సాక్షి బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర మంత్రివర్గం ఏర్పాటు లేదా శాఖల కేటాయింపు సమయంలో ఎప్పుడూ పదేపదే వినిపించే పేరు ‘బెంగళూరు నగరాభివృద్ధి శాఖ’. ఇప్పటివరకు ఈ శాఖను సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వంలో డీకే శివకుమార్ చూసుకున్నారు. అయితే కొత్తగా ఏర్పడిన డీకే శివకుమార్ కేబినెట్‌లో బెంగళూరు నగరాభివృద్ధి శాఖ కోసం తీవ్ర పోటీ నెలకొంది. అవును.. కర్ణాటకలో డీకే శివకుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు రోజులైంది. శాఖల కేటాయింపు కూడా జరిగిపోయింది. బెంగళూరు నగరాభివృద్ధి శాఖను కృష్ణభైరేగౌడకు డీకే శివకుమార్ అప్పగించారు. అయితే బెంగళూరు నగరాభివృద్ధి శాఖపై కొండంత ఆశతో ఉన్న రామలింగారెడ్డికి ఇది అసలు నచ్చలేదు.. తనకు ఆ శాఖ కేటాయించలేదనే కారణంతో అసంతృప్తికి లోనై మనస్తాపానికి గురై ఏకంగా మంత్రి పదవికే రామలింగారెడ్డి రాజీనామా చేశారు. అసలు ఆ బెంగళూరు నగరాభివృద్ధి శాఖలో ఏముంది ఇంతకీ? అనే చర్చ ఇప్పుడు మొదలైంది.. ఎందుకింత పోటీ నెలకొంది? అనే ప్రశ్నలు వస్తున్నాయి.
ఆర్థిక ఇంజిన్‌గా బెంగళూరు
బెంగళూరు అంటే కేవలం రాష్ట్ర రాజధాని మాత్రమే కాదు. ప్రపంచ స్థాయిలో ఐటీ హబ్‌గా పేరు గాంచింది. అధికారానికి అక్షయపాత్ర ఈ బెంగళూరు మహానగరం. ఇంకా చెప్పాలంటే ఒక విధంగా బంగారు ఖనిజంగా చెప్పొచ్చు. కర్ణాటక రాష్ట్రం మొత్తానికి అత్యధిక రెవెన్యూ అందించే ఆర్థిక ఇంజిన్ ఈ బెంగళూరు నగరం. ఇక్కడ తీసుకునే నిర్ణయాలు ప్రపంచ స్థాయిలో బ్రాండ్ బెంగళూరు ఇమేజ్‌పై ప్రభావం చూపుతాయి. ఈ శాఖ బాధ్యతలు నిర్వహించే నాయకులకు పార్టీలో, ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత అత్యున్నత స్థానం దక్కినట్లుగా భావిస్తారు. ఈ నేపథ్యంలో ఈ బెంగళూరు నగరాభివృద్ధి శాఖకు అధిక డిమాండ్ ఏర్పడింది.
