జంతర్‌మంతర్ వైపు దూసుకెళ్లేందుకు నిరసనకారుల యత్నం
200 మందికిపైగా నిరసనకారుల అరెస్టు
విద్యార్థి నాయకురాలు నేహా బోరాను ఈడ్చుకెళ్లిన పోలీసులు
షరతులతో ముగ్గురు సీజేపీ నేతల విడుదల
నేడు ఇండియా కూటమి పార్టీల భారీ నిరసన
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) మూటున కోట్లాది ఓటర్ల ఓటు హక్కును హరించాడని విపక్షాలు, విద్యార్థి, సామాజిక సంఘాల నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో ఢిల్లీలో కాక్రోచ్ జనతాపార్టీ వరుసగా రెండోరోజు సైతం నిరసనలతో హోరెత్తించింది.
సీజేపీ పిలుపు మేరకు నిరసనకారులు కన్నాట్‌ప్లేస్‌లోని ఇన్నర్‌సర్కిల్ నుంచి రాజీవ్‌చౌక్ వైపు పెద్దసంఖ్యలో కార్యకర్తలు జంతర్‌మంతర్ వైపు దూసుకెళ్లారు. అయితే బారీకేడ్లతో వాళ్లను పోలీసులు అడ్డుకున్నారు. కార్యకర్తల ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది. పోలీసులు వారిని ఎక్కడికక్కడ నిలువరించి నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆదివారంనాటి నిరసనల్లో 200 మందికిపైగా ఉద్యమకారులను పోలీసులు అరెస్ట్‌చేశారు.
వీళ్లను ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఎస్‌ఎఫ్‌ఐ), ఏఐఎస్‌ఏ), కేవైఎస్ తదితర విద్యార్థి సంఘాల సభ్యులను అరెస్టు చేశారు. సీపీఎం రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్, ఏఐఎస్‌ఏ అధ్యక్షురాలు నేహా బోరా తదితరులనూ నిర్బంధంలోకి తీసుకున్నారు. నేహా చేతులు, కాళ్లను పట్టుకుని మహిళా పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. జంతర్‌మంతర్‌కు చాలా దూరంలో ఉన్న సాధారణ ప్రజలను సైతం పోలీసులు ముందుజాగ్రత్తగా అదుపులోకి తీసుకోవడం విమర్శలకు తావిచ్చింది.
మోదీ ఓటమిని అంగీకరించారు: దీప్కే
ప్రధాని మోదీపై సీజేపీ కనీ్వనర్ అభిజీత్ దీప్కే ‘ఎక్స్’ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. నిరసనలు ప్రారంభం కాకముందే మోదీ ఓటమిని అంగీకరించారని ఎద్దేవా చేశారు. నిరసనకారులను అణచివేయడం, ఢిల్లీలో ఆంక్షలు విధించడం బలానికి సంకేతాలు కావని పేర్కొన్నారు. ప్రజలను చూసి పాలకులు భయపడుతున్నారని చెప్పడానికి ఇది నిదర్శనమని ఉద్ఘాటించారు. అక్టోబర్ 10వ తేదీ నియంతృత్వ పాలన అంతానికి నాంది పలికిన రోజుగా నిలిచిపోతుందన్నారు. ఆయన ఆదివారం మహారాష్ట్రలోని నాగపూర్ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు.
తాము మళ్లీ వీధుల్లోకి వస్తామని ప్రకటించారు. తాను పోలీసుల అదుపులో ఉన్నప్పుడు ఫోన్ వాడుకోనివ్వలేదని, తన న్యాయవాదితో మాట్లాడేందుకు అనుమతించలేదని అభిజీత్ దిప్కే ఢిల్లీ పోలీసులపై ఆరోపణలు చేశారు. ‘‘నానమ్మను కోల్పోయిన తర్వాత మా కుటుంబాన్ని ఇంకా ఎంతటి మానసిక వేదనకు గురిచేయాలనుకున్నారు? తెల్లవారుజామున 3:30 గంటలకు మా తల్లిదండ్రులకు ఫోన్ చేయాలని చెప్పడంలో పోలీసుల ఉద్దేశం ఏమిటి? వారిని హింసించాలనుకున్నారా?’’ అని దీప్కే ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిరసనకారులకు వైద్య, న్యాయ సహాయం
ఢిల్లీలో నిరసనకారులకు వాలంటీర్లు, వైద్యులు, న్యాయవాదులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లతో కూడిన ఒక నెట్‌వర్క్ ముందుకొచ్చి వైద్య సహాయం, న్యాయ సహాయం వరకు అందిస్తోంది. నిరసనకారులకు మద్దతుగా ప్రస్తుతం 130 మందికి పైగా పనిచేస్తున్నారని ఒక సీజేపీ వలంటీర్ సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు. నిర్బంధం నుంచి విడుదలైన తర్వాత ఇంటికి తిరిగి వస్తున్న వారికి రవాణా సౌకర్యం ఏర్పాటు చేసే లక్ష్యంతో ‘డిటెయినీ ఘర్ వాపసీ యోజన’, గాయపడినవారికి సహాయం చేయడానికి వైద్యులతో, వాలంటీర్లతో ‘ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఫస్ట్ ఎయిడ్ నెట్‌వర్క్’ పని చేస్తున్నాయి. తమకు మద్దతు ఇవ్వడానికి చాలామంది స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని సీజేపీ నేతలు వెల్లడించారు.
