టికెట్ లేని ప్రయాణం.. రైల్వేకు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా? | South Central Railway has achieved a major milestone in Ticket Checking | Sakshi
Sakshi News home page

టికెట్ లేని ప్రయాణం.. రైల్వేకు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?

Mar 20 2026 3:34 PM | Updated on Mar 20 2026 4:01 PM

 South Central Railway has achieved a major milestone in Ticket Checking

సికింద్రాబాద్ : దక్షిణ మధ్య రైల్వే అరుదైన రికార్డు సాధించింది. టికెట్‌ తనిఖీల్లో భాగంగా అక్రమంగా ప్రయాణిస్తున్న వారిని గుర్తించి వారికి పెద్ద మెుత్తంలో జరిమానా విధించింది. దీంతో 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 223 కోట్లకు పైగా ఫైన్‌ల ద్వారా ఆదాయం పొంది ఇండియాలోనే మెుదటి స్థానంలో నిలిచింది.

టికెట్ లేకుండా ప్రయాణించడం నేరం అని అందరికి తెలుసు. అయినా కొంతమంది అత్యుత్సాహంతో టికెట్ లేకుండా ప్రయాణించి రైల్వేను బురిడి కొట్టిద్దామని చూస్తారు. అయితే అలా చేస్తూ ఇరకాటంలో పడతారు. దొరికిన అనంతరం పెద్ద మెుత్తంలో జరిమానా చెల్లించి లబోదిబోమంటారు. తాజా నివేదికలు ఇవే స్పష్టం చేస్తున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి దక్షిణమధ్య రైల్వేకు ఏకంగా రూ. 223 కోట్లకు పైగా  టికెట్ లేకుండా ప్రయాణించడం ద్వారా వచ్చాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

దక్షిణ మధ్య రైల్వే 2025-2026 ఆర్థిక సంవత్సరానికి రూ. 221.08 కోట్లు టార్గెట్‌గా పెట్టుకుంది. అయితే ఆర్థిక సంవత్సరం ముగింపుకు 14 రోజులు ఉండగానే రికార్డు స్థాయిలో రూ. 223.60 కోట్లు జరిమానాల ద్వారా రైల్వేకు వచ్చాయి. టికెట్‌ లేకుండా ప్రయాణించడం, అత్యధిక లగేజ్‌ కలిగి ఉండడం తదితర చట్టరీత్యా వ్యతిరేకమైన ప్రయాణాలకు జరిమానాలు వేయడం ద్వారా ఇంత పెద్ద మెుత్తంలో ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీటిలో అత్యధికంగా 2025 అక్టోబర్‌ 18 ఒక్కరోజే రూ. 1.85 కోట్లు జరిమానాల ద్వారా వసూలైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఇండియాలో ఉన్న అన్ని రైల్వే జోన్లలో ఇదే అత్యధిక జరిమానాల వసూలని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్  సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ " గతంలో ఏ ఆర్థిక సంవత్సరం ఇంతపెద్ద మెుత్తంలో రైల్వేకు ఆదాయం రాలేదన్నారు. రైల్వేశాఖ సిబ్బంది అంకితభావంతో పనిచేసి నేరపూరిత ప్రయాణాన్ని అరికట్టారని వారందరికీ అభినందనలని తెలిపారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement