సాక్షి, న్యూఢిల్లీ: అందరితో కలిసి ఇంట్లోనే ఆనందంగా వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు దేశ ప్రజలకు సూచించారు. వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుని దేశ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సమస్త జీవుల సమభావనకు ప్రతీకగా నిలిచే పండుగ వినాయక చవితి అని అన్నారు. దీని ద్వారా బాలగంగాధర్ తిలక్ సామూహిక సమావేశాలతో జాతీయవాద భావాలను వ్యాప్తి చేశారని గుర్తు చేశారు.
అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో మట్టితో చేసిన సహజమైన వినాయకుని ప్రతిమలతో వినాయకచవితి పర్వదినాన్నిమార్గదర్శకాలను పాటిస్తూ ఇళ్ళలోనే జరుపుకోవాలని సూచించారు. భక్తి ప్రపత్తులతో కుటుంబంతో కలిసి ఆధ్యాత్మికత, ఆనందాల సమ్మిళితంగా పర్యావరణాన్ని పరిరక్షించే వేడుకగానే ఈ ఉత్సవాలను భావించాలని కోరారు. ప్రతి ఒక్కరూ ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకునే దిశగా కంకణబద్ధులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రకృతిని-సంస్కృతిని సమతుల్యం చేస్తూ సుసంపన్నమైన మానవాళి భవిష్యత్తు దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
చదవండి: ‘సాక్షి’ చూస్తూ ఇంట్లోనే ఎకో ఫ్రెండ్లీ గణేశా తయారీ..


