సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు, ధర్నాలకు ప్రసిద్ధి చెందిన జంతర్ మంతర్‌పై సంచలన నిర్ణయం వెలువడింది. అక్కడ ధర్నాలు, ఆందోళనలు నిర్వహించడానికి వీల్లేకుండా హోం మంత్రిత్వ శాఖ ఆ ప్రదేశాన్ని నిరసన వేదికల జాబితా నుంచి తొలగించింది. వరుస ఆందోళనలు, భద్రతా కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో మూడు ప్రత్యామ్నాయ ప్రాంతాలను గుర్తించిన పోలీసులు.. అక్కడే నిరసనలు నిర్వహించాల్సి ఉంటుందని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.
జంతర్ మంతర్ వద్ద ఆందోళనలకు అనుమతి లేకపోవడంతో ఇకపై నిరసనకారులు ప్రత్యామ్నాయ వేదికలను ఆశ్రయించాల్సి ఉంటుంది. రామ్‌లీలా మైదాన్, బురాఠీ మైదాన్, సీబీడీ గ్రౌండ్స్‌ను ఇందుకోసం ఎంపిక చేసినట్లు ఢిల్లీ పోలీసుల తెలిపారు. దీంతో ఇక నుంచి నిరసనల నిర్వహణకు సంబంధించి అనుమతులు, సమయాలు, భద్రతా ఏర్పాట్లపై పోలీసుల మార్గదర్శకాలు కీలకం కానున్నాయి.

నిరసన హక్కుపై సీజేపీ నేతల ప్రశ్నలు
మరోవైపు, జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతి కోరేందుకు సోమవారం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్ చేదు అనుభవం ఎదురైంది. పోలీసులు వాళ్లకు ఎలాంటి హామీ ఇవ్వనట్లు తెలుస్తోంది. సీజేపీ ర్యాలీకి నిరసనకు ఎప్పుడు అనుమతి ఇస్తారో స్పష్టంగా చెప్పాలని కోరారు. అనుమతి ఇచ్చిన 24 గంటల్లోనే నిర్దేశిత వేదిక వద్ద ఆందోళన నిర్వహిస్తామని అశుతోష్ రంకా తెలిపారు.
శాంతియుత నిరసన రాజ్యాంగం కల్పించిన హక్కు అని సౌరవ్ దాస్ పేర్కొన్నారు. నిరసనకు పది రోజుల ముందుగా దరఖాస్తు చేసుకోవాలని పోలీసులు చెబుతున్న నేపథ్యంలో, ఇప్పుడు తేదీ, సమయాన్ని పోలీసులే నిర్ణయించాలని కోరినట్లు తెలిపారు. ఈ విషయంలో ఢిల్లీ పోలీసులకు 24 గంటల డెడ్‌లైన్ విధించినట్లు చెప్పారాయన.
భద్రతా కారణాలే ప్రధానమా?
రాజధాని నడిబొడ్డున ఉన్న జంతర్ మంతర్ దశాబ్దాలుగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, వివిధ వర్గాలు తమ నిరసనలను తెలియజేసే ప్రధాన వేదికగా చాలాకాలంగా కొనసాగుతోంది. ఆ మధ్య ఈ ప్రాంతంలో ఆందోళనల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయనే చర్చా నడిచింది. అది కోర్టు దాకా వెళ్లింది కూడా. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని నిరసన వేదికల జాబితా నుంచి తొలగించడంతో రాజకీయ, సామాజిక ఆందోళనల నిర్వహణపై ప్రభావం పడనుంది. భద్రతా కారణాలతో ఢిల్లీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం నిరసనల నిర్వహణను ఎలా మార్చనుంది? ప్రత్యామ్నాయ వేదికల్లో ఆందోళనలకు అనుమతులు సజావుగా లభిస్తాయా? అన్నది చూడాల్సి ఉంది.
ఇదీ చదవండి: జంతర్ మంతర్ కథే వేరు.. 300 ఏళ్ల ఆసక్తికర ప్రయాణం


