ఒకే రూట్‌.. ఛార్జీల్లో ఇంత తేడానా?  | Supreme Court questions huge fare gap among airlines on same routes | Sakshi
Sakshi News home page

ఒకే రూట్‌.. ఛార్జీల్లో ఇంత తేడానా? 

May 16 2026 12:28 AM | Updated on May 16 2026 12:28 AM

Supreme Court questions huge fare gap among airlines on same routes

విమానయాన సంస్థల తీరుపై సుప్రీంకోర్టు ఆందోళన 

ధరల నిర్ణయంలో హేతుబద్ధత తప్పనిసరని వ్యాఖ్య

సాక్షి, న్యూఢిల్లీ: పండుగలు, సెలవు దినాల్లో విమానయాన సంస్థలు ఇష్టానుసారంగా టిక్కెట్‌ ఛార్జీలు పెంచడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఒకే రోజు, ఒకే మార్గంలో నడిచే విమానాలకు వేర్వేరు సంస్థలు భారీ వ్యత్యాసంతో ఛార్జీలు వసూలు చేయడాన్ని తప్పుబట్టింది. ప్రయాణికుల నుంచి వసూలు చేసే ధరల నిర్ణయంలో హేతుబద్ధత ఉండాలని స్పష్టం చేసింది. 

విమాన ఛార్జీలను అకారణంగా, అకస్మాత్తుగా పెంచడంపై నియంత్రణకు మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ సామాజిక కార్యకర్త ఎస్‌.లక్ష్మీనారాయణన్‌ వేసిన పిటిషన్‌పై జస్టిస్‌ విక్రమ్‌ నాథ్, జస్టిస్‌ సందీప్‌ మెహతాల ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పండుగలు, సెలవుల సమయాల్లో విమానయాన సంస్థలు ఛార్జీలను 300 శాతం మేర పెంచుతున్నాయని పిటిషనర్‌ తరఫు లాయర్‌ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. 

ఈ విధానాన్ని అడ్డుకునేందుకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ)కు అధికారాలు ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. కేంద్రం, డీజీసీఏ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ.. ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్య వాస్తవమేనని అంగీకరించారు. కొత్తగా ’భారతీయ వాయుయాన్‌ అధినియం–2024 చట్టం అమల్లోకి వచ్చిందని, టిక్కెట్‌ ధరల నియంత్రణకు అవసరమైన నిబంధనల రూపకల్పన జరుగుతోందని ఆయన తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం విమాన ఛార్జీల్లో తీవ్ర అంతరంపై కేంద్రం దృష్టి సారించాలని సూచించింది.

 ‘ఒకే రోజు, ఒకే సెక్టార్‌కు వెళ్లే విమానాల్లో ఎకానమీ క్లాస్‌కు ఒక సంస్థ రూ.8 వేలు వసూలు చేస్తే, మరో సంస్థ ఏకంగా రూ.18వేలు వసూలు చేస్తోంది. ఈ వ్యత్యాసాన్ని సరిచేసి ప్రయాణికులకు కొంత ఊరట కల్పించండి. ఇది కేవలం వేసవి సెలవులకే పరిమితమైన అంశం కాదు, ప్రజలు నిత్యం ఎదుర్కొనే సమస్య‘అని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో డీజీసీఏ ఇదివరకే దాఖలు చేసిన అఫిడవిట్‌ను ధర్మాసనం పరిశీలించింది. ఆ అఫిడవిట్‌కు కౌంటర్‌ దాఖలు చేసేందుకు పిటిషనర్‌కు సమయమిచ్చింది. తదుపరి విచారణను వేసవి సెలవుల అనంతరం జూలై 13వ తేదీకి వాయిదా వేసింది.  

Advertisement
 
Advertisement
Advertisement