సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం బలపరీక్ష నెగ్గింది. బుధవారం ఉదయం ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి విజయ్ ప్రవేశపెట్టగా.. కాంగ్రెస్, ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే(బహిష్కృత) కామరాజ్ నేరుగా.. వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలు బయటి నుంచి మద్దతు ప్రకటించాయి. అన్నాడీఎంకేలోని చీలిక వర్గం షణ్ముగం నేతృత్వంలోని ఎమ్మెల్యేలు కూడా బయటి నుంచి మద్దతు ఇవ్వడంతో విజయ్ ప్రభుత్వం బలపరీక్ష నెగ్గినట్లు జేసీడీ ప్రభాకర్ ప్రకటించారు.
తమిళనాడు అసెంబ్లీలో 234 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 144 మంది విజయ్ టీవీకే సర్కార్‌కు మద్దతు ప్రకటించారు. అసెంబ్లీ నుంచి 61 మంది వాకౌట్(డీఎంకే సభ్యులతో పాటు) చేయగా.. 22 మంది విజయ్ సర్కార్‌కు వ్యతిరేకంగా ఓటేశారు. బీజేపీ, పీఎంకే సభ్యులు ఐదుగురు గైర్హాజరు అయ్యారు. బలపరీక్ష విషయంలో తటస్థంగా ఉన్నట్లు బీజేపీ తర్వాత ఓ ప్రకటన విడుదల చేసింది.
విజయ్ ధన్యవాదాలు
తమిళనాడు అసెంబ్లీలో బలనిరూపణ వేళ.. ముఖ్యమంత్రి విజయ్ కీలక ప్రకటన చేశారు. ‘‘నాకు మద్దతు ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. సామాన్యుల ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మాటిచ్చాం. ప్రజలు మాపై నమ్మకం ఉంచారు. కోటి 72 లక్షల మంది మాకు ఓటేశారు. అతిపెద్ద పార్టీగా ప్రజలు మమ్మల్ని ఇక్కడికి పంపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మాకు మద్దతు ఇచ్చారు. కాబట్టి ప్రజా భద్రతే మాకు ముఖ్యం..
.. మేం నిజమైన లౌకిక ప్రభుత్వాన్ని నడిపిస్తాం. అదే మా లక్ష్యం. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం మేం ప్రయత్నించలేదు.మా ప్రభుత్వం రేసు గుర్రంలా పరిగెడుతుంది. వేరే గుర్రాలను కొనాల్సిన అవసరం లేదు. మమ్మల్ని వ్యతిరేకించిన వాళ్లకు కూడా మంచి పాలన అందిస్తాం. ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. గత ప్రభుత్వంలోని మంచి పథకాలను కొనసాగిస్తాం. మా ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. మా ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకుంటుంది’’ అని అన్నారు.
అంతకు ముందు.. చర్చ సందర్బంగా ఒక్కో పార్టీ విజయ్ టీవీకేకు మద్దతు ఇస్తూ వచ్చింది. అయితే అన్నాడీఎంకే వంతు వచ్చేసరికి హైడ్రామా మొదలైంది. ఆ పార్టీ ఎమ్మెల్యే వేలుమణికి మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం ఇచ్చారు. అయితే ఒక రెబల్ ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వడం ఏంటని అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలుమణి ప్రసంగాన్ని అడ్డుకుని.. సంచలన ఆరోపణలకు దిగారు.
ఏ పార్టీలో అయిన విబేధాలు సహజం. మా పార్టీ విషయంలో సీఎం తీరు సరికాదు. ఆయన మా రెబల్ వర్గ ఎమ్మెల్యేలను ఎందుకు కలిశారు?. వాళ్లతో ఆయనకేం పని?. ఆయన మా తమ ఎమ్మెల్యేలకు ఎర వేస్తున్నారు. డబ్బుతో కొనాలని చూస్తున్నారు? అని పళని ఆరోపించారు. ఈ క్రమంలో అసెంబ్లీ సాక్షిగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండుగా చీలి వాగ్వాదానికి దిగారు. మాకు పదవులు వద్దు.. టీవీకేకు మా మద్దతు అంటూ రెబల్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. టీవీకేకు మేం మద్దతు ఇవ్వబోం అని పళని వర్గం నినాదాలు చేసింది. చివరకు చేసేది లేక పళనిస్వామి వర్గం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది.
ఉదయనిధి సంచలన ఆరోపణలు
ప్రజామోదం పొందడంలో టీవీకే విఫలమైందని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ విమర్శలు గుప్పించారు. 65 శాతం ఓటర్లు విజయ్‌ను తిరస్కరించారు. టీవీకేకు వ్యతిరేకంగా 3.1 కోట్ల మంది ఓటేశారు. విజయ్‌కి తన మీద తనకు నమ్మకం లేకపోవడం వల్లే రెండు చోట్ల పోటీ చేశారు. ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి టీవీకేకు లేదు. డీఎంకే కూటమిలోని పార్టీలు మద్దతు ఇస్తున్నాయన్న సంగతి మరిచిపోవద్దు.
టీవీకే హార్స్ ట్రేడింగ్‌కు పాల్పడుతోంది. కొందరు ఎమ్మెల్యేలు డబ్బుకు అమ్ముడుపోయారు. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలను సీఎం కలవడం విడ్డూరం. సీఎం కన్నా ముందుసోఫాసెట్లు వెళ్తున్నాయి. ఆ తర్వాత పూల గుచ్ఛాలతో సీఎం వెళ్తున్నారు. ఆ సమయంలో.. ఉదయనిధి ప్రసంగాన్ని ఏఎంఎంకే ఎమ్మెల్యే(బహిష్కృత) కామరాజ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో డీఎంకే ఎమ్మెల్యేలు కూడా వాకౌట్ చేశారు.
ఓటింగ్..
విజయ్ సర్కార్ బలనిరూపణ కోసం ఓటింగ్ జరిగింది. టీవీకేకు బల నిరూపణకు కావాల్సిన సంఖ్య 118. బలనిరూపణ ఓటింగ్ సందర్భంగా మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేల పేర్లు చదివి వినిపించగా.. ఒక్కొక్కరు లేచి తమ హాజరును ప్రదర్శించారు. టీవీకే ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, ఐయూఎంల్, వీసీకే, ఏఎంఎంకే రెబల్ ఎమ్మెల్యే మద్దతు ప్రకటించారు. అన్నాడీఎంకేలో రెబల్ ఎమ్మెల్యేలు(షణ్ముగం వర్గం 25 మంది) విజయ్‌కు సపోర్ట్‌గా లేచి నిలబడ్డారు.
కాంగ్రెస్, ఇతరులు ఏమన్నారంటే..
విజయ్ ప్రభుత్వం కావాలని ప్రజలు ఎన్నుకున్నారు. ఈ ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించాలి.. భరోసా కల్పించాలి. ఖర్గే, రాహుల్ ఆదేశాల మేరకు విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాం అని కాంగ్రెస్ ప్రకటించింది. తమిళనాడులో బీజేపీ కుట్రలు చేసింది.. వాటిని అడ్డుకున్నాం. రాష్ట్రంలో గవర్నర్ పాలన రాకూడదనే మద్దతు ఇచ్చాం అని వామపక్షాలు తెలిపాయి. రాష్ట్ర హక్కుల విషయంలో విజయ్ ప్రభుత్వం రాజీ పడకూడదు. డీలిమిటేషన్‌పై కేంద్రంతో విజయ్ పోరాడాలి. మూఢ నమ్మకాల నిర్మూలనకు ప్రత్యేక చట్టం తేవాలి. జ్యోతిష్యుడి సలహాలతో పాలించకూడదు అని వీసీకే తెలిపింది.
Tamil Nadu Legislative Assembly: Confidence motion moved in support of the Council of Ministers led by Chief Minister Vijay. pic.twitter.com/uxT0BMzNoY
— Vijay Fans Trends (@VijayFansTrends) May 13, 2026


