హంపీ అద్భుతం

Venkaiah Naidu and family visit Hampi in Karnataka - Sakshi

రాయల పాలన ఆదర్శనీయం

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

సాక్షి, బళ్లారి: ఘనమైన సాంస్కృతిక వారసత్వాలకు నిలయమైన భారతదేశపు గత వైభవం గురించి యువత తెలుసుకోవాలని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. కర్ణాటక పర్యటనలో ఉన్న ఆయన శనివారం కుటుంబసమేతంగా చారిత్రక హంపీని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఇలాంటి ప్రదేశాల గురించి తెలుసుకోవడం ద్వారా యువతలో మనోబలం, ఆత్మవిశ్వాసం పెరిగి నవ భారత నిర్మాణంలో భాగస్వాములు కాగలరని ఆకాంక్షించారు. హంపీలో విజయనగర సామ్రాజ్య గత వైభవపు ఆనవాళ్లు, నాటి శిల్పకళాశైలి ఎవరినైనా మంత్రముగ్ధుల్ని చేస్తాయన్నారు. 

బహమనీ సుల్తానులు విజయనగర వైభవాన్ని నేలమట్టం చేసేందుకు ప్రయత్నించినప్పటికీ, హంపీ శిథిలాలు సైతం నాటి చరిత్రను మనకు తెలియజేస్తున్నాయని తెలిపారు.  గతంలో తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన ఉదయగిరి నియోజకవర్గం సైతం రాయలవారి సామ్రాజ్యంలో ఒకనాడు భాగంగా ఉండేదని తెలిపారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో హంపీని సందర్శించానని తెలిపారు. ప్రజా సంక్షేమానికి రాయలు శ్రమించారని, సంస్కృతిని, కళలను ప్రోత్సాహించారని, ఆయన లాంటి ఆదర్శవంతమైన రాజులు చరిత్రలో చిరస్మరణీయంగా నిలుస్తారని తెలిపారు. హంపీ వంటి చారిత్రక ప్రదేశాల చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top