బడ్జెట్‌లో అధిక కేటాయింపులు
బెంగళూరు కేవలం రాజధాని మాత్రమే కాదు. రాష్ట్ర రాజకీయ, ఆర్థిక శక్తి కేంద్రం. దేశంలో సిలికాన్ వ్యాలీగా ప్రసిద్ధి పొందిన ఈ మహానగరం నుంచి ఒక్కసారి నాయకుడిగా ఎన్నికైతే ప్రపంచ స్థాయిలో ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా పేరు పొందవచ్చు. అత్యున్నత రాజకీయ గౌరవం, శక్తి లభిస్తుంది. అందుకే ఈ బెంగళూరు నగరాభివృద్ధి శాఖ బాధ్యతలు తీసుకోవడం ద్వారా దేశ వ్యాప్తంగా రాజకీయంగా క్రియాశీలకంగా మారే అవకాశాలు మెండుగా ఉంటాయని నాయకులు భావిస్తారు. అలాగే ఈ బెంగళూరు నగరాభివృద్ధి శాఖకు లభించే బడ్జెట్ కూడా సామాన్యమైనది కాదు. వేలాది కోట్ల రూపాయల మేర భారీ బడ్జెట్ కేటాయింపులు ఈ శాఖకు దక్కుతాయి. అనేకానేక పథకాలు, ప్రాజెక్టులు ఈ శాఖకు బడ్జెట్‌లో లభిస్తాయి. నమ్మ మెట్రో విస్తరణ, ఫ్లై ఓవర్లు, సొరంగ మార్గాలు, రాజ కాలువలు, చెరువుల అభివృద్ధి, నగర ట్రాఫిక్ నిర్వహణ తదితర కోట్లాది రూపాయల ప్రాజెక్టుల పరిశీలన, బాధ్యత నేరుగా సంబంధిత శాఖ మంత్రిపై ఉంటాయి.
స్థానిక ఎమ్మెల్యేలకే ప్రేమ ఎక్కువ..
వాస్తవానికి బెంగళూరు నగరాభివృద్ధి మంత్రిత్వ శాఖపై కేవలం బెంగళూరు నగరానికి చెందిన ఎమ్మెల్యేలు కన్ను వేస్తుంటారు. ఉత్తర కర్ణాటక, మధ్య కర్ణాటక ఎమ్మెల్యేలు ఎవరూ ఈ శాఖను నిర్వహించేందుకు ఇష్టపడరు. ఈ శాఖ కేవలం బెంగళూరు నగరానికే పరిమితం కావడంతో వారు దీన్ని స్వీకరించేందుకు ముందుకు రారు. బెంగళూరు నగర ఎమ్మెల్యేలు ఎక్కువగా ఈ శాఖను తీసుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. ఇప్పటివరకు ఈ శాఖకు మంత్రులుగా చేసిన వారు కూడా చాలా మంది బెంగళూరు వాసులే కావడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా తిరగాల్సిన అవసరం లేకపోవడం, సొంత నియోజకవర్గంలో ఉంటూ ఈ శాఖ బాధ్యతలు చూసుకునే వెసులుబాటు ఉండడంతో బెంగళూరు ఎమ్మెల్యేలు దీనికోసం పట్టుబడుతున్నారు. ఆఖరికి కొత్తగా ఈ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న కృష్ణబైరేగౌడ సైతం బెంగళూరు వాసి కావడం గమనార్హం.
ప్రభుత్వ సంస్థలన్నీ ఇక్కడే..
బెంగళూరు అభివృద్ధిని, భవిష్యత్తును రూపొందించే, అత్యంత ప్రభావవంతమైన ప్రముఖ ప్రభుత్వ సంస్థలు కూడా ఈ శాఖ కిందకే వస్తాయి. బీడీఏ (బెంగళూరు అభివృద్ధి ప్రాధికార, బీడబ్ల్యూఎస్‌ఎస్‌బీ (బెంగళూరు జలమండలి), జీబీఏ (గ్రేటర్ బెంగళూరు అథారిటీ) తదితర ప్రభుత్వ రంగ పెద్ద సంస్థలు, వాటి కార్యాలయాలు బెంగళూరులోనే ఉంటాయి. ఆ సంస్థల నిర్ణయాలు, నియామకాలు మొత్తానికి పాలన పూర్తిగా బెంగళూరు నగరాభివృద్ధి శాఖ పరిధిలోకి వస్తాయి. బెంగళూరులో మౌలిక వసతుల పెంపుదల కోసం ఏటికేడాది ప్రభుత్వాలు కేటాయింపులను పెంచుతూ పోతున్నాయి. దీనికితోడు బెంగళూరులో వేగంగా విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్, అనేక పరిశ్రమలు, పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా ఈ మహానగరం నిలుస్తోంది.


