కేంద్రానికి నోటీసులు జారీ చేసిన ఆర్టీఐ

RTI Body Pulls Up Government Over Aarogya Setu App - Sakshi

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి మాస్క్‌, శానిటైజర్‌తో పాటు ఆరోగ్య సేతు యాప్‌ కూడా తప్పనసరిగా మారింది. మిలియన్ల మంది భారతీయులు తమ మొబైల్‌ ఫోన్‌లలో దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య సేతు యాప్‌ని ఎవరు క్రియేట్‌ చేశారనే ప్రశ్న తలెత్తింది. అయితే ఆరోగ్య సేతు వెబ్‌సైట్‌లో దీనిని నేషనల్‌ ఇన్‌ఫర్‌మేటిక్స్‌ సెంటర్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిందని చూపెడుతుంది. అయితే ఆర్టీఐ ప్రశ్నకు సమాధానంగా ఈ రెండు శాఖలు యాప్‌ని ఎవరు సృష్టించారో తెలియదనే సమాచారం ఇచ్చాయి. ఈ క్రమంలో కేంద్ర సమాచార కమిషన్‌ యాప్‌ని ఎవరు సృష్టించారనే దానిపై "తప్పించుకునే సమాధానాలు" ఇవ్వడంతో  ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. అధికారులు సమాచారాన్ని తిరస్కరించడాన్ని అంగీకరించము అని స్పష్టం చేసింది. ‘యాప్‌ని ఎవరు క్రియేట్‌ చేశారు.. ఫైల్స్‌ ఎక్కడ ఉన్నాయి అనే దాని గురించి సంబంధిత శాఖ అధికారులు ఎవరూ వివరించలేకపోయారు. ఇది సరైన పద్దతి కాదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. సంబంధిత విభాగాలు నవంబర్‌ 24న కమిషన్‌ ముందు హాజరుకావాలని ఆదేశించిది. (చదవండి: ఆరోగ్య సేతుకు మ‌రో ఘ‌న‌త)

ఆరోగ్య సేతు యాప్‌ని ఎవరు క్రియేట్‌ చేశారనే విషయం తెలుసుకోవడం కోసం సౌరవ్‌ దాస్‌ అనే కార్యకర్త ప్రయత్నం చేశాడు. యాప్‌ ప్రతిపాదన మూలం, దాని ఆమోదం వివరాలు, పాల్గొన్న కంపెనీలు, వ్యక్తులు, ప్రభుత్వ విభాగాలు, యాప్‌ని అభివృద్ధి చేయడంలో పాల్గొన్న ప్రైవేట్ వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ల కాపీలు వంటి వివరాలను ఆయన అడిగారు. రెండు నెలల పాటు ఇది వివిధ విభగాలలో చక్కర్లు కొట్టింది కానీ సరైన సమాధానం మాత్రం లభించలేదు. దాంతో యాప్ క్రియేషన్‌ గురించి సమాచారం ఇవ్వడంలో వివిధ మంత్రిత్వ శాఖలు విఫలమయ్యాయని సౌరవ్ దాస్ సమాచార కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. (చదవండి: ఆర్టీఐ పరిధిలోకి ‘సీజేఐ’)

నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ "యాప్ సృష్టికి సంబంధించిన మొత్తం ఫైల్ ఎన్ఐసీ వద్ద లేదు" అని తెలిపింది. ఐటీ మంత్రిత్వ శాఖ ఈ ప్రశ్నను జాతీయ ఇ-గవర్నెన్స్ విభాగానికి బదిలీ చేసింది. అది "కోరిన సమాచారం (మా విభాగానికి) సంబంధించినది కాదు" తెలిపింది. ఈ క్రమంలో ఆర్టీఐ బాడీ.. చీఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్, నేషనల్ ఇ-గవర్నెన్స్ విభాగానికి షో-కాజ్ నోటీసులు జారీ చేసింది. తప్పించుకునే సమాధానం ఇస్తున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలని కమిషన్‌ తన నోటీసులో కోరింది.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top