వాచ్‌మన్‌ ఉద్యోగం తీసేశారనే చిన్నారి హత్య: సీపీ సుమతి | Five Year Old Girl Murdered In Medchal For Rs 20 Lakh Ransom, Former Watchman Vikram Arrested, Check Out More Details | Sakshi
Sakshi News home page

వాచ్‌మన్‌ ఉద్యోగం తీసేశారనే చిన్నారి హత్య: సీపీ సుమతి

Oct 12 2026 2:47 PM | Updated on Oct 12 2026 3:34 PM

CP Sumathi: We have solved Assassination case of five-year-old child

సాక్షి, మేడ్చల్‌: మేడ్చల్‌ జిల్లా కౌకూర్‌లో ఐదేళ్ల చిన్నారి హత్య కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. ఐదేళ్ల చిన్నారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసును ఛేదించిన విషయాన్ని సీపీ సుమతి వెల్లడించారు. రూ. 20 లక్షల కోసం వాచ్‌మన్‌గా పని చేసిన విక్రమ్‌ అనే వ్యక్తి ఈ హత్య చేశాడని సీపీ సుమతి తెలిపారు. విక్రమ్‌ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టి చివరకు పట్టుకున్నామన్నారు.  

ఈ కేసు ఛేదనకు సంబంధించిన వివరాలను సీపీ మీడియాకు తెలిపారు. ‘తొలుత సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పరిసరాల్లో, ఆ తర్వాత పటాన్‌చెరులో అతడి ఫోన్‌ సిగ్నల్స్‌ గుర్తించాము. సెల్‌ ఫోన్‌ సిగ్నెల్స్‌ ఆధారంగా పాపను హత్య చేసిన విక్రమ్‌ను అరెస్ట్‌ చేశాం..  

చిన్నారి తాత, వాచ్‌మన్‌ విక్రమ్‌ను మందలించాడనే కోపంతోనే ఈ ఘాతుకం చేశాడు. కిడ్నాప్ అనంతరం పాపను నీటి సంపులో పడేయడంతో చిన్నారి మరణించింది. చిన్నారి హత్య అనంతరం ఆధారాలను మాయం చేసేందుకు కుట్ర జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు విక్రమ్‌ సహా 8 మందిపై కేసు నమోదు చేశాం’ అని సీపీ సుమతి తెలిపారు. 

కాగా, విల్లా నంబర్‌ 84లో నివసించే మిల్టన్‌ ఫెర్నాండెజ్‌ కుమార్తె అరేలియా మోజెస్‌ శనివారం సాయంత్రం ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు ఇంటి పరిసరాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. చుట్టూ ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించిన పోలీసులు.. చిన్నారి వెనుక అదే నివాస సముదాయంలో గతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన విక్రమ్‌ వెళ్లినట్లు గుర్తించారు.

 అనంతరం క్లబ్‌హౌస్‌ సెల్లార్‌లోని నీటి సంపులో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. చిన్నారి కాళ్లు, చేతులు కట్టేసిన స్థితిలో మృతదేహం లభించింది. తనపై వచ్చిన ఫిర్యాదుల కారణంగా విక్రమ్‌ను ఉద్యోగం నుంచి తీసివేయడంతో కక్ష పెంచుకుని ఆ చిన్నారిని అపహరించి అనంతరం రూ.20 లక్షలు డిమాండ్‌ చేసినట్లు విచారణలో వెల్లడైంది. 

హత్య చేసిన సమయంలో పాప ఏడుపు ఎవరికీ వినిపించకుండా పాటలు పెట్టి ఐదేళ్ల చిన్నారి అరేలియా మోజెస్‌ను విక్రమ్‌ హత్య చేశాడు. మరోవైపు చిన్నారి అరేలియా మోజెస్‌ను హత్య చేసిన విక్రమ్‌ను తమకు అప్పగించాలని కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీస్‌స్టేషన్‌ ఎదుట దర్నాకు దిగారు.
ఇదీ చదవండి: భర్తను దారుణంగా చంపిన భార్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement