‌ఖిల్లా: నిర్మల్‌కు చెందిన పద్యకవి, వ్యాఖ్యా త, ఉపన్యాసకులు, సంస్కతభాషా ప్రచార సమితి ఉమ్మడి జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు బీ వెంకట్ డాక్టర్ ఆఫ్ తెలుగు లిటరేచర్ అవార్డు–2025ను అందుకున్నారు. శనివారం ఫ్రెండ్‌షిప్ మినిస్ట్రీస్ సంస్థ, ఇందిరా ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లోగల సారెగ స్టూడియోలో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫ్రెండ్‌షిప్ మినిస్ట్రీస్ చైర్మన్, డాక్టర్ ఆలూరి విల్సన్, సినీ నటుడు పసునూరి శ్రీనివాస్, సిటీ సివిల్ కోర్టు సీనియర్ సూపరింటెండెంట్ డాక్టర్ పీవీపీ అంజనీకుమారి, ఆర్ట్ ఫౌండేషన్ అధ్యక్షురాలు గాయని డాక్టర్ ఎన్ ఇందిరా చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. ఇదే వేదికపై నిర్వహించిన కవి సమ్మేళనంలో ‘నేటి సమాజానికి ఆదర్శ మహిళలు’ అంశపై వెంకట్ రాగయుక్తంగా తెలుగు పద్యాలను ఆలపించారు. వివిధ తెలుగు సాహిత్య సేవలకు గుర్తింపుగా డాక్టరేట్ అవార్డు వచ్చినట్లు ఈ సందర్భంగా వెంకట్ తెలిపారు. వెంకట్ మూడు దశాబ్దాలుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సంస్కృత, తెలుగు భాషల్లో సాహితీసేవలందిస్తున్నారు. నిర్మల్ జిల్లా తెలంగాణ రచయితల వేదిక, నిర్మలభారతి సభ్యులు, జిల్లాకు చెందిన సాహితీవేత్తలు వెంకట్‌ను అభినందించారు.