షిండేకు షాక్‌.. ఢిల్లీ ప్లాన్‌ ఫెయిల్‌! | Uddhav Sena Faces New Rebel Buzz As Delhi Meeting Collapse Sparks Maharashtra Political Heat, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

షిండేకు షాక్‌.. ఢిల్లీ ప్లాన్‌ ఫెయిల్‌!

Jun 17 2026 11:25 AM | Updated on Jun 17 2026 12:30 PM

Shinde Delhi plan collapses as Uddhav bloc strikes back with whip move

మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. శివసేన (ఉద్ధవ్ బలాసాహెబ్ ఠాక్రే) వర్గంలో తిరుగుబాటు ఊహాగానాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిణామాలు ఒక్కసారిగా ఢిల్లీ కేంద్రంగా కీలక మలుపు తిరుగుతాయని అంతా భావించారు. ఈ తరుణంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కీలకంగా భావించిన రాజకీయ భేటీ చివరి నిమిషంలో రద్దు కావడం రాజకీయ ఉత్కంఠను మరింత పెంచింది. దీంతో షిండే వర్గం వ్యూహానికి ఉద్ధవ్ శిబిరం చెక్ పెట్టినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

శివసేన (యూబీటీ)కి చెందిన కొంతమంది లోక్‌సభ ఎంపీలు ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే శిబిరంలో చేరతారనే ప్రచారం కొంతకాలంగా కొనసాగుతోంది. “ఆపరేషన్ టైగర్”లో భాగంగా ఉద్ధవ్ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న ఆరుగురు ఎంపీలు విలీనం అయ్యే అవకాశం ఉందన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. పార్టీ విభజనకు అవసరమైన రెండు మూడవ వంతు మెజారిటీకి ఈ సంఖ్య దగ్గరగా ఉండటంతో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. జూన్ 19న శివసేన ఆవిర్భావ దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ కదలికలు వేగం పుంజుకున్నాయి.

ఈ నేపథ్యంలో ఢిల్లీలో శ్రికాంత్ షిండే నివాసంలో బుధవారం జరగాల్సిన కీలక భేటీ చివరి క్షణంలో రద్దు కావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. సమావేశానికి ముందు ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌కు విలీనంపై లేఖ సమర్పిస్తారని లీకులు అందాయి. అలాగే భేటీకి ఏక్‌నాథ్ షిండే కూడా ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో.. అనూహ్యంగా మొత్తం ప్లాన్ నిలిచిపోయింది. 

మరోవైపు ఉద్ధవ్ శిబిరం ముందస్తుగా అప్రమత్తమైంది. పార్టీ ఎంపీలకు విప్ జారీ చేస్తూ ఢిల్లీలో జరిగే పార్టీ సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది. పార్టీ ఆదేశాలను ఉల్లంఘిస్తే అనర్హత వేటు తప్పదని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేయడం రాజకీయంగా కీలక పరిణామంగా మారింది.

ఉద్ధవ్ శిబిరం తరఫున సంజయ్ రౌత్ మాట్లాడుతూ తిరుగుబాటు ప్రయత్నానికి అవసరమైన సంఖ్య ప్రత్యర్థి వర్గానికి లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో ఇది ఒత్తిడి రాజకీయాల భాగమని, ఎంపీలను ప్రలోభాలకు గురిచేస్తున్నారన్న ఆరోపణలు చేశారు. రూ.15 కోట్ల ఆఫర్‌ అంశం కూడా రాజకీయ వేడిని పెంచింది. మొత్తం 50 కోట్ల రూపాయలతో ఎంపీలకు ఎర వేస్తున్నారని.. అడ్వాన్స్‌గా 15 కోట్లు చెల్లించారని సంజయ్‌ రౌత్‌ ఆరోపించారు. అయితే ఆయన మీడియాతో మాట్లాడే సమయంలో వెంట కేవలం ముగ్గురు ఎంపీలే ఉండడం గమనార్హం. 

అంతకు ముందు.. ఉద్ధవ్ ఠాక్రే కూడా ఈ పరిణామంపై స్పందించారు. 2022 శివసేన చీలిక సమయంలోనే పరిస్థితులను అర్థం చేసుకున్నానని, కానీ ఎవరిపైనా ఒత్తిడి చేయడం తన ఇష్టం లేదని అన్నారాయన. మరోవైపు పార్టీ నేతలు అనిల్ దేశాయ్, ఆదిత్య ఠాక్రే మాత్రం పార్టీ ఐక్యతపై నమ్మకం వ్యక్తం చేశారు.

మొత్తం పరిస్థితిని చూస్తే ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న ఈ రాజకీయ డ్రామాకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లే కనిపిస్తున్నప్పటికీ, మహారాష్ట్ర రాజకీయాల్లో అస్థిరతపై ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిణామాలు భవిష్యత్ సమీకరణాలను మళ్లీ మార్చే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement