మతం మారితే ఎస్సీ హోదా కోల్పోయినట్లే! | Those who convert to Christianity cannot obtain Dalit status | Sakshi
Sakshi News home page

మతం మారితే ఎస్సీ హోదా కోల్పోయినట్లే!

Mar 25 2026 4:43 AM | Updated on Mar 25 2026 8:51 AM

Those who convert to Christianity cannot obtain Dalit status

హిందూ, సిక్కు, బౌద్ధం మినహా ఇతర మతాలకు మారితే ఎస్సీ రిజర్వేషన్‌ వర్తించదు 

క్రైస్తవాన్ని స్వీకరించిన వారు దళిత హోదాను పొందలేరు 

ఎస్సీ, ఎస్టీ ఆకృత్యాల నిరోధక చట్టం కింద వారికి రక్షణ లభించదు 

ఏపీ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు స్పష్టీకరణ

సాక్షి, న్యూఢిల్లీ: హిందూ, బౌద్ధం, సిక్కు మతాలు మినహా ఇతర మతాల్లోకి మారిన వ్యక్తులు తమ షెడ్యూల్డ్‌ కులాల (ఎస్సీ) హోదాను తక్షణమే కోల్పోతారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. క్రైస్తవ మతాన్ని స్వీకరించి, ఆచరిస్తున్న వ్యక్తులు దళిత హోదాను క్లెయిమ్‌ చేయలేరని, అలాగే తమకు రక్షణ కల్పించాలంటూ ‘ఎస్సీ, ఎస్టీ ఆకృత్యాల నిరోధక చట్టాన్ని’ (అట్రాసిటీ చట్టం) ఏమాత్రం ఆశ్రయించలేరని తేల్చిచెప్పింది. 

ఏపీలోని పిట్టలవానిపాలెం గ్రామంలో హిందూ మతం నుంచి క్రైస్తవంలోకి మారి పాస్టర్‌గా కొనసాగుతున్న చింతాడ ఆనంద్‌ అనే వ్యక్తి తనపై దాడి జరిగిందని ఆరోపిస్తూ పలువురిపై పెట్టిన అట్రాసిటీ కేసును కొట్టేస్తూ ఏపీ హైకోర్టు గతేడాది ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తాజాగా సమర్థించింది. ఏపీ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ చింతాడ ఆనంద్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఎన్‌.వి. అంజారియాలతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. 

కేవలం ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని అధికారులు రద్దు చేయనంత మాత్రాన.. మతం మారిన వాస్తవాన్ని విస్మరించలేమని, అతనికి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రక్షణ పొందే అర్హత రాదని తేల్చిచెప్పింది. 1950 నాటి రాజ్యాంగ (షెడ్యూల్డ్‌ కులాలు) ఉత్తర్వులను ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఉదహరించింది. ‘ఈ కేసులో పిటిషనర్‌ తిరిగి తన మాతృ మతంలోకి (హిందూ) మారినట్లు గానీ, మాదిగ సామాజికవర్గం అతన్ని తిరిగి తమలోకి చేర్చుకున్నట్లు గానీ ఎటువంటి ఆధారాలు లేవు. 

పైగా అతను దశాబ్దానికిపైగా క్రైస్తవాన్ని ఆచరిస్తున్నాడు. పాస్టర్‌గా సేవలందిస్తూ గ్రామాల్లో ప్రతి ఆదివారం ప్రార్థనలు నిర్వహిస్తున్నాడు. దాడి జరిగినట్లు చెబుతున్న రోజున కూడా అతను ఇంట్లో ప్రార్థనలు నిర్వహించాడు. ఈ వాస్తవాలన్నీ ఘటన జరిగిన నాటికి అతను క్రైస్తవుడేనని నిస్సందేహంగా నిరూపిస్తున్నాయి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

Advertisement
 
Advertisement
Advertisement