ఇక దేశవ్యాప్త నిరసనలు: సీజేపీ
జ్ఞానేశ్ రాజీనామా చేసేదాకా తమ పోరాటం ఆగదని సీజేపీ తేల్చిచెప్పింది. ఎస్‌ఐఆర్‌లో అక్రమాలపై నిరసన ఇక దేశవ్యాప్తంగా విస్తరిస్తుందని ప్రకటించింది. శనివారం ఢిల్లీలో ఆందోళన సందర్భంగా అరెస్టయిన సీజేపీ నేతలు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఆదివారం కోర్టు ఆదేశాలతో విడుదలయ్యారు. అనంతరం దాస్, అశుతోష్ మీడియాతో మాట్లాడారు. మోదీ ప్రభుత్వం ‘అత్యవసర పరిస్థితిని’ సృష్టించి, సొంత పౌరులకే వ్యతిరేకంగా దమనకాండ సాగిస్తోందని దాస్ ఆరోపించారు.
ఏడాదిపాటు శాంతికి భంగం కలిగించకూడదని కోర్టు షరతు విధించినట్లు చెప్పారు. జంతర్‌మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ పోలీసులను సంప్రదించనున్నట్లు అశుతోష్ రంకా ఆదివారం తెలిపారు. నిరసన కోసం ఒక తేదీని సూచించాలని కోరుతూ సోమవారం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లనున్నట్లు ‘ఎక్స్’లో వెల్లడించారు. 24 గంటల్లోగా పోలీసులు స్పందించకపోతే మరోసారి నిరసనకు పిలుపునిస్తామని తేల్చిచెప్పారు.
షరతులతో నేతల విడుదల
కాక్రోచ్ జనతా పార్టీ ముఖ్యనేతలు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంకాకు భారీ ఊరట లభించింది. వారిని విడుదల చేయాలని న్యాయస్థానం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. దాంతో పోలీసులు ముగ్గురు నేతలను విడుదల చేశారు. శనివారం ఢిల్లీలో ధర్నాలో పాల్గొనేందుకు వచ్చిన దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంకాను పోలీసులు విమానంలోనే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. పోలీసుల నిర్బంధంలో ఉన్న ముగ్గురు నేతలకు తక్షణమే విడుదల విముక్తి కల్పించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఢిల్లీ ఎగ్జిక్యూటివ్ మేజి్రస్టేట్ కోర్టులో పిటిషన్ దాఖలైంది.
దీనిపై న్యాయస్థానం ఆదివారం విచారణ చేపట్టింది. ముగ్గురు నేతలను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. ఏడాదిపాటు శాంతికి విఘాతం కలిగించవద్దని, స్రత్పవర్తనతో మెలగాలన్న షరతుతో ముగ్గురి విడుదలకు కోర్టు అంగీకరించింది. రూ.50,000 పూచీకత్తు సమరి్పంచాలని పేర్కొంది. వారిని విడుదల చేయాలని ఆదేశించింది. ఈ అంశాన్ని అతిపెద్ద న్యాయపరమైన విజయంగా కాక్రోచ్ జనతా పార్టీ అభివరి్ణంచింది. నిర్బంధం నుంచి విడుదలై తర్వాత అభిజీత్ దీప్కే తన నానమ్మ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు స్వగ్రామానికి బయలుదేరారు. అయితే ముగ్గురు నేతల విడుదలను చట్టపరమైన విజయంగా సీజేపీ అభివరి్ణంచింది.
ర్యాలీగా సుప్రీంకోర్టుకు
సాక్షి, న్యూఢిల్లీ/బెంగళూరు: సోమవారం కాంగ్రెస్ సారథ్యంలో ఇండియా కూటమి పార్టీలు సైతం భారీ నిరసనలకు పూనుకుంటున్నాయి. అయితే, ముందుగా సుప్రీంకోర్టు వరకు ర్యాలీ నిర్వహించి, సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌కు మెమోరాండం సమర్పిస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. ర్యాలీలో పౌర సంఘాలు, యువత కూడా పాల్గొంటుందన్నారు. బెంగళూరులో మీడియా సమావేశంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ విషయం చెప్పారు. అయితే, సీజేఐని తాము సాయంత్రం 4–5 గంటల మధ్య అపాయింట్‌మెంట్ కోరామన్నారు.
సీజేఐని ఎలాంటి డిమాండ్లు చేయబోమని, తాము తెలిపిన అంశాలపై పరిశీలన చేయాలని మాత్రమే విజ్ఞప్తి చేస్తామని ఖర్గే అన్నారు. సీజేఐతో భేటీ అనంతరం కూటమి పక్షాలతో కలిసి ఆందోళన చేపడతామని రాహుల్ వివరించారు. ఓటు చోరీని, సర్ ప్రక్రియను నిలిపివేయాలని, తిరిగి బ్యాలెట్ విధానాన్ని తేవడంతోపాటు సీఈసీ రాజీనామా చేయాలని కోరుతామని ఆయన వివరించారు. అందరూ ర్యాలీలో పాల్గొనాలని కోరుతూ ఒక వీడియోను విడుదల చేశారు. కాగా, కాంగ్రెస్ పిలుపు మేరకు తెలంగాణ, తమిళనాడు, కేరళం, కర్ణాటక, పంజాబ్ తదితర రాష్ట్రాల నుంచి ఇప్పటికే ఢిల్లీకి పెద్ద సంఖ్యలో నేతలు చేరుకున్నారు.
భేటీకి సీజేఐ నిరాకరణ!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం«దీని కలిసేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నిరాకరించారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ, ఓట్ల చోరీపై ఆరోపణల వ్యవహారం ప్రస్తుతం న్యాయవ్యవస్థ పరిధిలో విచారణలో ఉన్నాయని ఆయన పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు ఆదివారం తెలిపాయి.


