హద్దులన్నీ దాటుతోంది | Supreme Court stays ED money laundering investigation | Sakshi
Sakshi News home page

హద్దులన్నీ దాటుతోంది

May 23 2025 1:36 AM | Updated on May 23 2025 7:17 AM

Supreme Court stays ED money laundering investigation

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తీరును తూర్పారబట్టిన సర్వోన్నత న్యాయస్థానం

సమాఖ్య పాలన భావనను ఈడీ కాలరాస్తోంది 

ఒక ప్రభుత్వ కార్పొరేషన్‌ నేరం ఎలా చేయగలదు?  

టాస్మాక్‌పై ఈడీ దర్యాప్తు చట్టవిరుద్ధంగా సాగుతోంది 

అన్ని ఉల్లంఘనలకు పాల్పడుతోంది 

తమిళనాడు రాష్ట్ర లిక్కర్‌ రిటైలర్‌ సంస్థపై ఈడీ మనీలాండరింగ్‌ దర్యాప్తుపై స్టే విధించిన సుప్రీంకోర్టు 

స్వాగతించిన తమిళనాడు ప్రభుత్వం 

ఈడీ దుర్వినియోగాన్ని బీజేపీ మానుకోవాలని డీఎంకే హితవు 

ఈడీ రాష్ట్రాల హక్కుల్ని అన్యాయంగా బలవంతంగా లాక్కుంటోందన్న తమిళనాడు సర్కార్‌ 

సోదాలు, జప్తులకు చట్టబద్ధత ఉందా? అని నిలదీత

న్యూఢిల్లీ/చెన్నై: దేశంలో సమాఖ్య పాలన భావనను తీవ్రంగా ఉల్లంఘిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) బరితెగించి ఇష్టారీతిగా ప్రవర్తిస్తోందని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. తనకు ఇష్టమొచ్చినట్లు దర్యాప్తు చేయడం కోసం హద్దులను మీరి మరీ విపరీత పోకడలతో కేసు దర్యాప్తును ముందుకు తీసుకెళ్తోందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

తమిళనాడు రాష్ట్ర మద్యం రిటైలర్‌ సంస్థ అయిన ‘‘తమిళనాడు స్టేట్‌ మార్కెటింగ్‌ కార్పొరేషన్‌(టాస్మాక్‌)’’పై నిబంధనలకు విరుద్ధంగా మనీలాండరింగ్‌ కేసు దర్యాప్తు జరుపుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మాసిహ్‌ల ధర్మాసనం గురువారం ఈడీపై ఆగ్రహ అక్షింతలు చల్లింది. 

తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే టాస్మాక్‌ కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేస్తోందని, ఉన్నతాధికారులను ముఖ్యంగా మహిళలను గంటల తరబడి వేధించి, భయపెడుతోందని తమిళనాడు ప్రభుత్వం, టాస్మాక్‌ వేసిన పిటిషన్‌ను గురువారం సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈడీ దర్యాప్తు తీరును తీవ్రంగా ఆక్షేపించింది. వెంటనే తమిళనాడు రాష్ట్ర లిక్కర్‌ రిటైలర్‌ సంస్థపై ఈడీ మనీలాండరింగ్‌ దర్యాప్తుపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. 

తిట్లతో తలంటు 
డీఎంకే సర్కార్, టాస్మాక్‌ తరఫున సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌ సిబల్, అమిత్‌ ఆనంద్‌ తివారీలు వాదించారు. ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజుకు సుప్రీంకోర్టు తిట్లతో తలంటు పోసింది. ‘‘ఒక ప్రభుత్వ కార్పొరేషన్‌ అనేది నేరం ఎలా చేయగలదు?. ఈడీ అన్ని చట్టబద్ధ హద్దులను దాటేసి ఇష్టారీతిగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ సమాఖ్య విధానానికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా అన్ని రకాల ఉల్లంఘనలకు పాల్పడుతోంది’’అని సీజేఐ జస్టిస్‌ గవాయ్‌ అసహనం వ్యక్తంచేశారు. 

ఈడీ దర్యాప్తు చట్టవిరుద్ధంగా సాగుతోందని, అందుకే వెంటనే దర్యాప్తుపై స్టే విధిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. వెంటనే అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు కల్పించుకుని ‘‘దర్యాప్తును ఆపకండి. దాదాపు రూ.1,000 కోట్ల అక్రమాలు జరిగాయి. కనీసం ఈ ఒక్క కేసులోనైనా ఈడీ హద్దులు దాటలేదని భావించండి’’అని    వేడుకున్నారు. రాజు వాదనలను కపిల్‌ సిబల్‌ తప్పుబట్టారు. ‘‘మద్యం దుకాణాల లైసెన్సుల జారీ అంతా సక్రమంగా ఉన్నాసరే అక్రమాలు జరిగాయని అనవసరంగా నేర విచారణను ఈడీ మొదలెట్టింది. 2014 ఏడాది నుంచి ఇప్పటిదాకా అక్రమంగా డైరెక్టరేట్‌ ఆఫ్‌ విజిలెన్స్, అవినీతి నిరోధక విభాగాలతో తప్పుడు ఫిర్యాదులు ఇప్పించి 41 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయించారు. 

