పీఓకేలో ఉగ్ర స్థావరాలు ధ్వంసం!

విరుచుకుపడిన భారత సైన్యం
పాకిస్తాన్ సైన్యానికి గట్టి హెచ్చరిక
న్యూఢిల్లీ: కశ్మీర్‌లో అలజడి సృష్టించడమే లక్ష్యంగా ఉగ్రవాదులను ఎగదోస్తున్న పాకిస్తాన్‌కు భారత సైన్యం గట్టిగా బుద్ధి చెప్పింది. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని అనుమానిత ఉగ్రవాద స్థావరాలపై గురువారం విరుచుకుపడింది. భారత సైన్యం దాడిలో ముష్కరుల స్థావరాలు ధ్వంసమైనట్లు సమాచారం. వారికి భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు పీఓకేలో తిష్ట వేశారు. పాకిస్తాన్ సైనికుల అండతో భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి కుట్రలను భారత సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది.
చలికాలం ప్రారంభం కావడానికంటే ముందే ఉగ్రవాదులను భారత్‌లోకి పంపాలని పాక్ విశ్వప్రయత్నాలు సాగిస్తోంది. భారత సైన్యం అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో పాక్ ఆటలు సాగడం లేదని అధికారులు వెల్లడించారు. పాక్ సైన్యం ఇటీవల తరచుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. ఎల్‌ఓసీ వద్ద భారత సైన్యంపై, పౌరులపై కాల్పులకు తెగబడుతోంది. భారత్‌పై కయ్యానికి కాలు దువ్వుతున్న పాక్ సైన్యానికి హెచ్చరికలు పంపడంతోపాటు ఉగ్రవాదుల పీచమణచడమే లక్ష్యంగా భారత సైన్యం పీఓకేలో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసినట్లు తెలుస్తోంది. అయితే, నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) వద్ద గురువారం ఎలాంటి కాల్పులు జరగలేదని సైనిక వర్గాలు స్పష్టం చేశాయి.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి