కరోనా మహమ్మారి కొనసాగుతున్న ఈ తరుణంలో వినియోగదారులకు ఉపశమనం కలిగే విధంగా దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు ఎస్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక రోజులో ఖాతా నుంచి నగదు విత్ డ్రా చేసే పరిమితిని పెంచింది. కొత్త నిబంధనల ప్రకారం.. మీరు మీ పొరుగు శాఖకు(హోమ్ బ్రాంచ్ మినహా) వెళ్లి ఒక రోజులో విత్ డ్రా ఫారం సహాయంతో రూ.25000 వరకు విత్ డ్రా చేయొచ్చు. బ్యాంకు తెలిపిన వివరాల ప్రకారం.. విత్ డ్రా ఫారం ద్వారా మరొక శాఖకు వెళ్ళినప్పుడు వినియోగదారులు తమ పొదుపు ఖాతా నుంచి 25 వేల రూపాయల వరకు ఉపసంహరించుకోవచ్చని వెల్లడించింది.
అదే చెక్ ద్వారా అయితే మరో శాఖ నుంచి 1 లక్ష రూపాయల వరకు తీసుకోవచ్చు అని తెలిపింది. థర్డ్ పార్టీ నగదు ఉపసంహరణ పరిమితిని 50 వేల రూపాయలకు పెంచారు. తక్షణమే ఈ కొత్త నిబంధనల అమలులోకి వచ్చినట్లు పేర్కొంది. ఈ కొత్త నిబంధనలు 30 సెప్టెంబర్ 2021 వరకు వర్తిస్తాయి. నగదు ఉపసంహరించుకునే కొత్త నిబంధనలతో పాటు, బ్యాంక్ కూడా షరతులను అమలు చేసింది. థర్డ్ పార్టీ ఉపసంహరణ ఫారం ద్వారా నగదు ఉపసంహరించుకోలేమని బ్యాంక్ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది కాకుండా థర్డ్ పార్టీ కేవైసీ పత్రం కూడా అవసరం. ఎస్‌బీఐ తన రెగ్యులర్ సేవింగ్స్ ఖాతాదారులకు నెలలో 8 ఉచిత లావాదేవీలను అందిస్తుంది. ఇందులో 5 ఎస్‌బీఐ ఎటిఎంలు, మరో 3 బ్యాంక్ ఎటిఎంల లావాదేవీలు ఉంటాయి. నాన్-మెట్రో నగరాల్లో 10 ఉచిత ఎటిఎం లావాదేవీలు ఉంటాయి. ఇందులో 5 లావాదేవీలు ఎస్‌బీఐతో పాటు మరో 5 లావాదేవీలు వేరే బ్యాంకుల ఎటిఎంల ద్వారా తీసుకునే సదుపాయం కల్పించింది.
చదవండి: గుడ్ న్యూస్ : మూడు రోజుల్లోనే పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా


