న్యూఢిల్లీ: వర్షాకాలం ముగిసినప్పటికీ ఢిల్లీతో పాటు జాతీయ రాజధాని ప్రాంతంలో అక్టోబర్ 12న పిడుగులతో భారీ వర్షం, మెరుపులు, ఉరుములు నమోదయ్యాయి. అంతకుముందు రాత్రి నుంచే వర్షాలు మొదలయ్యాయి. ఈ ఆకస్మిక వాతావరణ మార్పులకు ప్రస్తుతం కొనసాగుతున్న సూపర్ ఎల్‌నినోతో పాటు ఉత్తర భారతదేశంలో చురుగ్గా ఉన్న పశ్చిమ అలజడి కారణమని నిపుణులు వివరించారు. భారతీయ విజ్ఞాన సంస్థ (ఐఐఎస్‌సీ)లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ (ఎన్‌ఐఏఎస్)లో ఛైర్ ప్రొఫెసర్, సఫర్ వ్యవస్థాపక డైరెక్టర్ గుఫ్రాన్ బేగ్ ఈ వాతావరణ మార్పులపై వివరించారు.
సూపర్ ఎల్‌నినో ప్రభావం
ప్రస్తుతం ఏర్పడుతున్న ఎల్‌నినో సాధారణ స్థాయికి భిన్నమైన, అత్యంత బలమైన సూపర్ ఎల్‌నినో అని గుఫ్రాన్ బేగ్ తెలిపారు. గత దశాబ్దంలో కనిపించిన సాధారణ ఎల్‌నినో పరిస్థితులతో పోలిస్తే ఇది మరింత తీవ్రంగా ఉందన్నారు. దీని ప్రభావాలు ఇప్పటికే భారత్‌లో కనిపిస్తున్నాయని, ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలం ముగిసే సమయానికి సాధారణం కంటే సుమారు 13 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని వివరించారు.
అయితే, వివిధ ప్రాంతాల్లో వర్షపాతం తీరులో గణనీయమైన వ్యత్యాసాలు ఉన్నాయని పేర్కొన్నారు. పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు 3.2 డిగ్రీల సెల్సియస్ పెరిగాయని, రానున్న రెండు నెలల్లో ఈ పెరుగుదల రికార్డు స్థాయిలో 3.5 డిగ్రీల సెల్సియస్‌కు చేరవచ్చని ఆయన తెలిపారు. దీంతో రానున్న శీతాకాలం సాధారణంగా కొంత వెచ్చగా ఉండటంతో పాటు ఉష్ణోగ్రతల్లో ఆకస్మిక, అనూహ్య మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందన్నారు.
ఢిల్లీలో భారీ వర్షాలకు కారణమేంటి?
సాధారణంగా రుతుపవనాల ఉపసంహరణ తర్వాత ఇలాంటి వర్షాలు అరుదుగా కనిపిస్తాయి. అసాధారణ గాలుల ప్రసరణ కారణంగా ఎగువ వాతావరణ పొరలు సాధారణం కంటే వెచ్చగా ఉన్నాయని బేగ్ వివరించారు. అదే సమయంలో ఉత్తర భారతదేశంలో చురుగ్గా ఉన్న పశ్చిమ అలజడి (పశ్చిమ దిశ నుంచి భారత్ వైపు కదులుతూ ఉత్తర భారతదేశంలో వర్షాలు, మంచు కురిసేలా చేసే వాతావరణ వ్యవస్థ) ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో అనూహ్యంగా భారీ వర్షాలు, ఉరుములు, పిడుగులకు దారితీసిందన్నారు.
“చల్లని పశ్చిమ అలజడి మేఘాలు ఢిల్లీ పరిసర మైదానాలపై ఉన్న వేడి, తేమతో కూడిన గాలిని నేరుగా ఢీకొన్నట్లు భావించవచ్చు. నీటితో పూర్తిగా నిండిన స్పాంజ్‌ను పిండినప్పుడు నీరు బయటకు వచ్చినట్లుగా, వాతావరణంలో చిక్కుకున్న తేమ ఒక్కసారిగా వర్షం రూపంలో కురిసింది” అని ఆయన వివరించారు.
దేశవ్యాప్తంగా వర్ష సూచనలు
భారత వాతావరణ విభాగం ప్రకారం.. నైరుతి రుతుపవనాలు దేశంలోని మిగిలిన ప్రాంతాల నుంచి కూడా వెనక్కి వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. ఇదే సమయంలో రానున్న 2-3 రోజుల్లో దక్షిణ ద్వీపకల్పంలో ఈశాన్య రుతుపవనాలు ప్రారంభం కానున్నాయి. గత 24 గంటల్లో జమ్మూ కశ్మీర్‌లో 12-20 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షపాతం నమోదైంది.
అండమాన్ నికోబార్ దీవులు, హరియాణాలో 7-11 సెంటీమీటర్ల భారీ వర్షాలు కురిశాయి. ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన పడింది. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 31–35 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని, మేఘావృతమైన ఆకాశంతో పాటు అప్పుడప్పుడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని వాతావరణ విభాగం అంచనా వేసింది.
అక్టోబర్ 14-15 తేదీల్లో ఢిల్లీ, పంజాబ్, హరియాణా, చండీగఢ్ ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశముంది. దక్షిణ భారతదేశంలోనూ ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రానున్న 5-6 రోజులు వర్షాలు కొనసాగవచ్చని అంచనా. ముఖ్యంగా అక్టోబర్ 15-18 మధ్య కేరళ, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు వాతావరణ హెచ్చరికలను గమనించాలి.


