నిరసనల వేళ.. ఢిల్లీకి ఐఎండీ రెడ్‌ అలర్ట్‌ | IMD Issues Red Alert For All 11 Districts Of Delhi As Heavy Rain And Strong Winds Prompt Six Metro Stations To Close | Sakshi
Sakshi News home page

నిరసనల వేళ.. ఢిల్లీకి ఐఎండీ రెడ్‌ అలర్ట్‌

Oct 12 2026 9:06 AM | Updated on Oct 12 2026 9:53 AM

IMD Red Alert To Delhi Heavy rains to 11 Districts

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారింది. భారీ వర్షాలు, ఈదురుగాలుల హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ ఢిల్లీకి రెడ్‌ అలర్ట్‌ విధించింది. జంతర్‌ మంతర్‌ వద్ద కూడా రాత్రి భారీ వర్షం కురిసింది. మరోవైపు, కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రతిపక్షాల నిరసన ప్రదర్శన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతో ఢిల్లీలోని ఆరు ప్రధాన మెట్రో స్టేషన్లలో ప్రవేశం, నిష్క్రమణను తాత్కాలికంగా నిలిపివేశారు.

భారత వాతావరణ శాఖ (IMD) ఢిల్లీలోని మొత్తం 11 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. సోమవారం ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని సూచించింది. ఢిల్లీతో పాటు పొరుగున ఉన్న హర్యానా, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు కూడా ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

 

మెట్రో స్టేషన్ల మూసివేత
మరోవైపు.. కాంగ్రెస్‌ పిలుపు మేరకు ప్రతిపక్షాలు సోమవారం సుప్రీంకోర్టు వైపు నిరసన మార్చ్‌ చేపట్టనున్న నేపథ్యంలో భద్రతా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పటేల్‌ చౌక్‌, జన్‌పథ్‌, రాజీవ్‌ చౌక్‌, మండి హౌస్‌, సెంట్రల్‌ సెక్రటేరియట్‌, బరాఖంబా రోడ్‌ మెట్రో స్టేషన్లలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మూసివేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (DMRC) ప్రకటించింది. అయితే, ఈ స్టేషన్లలో మెట్రో మార్గాలు మార్చుకునేందుకు ఇంటర్‌చేంజ్‌ సౌకర్యం అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. 

భద్రతా పరిస్థితులను సమీక్షించి అవసరమైన మార్పులు ప్రకటిస్తామని తెలిపింది. కాగా, భద్రతా ఏర్పాట్ల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ అంతరాయాలు, మళ్లింపులు ఉండే అవకాశం ఉందని ట్రాఫిక్‌ పోలీసులు హెచ్చరించారు. ప్రయాణికులు ముందుగానే తమ ప్రయాణాలను ప్లాన్‌ చేసుకోవాలని సూచించారు. భారీ వర్షాల హెచ్చరికలు, నిరసనల నేపథ్యంలో ఢిల్లీ ప్రజలు వాతావరణ శాఖ, పోలీసు విభాగాల తాజా సూచనలను గమనించడం అవసరం.

ఇదీ చదవండి: భారత్‌పై ఎల్‌నినో డేంజర్‌ బెల్స్‌.. 1972 నాటి విలయం తప్పదా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement