లైంగిక వేధింపులు: రాఖీ కడితే సరిపోతుందా?! | Supreme Court Serious On Madhya Pradesh High Court Judgement | Sakshi
Sakshi News home page

రాఖీ కట్టించుకోవడం.. బెయిల్‌ కండిషనా?

Mar 19 2021 9:09 AM | Updated on Mar 19 2021 1:36 PM

Supreme Court Serious On Madhya Pradesh High Court Judgement - Sakshi

క్షమాపణలు, సామాజిక సేవ, రాఖీ కట్టించుకోవడం, బహుమతుల ద్వారానో, పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడం ద్వారానో సమసిపోయే చిన్న తప్పు కాదిది..

సాక్షి, న్యూఢిల్లీ: లైంగికదాడి కేసులో బెయిల్‌ ఇచ్చేందుకు నిందితుడు బాధితురాలితో రాఖీ కట్టించుకోవాలంటూ నిబంధన విధించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. న్యాయవ్యవస్థ ఇచ్చే ఇలాంటి ఆదేశాలతో వేధించిన వ్యక్తిని సోదరుడిగా మార్చినట్లయిందని వ్యాఖ్యానించింది. మధ్యప్రదేశ్‌ హైకోర్టు వెలువరించిన ఆదేశాలను తప్పుపట్టిన న్యాయస్థానం లైంగిక దాడి కేసుల విచారణ సమయంలో జడ్జీలు పాటించాల్సిన పలు మార్గదర్శకాలను జారీ చేసింది. లైంగిక దాడి బాధితుల గత ప్రవర్తన, వారి వస్త్ర ధారణ, వారి పరస్పర విరుద్ధ వైఖరుల వంటి వాటిని తీర్పులిచ్చే సమయంలో ప్రస్తావించరాదని స్పష్టం చేసింది.

‘బెయిల్‌ దరఖాస్తుదారు తన భార్యాసమేతంగా 2020 ఆగస్టు 3వ తేదీ ఉదయం11 గంటలకు బాధితురాలి ఇంటికి రాఖీ, స్వీట్లు తీసుకుని వెళ్లాలి. ఆమెతో రాఖీ కట్టించుకుని, అన్ని వేళలా రక్షణగా నిలుస్తానని వాగ్దానం చేయాలి’అని తీర్పులో పేర్కొంది. ఈ తీర్పు అక్రమమంటూ 9మంది పౌరులు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్‌ ఎస్‌.రవీంద్ర భట్‌ల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టి మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఉత్తర్వులను పక్కనబెట్టింది. ఇటువంటి తీర్పులు కేసు తీవ్రతను ముఖ్యంగా లైంగిక వేధింపుల విషయంలో తక్కువ చేస్తాయని పేర్కొంది. చట్టం ప్రకారం బాధితురాలిపై జరిగిన నేరం.. క్షమాపణలు, సామాజిక సేవ, రాఖీ కట్టించుకోవడం, బహుమతుల ద్వారానో, పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడం ద్వారా సమసిపోయే చిన్న తప్పు కాదని తెలిపింది. ఇటువంటి విషయాలపై జడ్జీలు, లాయర్లు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లకు అవగాహన కల్పించాలని బార్‌ కౌన్సిల్‌కు సూచించింది. 

చదవండి: మరాఠాలు వెనుకబడిన వర్గం కాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement