గుడ్‌న్యూస్‌.. బయల్దేరిన ‘కోవిషీల్డ్‌’

Serum Institute Sends Out First Vaccines To 12 Cities - Sakshi

తొలి విడత 12 నగరాలకు చేరనున్న డోసులు

తెలుగు రాష్ట్రాలకు చేరుకోనున్న తొలి కార్గో విమానం

ముంబై: ఏడాది పాటుగా కరోనా వైరస్తో కకావికాలమైన దేశం మరి కొద్ది రోజుల్లో ఊపిరి పీల్చుకోనుంది. వైరస్‌ని ఎదుర్కొనే కోవిడ్‌ టీకా అందుబాటులోకి రానుంది. ఈ నెల 16 నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అందుకు శరవేగంగా ఏర్పాట్లు ప్రారంభమవుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం తెల్లవారుజామున కీలక పరిణామం చోటుచేసుకుంది. కరోనా వ్యాక్సిన్‌ కోవిషీల్డ్‌ను అభివృద్ధి చేసిన సీరం ఇన్‌స్టిట్యూట్ తొలి విడత టీకా సరఫరా ప్రారంభించింది. పుణెలోని తయారీ కేంద్రం నుంచి వ్యాక్సిన్‌ డోసుల్ని మూడు ప్రత్యేక ట్రక్కుల ద్వారా పంపించింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ వీటిని పుణె విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు ఉదయం 10 గంటలకల్లా సరఫరా చేయనున్నారు. రవాణా కోసం జీపీఎస్‌ సౌకర్యమున్న ట్రక్కులను వినియోగించారు. మొత్తం 478 బాక్సుల్లో టీకాలను భద్రంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఒక్కో బాక్సు బరువు దాదాపు 32 కిలోలు ఉంటుందని సమాచారం. (చదవండి: 6 కోట్ల డోసుల టీకా కొనుగోలుకు కేంద్రం ఉత్తర్వులు)

తొలి విడత డోసులు పుణె నుంచి ఢిల్లీ, అహ్మదాబాద్‌, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, కర్నాల్‌, హైదరాబాద్‌, విజయవాడ, గువాహటి, లఖ్‌నవూ, చండీగఢ్‌, భువనేశ్వర్‌కు చేరనున్నట్లు సమాచారం. ఇందుకోసం మొత్తం 8 ప్రత్యేక వాణిజ్య, 2 కార్గో విమానాలను వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది. తొలి కార్గో విమానం హైదరాబాద్‌, విజయవాడ, భువనేశ్వర్‌కు రానుండగా.. మరొకటి కోల్‌కతా, గువాహటికి వెళ్లనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ అధికారి తెలిపారు. ముంబయికి రోడ్డుమార్గం ద్వారా వ్యాక్సిన్‌ డోసులను సరఫరా చేయనున్నట్లు సమాచారం. స్పైస్‌జెట్‌కు చెందిన విమానాల్ని టీకా రవాణా కోసం వినియోగిస్తున్నట్లు ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అజయ్‌ సింగ్‌ తెలిపారు. (చదవండి: తొలి దశలో.. టీకా ఖర్చు కేంద్రానిదే)

కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో మూడు కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఆ తర్వాత.. 50 ఏళ్లు పైబడినవారికి, ఆరోగ్య సమస్యలున్న 50 ఏళ్లలోపు వారికి టీకా‌ వేస్తారు. దేశంలో తొలివిడతలో మూడు కోట్ల మంది కరోనా యోధులకు వ్యాక్సిన్‌ ఇచ్చేందుకయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మరోవైపు భారత్‌ బయోటెక్‌ కూడా తన టీకాలను నేరుగా 12 రాష్ట్రాలకు సరఫరా చేయనుంది. ఈ ప్రక్రియ మంగళవారం ప్రారంభమై, రెండు రోజుల్లో ముగియనుందని సంబంధిత అధికారులు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top