ఉదయ్‌పూర్‌ కంటే వారం ముందే మరో ఘటన!.. అనుమానాల నేపథ్యంలో దర్యాప్తు ముమ్మరం

Udaipur Killing Link With Maharashtra Amaravati Business Man Death - Sakshi

ముంబై: రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లో టైలర్‌ కన్హయ్య లాల్‌ హత్యోదంతంలో ఉగ్రకోణం వెలుగు చూడడంతో నిఘా సంస్థలు అప్రమత్తం అయ్యాయి. పాక్‌ ఉగ్రవాద సంస్థలతో నిందితులకు సంబంధం ఉన్నట్లు తేలడంతో పాటు మరికొన్ని కీలకాంశాలను సైతం రాజస్థాన్‌ పోలీసులు విచారణ ద్వారా వెలుగులోకి తెచ్చారు. అయితే.. ఈ ఘటన కంటే ముందే మహారాష్ట్రలో దాదాపుగా ఇదే తరహాలో జరిగిన ఓ ఘటనపై అనుమానాలు వ్యక్తం అవుతుండడంతో దర్యాప్తు ఊపందుకుంది. 

మహారాష్ట్ర అమరావతిలో మెడికల్‌ సామాగ్రి వ్యాపారి ఉమేష్‌ కోల్హే హత్య పలు అనుమానాలకు తావు ఇస్తోంది. ఆయన్ని కూడా కన్హయ్య లాల్‌ తరహాలోనే దుండగులు గొంతుకోసి హతమార్చారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.  ఇతర వివరాలేవీ బయటకు పొక్కనివ్వడం లేదు. అయితే స్థానిక బీజేపీ నేతలు మాత్రం.. ఇది నూపుర్‌ శర్మ కామెంట్లకు ముడిపడిన ఘటనే అని చెప్తున్నారు.

జూన్‌ 21వ తేదీ రాత్రి దుకాణం నుంచి తిరిగి వస్తున్న టైంలో ఉమేష్‌ దారుణ హత్యకు గురయ్యాడు. బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు ఆయన్ని గొంతుకోసి చంపి పారిపోయినట్లు.. వెనుక మరో బైక్‌ మీద వస్తున్న ఉమేష్‌ కొడుకు, ఉమేష్‌ భార్యలు ప్రత్యక్ష సాక్షులుగా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత ఈ కేసుకు సంబంధించి.. అబ్దుల్‌ తౌఫిక్‌, షోయెబ్‌ ఖాన్‌, అతీఖ్‌ రషీద్‌ అనే ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఒకవేళ అది దొంగతనంలో భాగమే అయితే.. ఉమేష్‌ వెంట ఉన్న డబ్బును తీసుకెళ్లేవాళ్లు. కానీ, ఆయన్ని ఎందుకు హత్య చేసి ఉంటారన్నది ఇప్పుడు పలు అనుమానాలకు తావు ఇస్తోంది. అంతేకాదు.. కోల్హే తన సోషల్‌ మీడియాలో నూపుర్‌ శర్మకు అనుకూలంగా కొన్ని పోస్టులు షేర్‌ చేశారని, వాటిని వాట్సాప్‌ గ్రూపుల్లోనూ పంచుకున్నారని బీజేపీ అధికార ప్రతినిధి శివరాయ్‌ కులకర్ణి.. అమరావతి కమిషనర్‌ ఆర్తి సింగ్‌ను కలిసి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ లోపే ఉదయ్‌పూర్‌ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఈ కేసుకు సంబంధించి ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయించిన పోలీసులు.. దర్యాప్తు చేయిస్తున్నారు.

చదవండి: ఉదయ్‌పూర్ ఘటన.. భయపడినట్టుగానే జరిగింది!!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top