స్వేచ్ఛాయుత నౌకాయానానికి వీలు కల్పించాలి: మోదీ
ప్రధానితో ఫోన్‌లో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో సాధ్యమైనంత త్వరగా శాంతియుత పరిస్థితులు నెలకొనాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు త్వరగా సమసిపోవాలని, అందుకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టంచేశారు. మోదీతో మంగళవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్‌లో మాట్లాడారు. పశ్చిమాసియా యుద్ధంతోపాటు ప్రధానంగా హార్మూజ్ జలసంధి విషయంలో తాజా పరిణామాలపై వారు చర్చించుకున్నారు. స్వేచ్ఛాయుత నౌకాయానానికి వీలుగా హార్మూజ్‌ను తక్షణమే తెరవాలని మోదీ ఈ సందర్భంగా తేల్చిచెప్పారు.
ట్రంప్ నుంచి తనకు ఫోన్ వచ్చిందని, పశ్చిమాసియా పరిస్థితులపై ఉపయోగకరమైన అభిప్రాయాలు పంచుకున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టుచేశారు. హార్మూజ్ జలసంధిని తెరిచి, అందరికీ అందుబాటులో ఉండేలా చూడటం ప్రపంచం మొత్తానికి అత్యవసరమని స్పష్టంచేశారు. పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం దిశగా చేపట్టే ప్రయత్నాలపై సంప్రదింపులు కొనసాగించాలని తాము నిర్ణయించామని స్పష్టంచేశారు. కీలకమైన షిప్పింగ్ మార్గాన్ని తెరిచి ఉంచాల్సిన ప్రాముఖ్యతపై నేతలు చర్చించారని అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు.


