జమ్మూకశ్మీర్‌: కుల్గాంలో ఉగ్రవాదుల కాల్పులు

Terrorist Kill 2 Non Local Labours In Jammu Kashmir - Sakshi

జమ్మూ/శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఆదివారం సాయంత్రం మరో ఇద్దరు స్థానికేతరులను కాల్చిచంపారు. ముష్కరుల కాల్పుల్లో ఒక కార్మికుడు గాయపడ్డాడు. ఇది గత 24 గంటల వ్యవధిలో స్థానికేతరులపై జరిగిన మూడో దాడి కావడం గమనార్హం. బిహార్‌ నుంచి వచ్చిన ఇద్దరు కార్మికులను పొట్టనపెట్టుకున్నారు. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది ముష్కరుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వరుసగా జరుగుతున్న ముష్కరుల దాడులతో పోలీసు ఉన్నతాధికారుల అప్రమత్తమయ్యారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులను తక్షణమే సమీపంలోని సెక్యూరిటీ క్యాంపులకు తరలించాలంటూ ఆదేశాలిచ్చారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో ఈ నెలలో ఇప్పటిదాకా 11 మంది బలయ్యారు.

ఉగ్రవాదుల దుశ్చర్యలపై నిరసన జ్వాలలు
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు భద్రతా సిబ్బందితోపాటు సామాన్య ప్రజలపై దాడులు చేస్తూ, వారి ప్రాణాలను బలి తీసుకుంటుండడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రవాదుల దుశ్చర్యలను ఖండిస్తూ ఆదివారం పలు ప్రజా సంఘాలు రాష్ట్రంలో వేర్వేరు చోట్ల నిరసన ప్రదర్శన చేపట్టాయి. జమ్మూకశ్మీర్‌లోని ఉగ్రవాద శక్తులకు పాక్‌ సర్కారు మద్దతునిస్తోందని ధ్వజమెత్తారు. పాక్‌ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. పాక్‌ ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఇటీవల ముష్కరుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన భద్రతా సిబ్బందికి ప్రజలు నివాళులర్పించారు. శివసేన డోంగ్రా ఫ్రంట్, ఆల్‌ జమ్మూకశ్మీర్‌ పంచాయత్‌ కాన్ఫరెన్స్, రాష్ట్రీయ భజరంగ్‌ దళ్, జమ్మూ వెస్టు అసెంబ్లీ మూమెంట్, రాజ్‌పుత్‌ కర్ణీ సేన, భారతీయ జనతా యువమోర్చా నిరసనల్లో పాల్గొన్నాయి.  

ఉగ్రవాదులను ఏరిపారేస్తాం: లెఫ్టినెంట్‌ గవర్నర్‌ 
ప్రతి రక్తం బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటామని జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ప్రతిన బూనారు. ఆదివారం రేడియో కార్యక్రమం ‘ఆవామ్‌ కీ ఆవాజ్‌’లో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సాధారణ ప్రజలను, స్థానికేతరులను ఉగ్రవాదులు కాల్చి చంపుతుండడంపై ఘాటుగా స్పందించారు. ఉగ్రవాదులను, వారి సానుభూతిపరులను వేటాడుతామని హెచ్చరించారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top