అధిష్టానం ఆ పని చేయబోదు: సిద్ధరామయ్య | Sakshi
Sakshi News home page

అధిష్టానం ఆ పని చేయబోదు.. సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు

Published Tue, Apr 4 2023 7:55 AM

Siddaramaiah On Karnataka Congress Chief Minister Pick - Sakshi

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతున్న వేళ.. మరోవైపు జాతీయ పార్టీలు రెండూ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై వేచిచూసే ధోరణినే అవలంభిస్తున్నాయి. అయితే కాంగ్రెస్‌ నుంచి మాత్రం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల పేర్లు ప్రధానంగా తెర మీద వినిపిస్తున్నాయి. అయితే..  సీఎం ఎవరనే నిర్ణయం పార్టీ అధిష్టానం చేతులో కూడా ఉండదని అంటున్నారు కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య.  

కాంగ్రెస్‌కు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు చాలా కీలకం. అధికార రాష్ట్రాలను ఒక్కొక్కటిగా చేజార్చుకుంటూ పోతున్న హస్తానికి.. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు ఒక బూస్ట్‌గా పని చేయడానికైనా కన్నడనాట విజయం రుచిచూడాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే.. సీఎం అభ్యర్థి విషయంలో అక్కడ సిద్ధరామయ్యకు, పార్టీ చీఫ్‌ డీకే శివకుమార్‌ మధ్య గట్టి పోటీ నెలకొంది. పైగా ఈ ఇద్దరి మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న విభేదాల కారణంగా.. సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారు? ఆపై పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి సైతం నెలకొంది. 

ఈ క్రమంలో.. సీఎం అభ్యర్థిత్వంపై ఉన్న పోటీపై సిద్ధరామయ్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. నేను కూడా ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న వాడినే. అలాగే.. డీకే శివకుమార్ కూడా. కానీ, పార్టీ అధిష్టానం మాత్రం శివకుమార్‌కు సీఎం పదవి కట్టబెట్టదు.. బెట్టలేదు కూడా అని సిద్ధరామయ్య తేల్చారు. ఎందుకంటే..  

‘‘కాంగ్రెస్‌ పార్టీలో ముఖ్యమంత్రి ఎంపికలో అధిష్టానం జోక్యం చేసుకోదు. అది ఏనాడూ జరగబోదు కూడా. ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్‌ సీఎం ఎంపిక ఉంటుంది. గెలిచిన ఎమ్మెల్యేల ఎంపిక చేసిన వ్యక్తే ముఖ్యమంత్రి అవుతాడు’’ అంటూ తెలిపారు. ఇక.. సీఎం పదవికి యువనాయకత్వాన్ని ఎందుకు అంగీకరించబోరన్న ప్రశ్నకూ.. ఆయన భిన్నంగా స్పందించారు. నాకిప్పుడు 75 ఏళ్లు. ఒకరకంగా ఇదే నా చివరి ఎన్నిక అంటూ దాటవేత సమాధానం ఇచ్చారు. 

2020 జులైలో.. సిద్ధరామయ్య నమ్మకస్తుడిగా ఉన్న దినేష్‌ గుండును తప్పించి మరీ ట్రబుల్‌ షూటర్‌గా పేరున్న శివకుమార్‌కు పార్టీ పగ్గాలు అప్పజెప్పింది కాంగ్రెస్‌ అధిష్టానం. అప్పటి నుంచి సిద్ధరామయ్య-శివకుమార్‌ల వైరం మరింతగా ముదిరింది.  అయితే రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర సందర్భంగా ఒక్కటిగా కనిపించిన ఈ నేతలు.. అటుపై ఫిబ్రవరిలో విడివిడిగా బస్సు యాత్రలో నిర్వహించి ఎవరిదారి వారిదేనని చాటిచెప్పారు.  మరోవైపు అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపిక సమయంలోనూ వీళ్ల విభేధాల ప్రభావం పడుతోంది. అయితే ఈ ఇద్దరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్న అంశం ఏదైనా ఉందా అంటే.. కర్ణాటక అసెంబ్లీలో హంగ్‌ ఫలితం, జేడీఎస్‌తో పొత్తూ ఈ రెండు ప్రచారాలను తోసిపుచ్చడం.. కాంగ్రెస్‌ ఘన విజయంతో తిరిగి కన్నడనాట అధికారంలో వస్తుందనే ధీమా వ్యక్తం చేయడం మాత్రమే. 

Advertisement
Advertisement