ఇప్పుడు కొత్తగా ఈడీ రంగంలోకి దిగి అన్యాయంగా టాస్మాక్‌ కార్యాలయాలపై చట్టవ్యతిరేకంగా దాడులు చేస్తోంది. మహిళా అధికారులను గంటల తరబడి టాస్మాక్‌ ఆఫీసుల్లోనే నిర్బంధించి ఈడీ అధికారులు వేధించారు. వ్యక్తిగత వస్తువులను లాక్కుని గోప్యతకు, ప్రాథమిక హక్కులకు భంగం కల్గించారు’’అని సిబల్‌ వాదించారు. ఈడీ దర్యాప్తును సమర్థిస్తూ ఏప్రిల్‌ 23వ తేదీన మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, టాస్మాక్‌ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెల్సిందే. 
 


రాష్ట్రాల హక్కులను కూలదోస్తోంది 
సుప్రీంకోర్టులో తమిళనాడు సర్కార్‌ సైతం తన వాదనలను బలంగా వినిపించింది. ‘‘ఈడీ ప్రవర్తన సమాఖ్య విధానాన్ని కూలదోసేలా ఉంది. రాష్ట్రాల హక్కులను ఈడీ కాలరాస్తోంది. తమ పరిధిలోని నేరాల విచారణ రాష్ట్రాలకు సంబంధించిన విషయంకాగా ఈడీ రాష్ట్రాల హక్కులను అన్యాయంగా, బలవంతంగా లాక్కుంటోంది’’అని తమిళనాడు ప్రభుత్వం వాదించింది. ఈఏడాది మార్చి ఆరో తేదీ నుంచి మార్చి 8వ తేదీదాకా ఏకధాటిగా 60 గంటలపాటు రాష్ట్రంలో ఈడీ చేసిన సోదాలు, తనిఖీలు, దాడులు, జప్తుల పర్వానికి చట్టబద్ధత ఉందా? అని తమిళనాడు సర్కార్‌ ఈడీని సుప్రీంకోర్టులో నిలదీసింది. 

‘‘మార్చి ఆరో తేదీన టాస్మాక్‌ ప్రధాన కార్యాలయంలో మనీలాండరింగ్‌ నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17 ప్రకారం సోదాలు, జప్తులు చేశామని ఈడీ చెబుతోంది. కానీ టాస్మాక్‌ అనేది పూర్తిగా రాష్ట్ర పరిధిలోని సంస్థ. ఇప్పటిదాకా అక్రమంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌లలో ఏ ఒక్క దాంట్లోనూ టాస్మాక్‌ పేరును ‘నిందితుల జాబితా’లో పేర్కొనలేదు. ఎలాంటి ఆరోపణలు లేని, నిందితుల జాబితాలో లేని సంస్థ పరిధిలో, ప్రాంగణాల్లో ఈడీకి విచారణ, దర్యాప్తు చేసే హక్కు లేదు. పీఎంఎల్‌ఏ చట్టం సైతం ఇదే విషయాన్ని స్పష్టంచేస్తోంది’’అని తమిళనాడు సర్కార్‌ కోర్టులో వాదించింది. 

‘‘2021లో చివరిసారిగా ఎఫ్‌ఐఆర్‌ నమోదైతే ఇంత ఆలస్యంగా సోదాలు చేయడమేంటి?. పీఎంఎల్‌ఏ చట్టంలోని సెక్షన్‌ 17 ప్రకారం నమ్మశక్యమైన కారణాలు ఉంటేనే దర్యాప్తు/సోదాలు జరపాలి. కానీ ఈడీ ఈ నిబంధనను గాలికొదిలేసింది. సరైన లక్ష్యంలేకుండా రంగంలోకి దూకి అడ్డదిడ్డంగా దర్యాప్తు చేస్తోంది’’అని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. ఈడీని సుప్రీంకోర్టు ఇదే తొలిసారి కాదు. గతంలోనూ చాలా కేసుల్లో పలు సుప్రీంకోర్టు ధర్మాసనాలు ఈడీ వైఖరిని తప్పుబట్టాయి. మనీ లాండరింగ్‌ చట్ట నిబంధనలను దుర్వినియోగం చేస్తున్నారని సర్వోన్నత న్యాయస్థానం ఆక్షేపించింది. 

బీజేపీకి చెంపదెబ్బ: సుప్రీంకోర్టు నిర్ణయంపై డీఎంకే వ్యాఖ్య 
టాస్మాక్‌ కేసులో సుప్రీంకోర్టు స్టే నిర్ణయం కేంద్రంలోని బీజేపీకి చెంపదెబ్బలా తగిలిందని తమిళనాడులోని పాలక డీఎంకే పార్టీ వ్యాఖ్యానించింది. ఈ మేరకు డీఎంకే సీనియర్‌ నాయకుడు, పార్టీ కార్యదర్శి(వ్యవస్థాగతం) ఆర్‌ఎస్‌ భారతి గురువారం చెన్నైలో మీడియాతో మాట్లాడారు. ‘‘టాస్మాక్‌ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులను మేం స్వాగతిస్తున్నాం. 2014లో మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ అధికారంలోని లేని రాష్ట్రాలపై ఈడీని ఉసిగొల్పుతున్నారు. 

2021లో తమిళనాడులో ఎంకే స్టాలిన్‌ సారథ్యంలో డీఎంకే సర్కార్‌ కొలువుతీరాక ఈ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఈడీని రంగంలోకి దింపారు. తాజాగా కోర్టు ఉత్తర్వులు చూశాకైనా బీజేపీ ఈడీని దుర్వినియోగం చేయడం మానుకుంటే మంచిది. తమిళనాడులో మరో 7–8 నెలల్లో శాసనసభ ఎన్నికలున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకునే ఈడీ సోదాలు చేసింది’’అని ఆర్‌ఎస్‌ భారతి అన్నారు. కోర్టు నిర్ణయాన్ని విపక్ష పారీ్టలు సైతం స్వాగతించాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement