వాతావరణశాఖ అంచనా
న్యూఢిల్లీ: భారత్‌లో పంటసాగుకు ప్రాణాధారమైన నైరుతి రుతుపవనాలు జూన్ నాలుగోతేదీన కేరళను తాకనున్నాయని భారత వాతావరణ శాఖ మంగళవారం ప్రకటించింది. సాధారణంగా జూన్–సెపె్టంబర్ సీజన్‌కు సంబంధించిన నైరుతి రుతుపవనాలు జూన్ ఒకటోతేదీకల్లా కేరళలో చిరుజల్లులను కురిపిస్తూ రైతన్నల ముఖాల్లో ఆనందం తీసుకొస్తాయి. కానీ ఈసారి నాలుగు రోజులు ఆలస్యంగా భారత్‌లోకి అడుగుపెడుతున్నాయని వాతావరణశాఖ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
‘‘నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్ర, లక్షద్వీప్ దీవులు, కేరళలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోలలో ఒకేసారి జూన్ నాలుగోతేదీన నైరుతి రుతుపవనాలు తాకే ఆస్కారముంది. నైరుతి, దక్షిణ మధ్య ప్రాంతం, తూర్పు మధ్యప్రాంతం, బంగళాఖాతం ఈశాన్య ప్రాంతాలు, బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతాల్లోనూ అదే తేదీన వర్షాకాల సీజన్ ఆరంభంకానుంది. ఈ ఏడాది వర్షపాతం దీర్ఘకాలిక సగటు(ఎల్‌పీఏ) 90 శాతంగా ఉండొచ్చు’’అని వాతావరణ శాఖ అంచనావేసింది.
గత 30 లేదా 50 సంవత్సరాల కాలంలో నిర్ణిత ప్రాంతంలో ఒక నెలలో లేదా ఒక సీజన్‌లో పడే వర్షపాతం సగటును ఎల్‌పీఏగా పేర్కొంటారు. 1971 నుంచి 2020 ఏడాది మధ్య నమోదైన ఎల్‌పీఏ 87 సెంటీమీటర్లనే ప్రస్తుతం ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈసారి ఎల్‌పీఏ 90 శాతంగా ఉండొచ్చు అంటే ఈసీజన్‌లో లోటు వర్షపాతం నమోదయ్యే ఆస్కారముందని వాతావరణ శాఖ నిపుణులు అంచనావేస్తున్నారు. ఎల్ నినో పరిస్థితుల కారణంగానే లోటు వర్షపాతం ముప్పు పొంచి ఉందని నిపుణులు వివరించారు. భూమధ్యరేఖ సమీప పసిఫిక్ మహాసముద్ర ప్రాంత ఉపరితల జలాలు క్రమంగా వేడెక్కుతూ ఎల్‌నినో పరిస్థితులను సృష్టిస్తున్నాయి. జూన్‌లో ఎల్–నినో ప్రభావం తక్కువగా ఉండి, సెప్టెంబర్‌లో బలపడే అవకాశముంది.


