సాక్షి,న్యూఢిల్లీ: ఎన్నికల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ,ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా విపక్షాలు చేస్తున్న నిరసనల వ్యూహంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం సుప్రీంకోర్టు మార్చ్‌కు ముందు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము చేస్తున్న నిరసనలకు ఎలాంటి నిర్దిష్ట ప్రణాళిక అవసరం లేదని, ఇది శివుడి తాండవం లాంటిదని అన్నారు.
తాము చేస్తున్న పోరాటానికి స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలని ‘మా సోదరి (ప్రియాంక గాంధీ) నాతో అన్నారు. అందుకు నేను సమాధానంగా.. ఇది ‘తాండవం’ (శివుడి నాట్యం). దీనికి ఎలాంటి ప్రణాళికలు ఉండవు అని చెప్పాను అని రాహుల్ వెల్లడించారు. తాము ఇవాళ సుప్రీంకోర్టుకు వెళ్తున్నామని, రేపు మరో రూపంలో నిరసన ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి భవన్ వద్ద జరిగిన ఆందోళనను గుర్తుచేస్తూ.. పోలీసుల ఆంక్షల కారణంగా తాము ప్లాన్ మార్చుకోవాల్సి వచ్చిందని, అయితే అనుకోని మార్పుల వల్లే సరైన ఫలితాలు వస్తాయని చెప్పారు. ఈ నిరసనలకు ఎలాంటి ప్లానింగ్ అవసరం లేదని, ఇది శివుని శివతాండవం లాంటిదని, ఇందులో భాగస్వాములు కావాలనుకునే ప్రతి ఒక్కరూ వచ్చి చేరవచ్చని పిలుపునిచ్చారు.
शिव का तांडव चल रहा है- इसमें कुछ भी प्लान नहीं होता है। ये शिव की बारात है, इसमें कोई भी आ सकता है, हम किसी को रोकेंगे नहीं। : नेता विपक्ष श्री @RahulGandhi 📍 दिल्ली https://t.co/nSItxL6Vew
— Congress (@INCIndia) October 12, 2026
జ్ఞానేశ్ కుమార్‌కు హెచ్చరిక
జ్ఞానేశ్ కుమార్‌ను ఉద్దేశించి రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.‘జ్ఞానేశ్ కుమార్.. రాత్రిళ్లు మీకు నిద్ర కరువైందని మాకు సమాచారం అందుతోంది. చింతించకండి, మేము మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నిరసనల నుంచి మీరు తప్పించుకోలేరు. లక్షలాది మంది ప్రజలు మీ ప్రవర్తనను ప్రశ్నిస్తున్నారు. ఈ ఉద్యమం ఆగదు అని హెచ్చరించారు. ఇద్దరు ఎన్నికల కమిషనర్లు లేవనెత్తిన ప్రశ్నలనే తాము అడుగుతున్నామని, జ్ఞానేశ్ కుమార్ ఎందుకు రాజీనామా చేయడం లేదని ఆయన నిలదీశారు.
ఈ సాయంత్రం ప్రధాన ఎన్నికల కమిషనర్ వ్యవహారశైలిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ముందుకు వచ్చే ఏ పార్టీ వారైనా, ఏ పౌరుడైనా ఈ పోరాటంలో భాగస్వామ్యం కావచ్చని పిలుపునిచ్చారు. మరోవైపు ఈ నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, సీఆర్పీఎఫ్ బలగాలను భారీగా మోహరించారు. బరాఖంబా రోడ్, మండి హౌస్ ప్రాంతాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఇండియా కూటమి తలపెట్టిన ఈ ఆందోళనలు దేశవ్యాప్తంగా రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఇదీ చదవండి: వాచ్‌మన్ ఉద్యోగం తీసేశారనే చిన్నారి హత్య: సీపీ సుమతి


