Tamil Nadu Man Tongue Bite By Poisonous Snake - Sakshi
Sakshi News home page

అయ్యో నాగరాజా! జ్యోతిష్యుడు చెప్పాడని విషసర్పం ముందు..

Published Sat, Nov 26 2022 5:51 PM

Tamil Nadu Man Tongue Bite By Poisonous Snake - Sakshi

క్రైమ్‌: దైవ భక్తి మంచిదే. కానీ, ఆ భక్తి ముసుగులో మూఢనమ్మకాల్ని ప్రచారం చేసేవాళ్లను నమ్మడం ఏమాత్రం మంచిదికాదు. పైగా బాగా చదువుకున్న వాళ్లు కూడా ఆ మత్తులో మోసపోతుండడం తరచూ చూస్తున్నాం. తాజాగా ఓ వ్యక్తి మోసపోయి జేబు గుల్లజేసుకోవడంతోనే ఆగిపోలేదు. గుడ్డిగా జ్యోతిష్యుడు చెప్పింది చేసి వారంపాటు ఆస్పత్రి పాలయ్యాడు. 

తమిళనాడు ఈరోడ్ జిల్లా, కోపిచెట్టిపాళయం సత్తి రోడ్డు నివాసి రాజా(54) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. గత కొన్నిరోజులుగా ఆయన కలలో పాములు కనిపిస్తున్నాయట. ఆ దెబ్బకి ఆయన నిద్రపోవడమే మానేశాడు. నిద్రలేమితో ఆయన ఆరోగ్యం దెబ్బ తింటూ వచ్చింది. ఈ క్రమంలో.. ఓ జ్యోతిష్యుడ్ని కలిశాడు. తనకు నాగదోషం ఉందని చెప్పాడు. అదే అదను అనుకున్నాడేమో.. దోష పరిహారానికి ప్రత్యేక పూజలు చేయాలని ఏర్పాట్ల కోసం గట్టిగా డబ్బులు తీసుకున్నాడు. సమీపంలోని ఓ ఆలయానికి తీసుకెళ్లి.. నాగదోష పరిహార పూజలు చేయించాడు. ఆఖరి ఘట్టంగా.. 

తన వెంట బోనులో తెచ్చిన ఓ రస్సెల్‌ వైపర్‌ పామును రాజా ముందు ఉంచి.. మూడుసార్లు పాములా నాలుక ఆడించమన్నాడు. ఆయన నాలుక ఆడిస్తుండగా.. జ్యోతిష్యుడు ఏవో మంత్రాలు వల్లించాడు. ఈ క్రమంలో ముచ్చటగా మూడోసారి నాలుక ఆడించడగా.. బోనులోంచి సర్రుమని తల బయట పెట్టిన పాము, రాజా నాలుక మీద కాటేసింది. ఆ దెబ్బకు నొప్పితో విలవిలలాడిపోయాడు ఆయన. ఇది గమనించిన ఆ ఆలయ పూజారి పరిగెత్తుకుంటూ వచ్చి..  రాజాను రక్షించే ఉద్దేశంతో ఓ కత్తితో నాలుక కత్తిరించాడు. ఆలస్యం జరగకపోవడంతో అతని ప్రాణాలు నిలిచాయి. కానీ, నాలుక పోవడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. వెంటనే అతన్ని స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించారు. 

వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పాము విషానికి అతని నాలుక కణజాలం దెబ్బతింది. అయినప్పటికీ.. నాలుకను తిరిగి విజయవంతంగా సర్జరీ ద్వారా అతికించారు. వాపు తగ్గిన తర్వాత ఆయన ఇప్పుడు సాధారణంగా మాట్లాడగలిగే స్థితికి చేరడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. అత్యంత విషపూరితమైన రస్సెల్‌ వైపర్‌ను కలిగి ఉండడం, అంతకు మించి మోసం చేయడం తదితర నేరాల కింద ఆ జ్యోతిష్యుడిని కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు.

Advertisement

తప్పక చదవండి

Advertisement