సామాన్యుడికి చమురు చిచ్చు | Rising fuel prices burn hole in peoples pocket | Sakshi
Sakshi News home page

సామాన్యుడికి చమురు చిచ్చు

May 16 2026 2:20 AM | Updated on May 16 2026 2:20 AM

Rising fuel prices burn hole in peoples pocket

పెట్రోల్‌ షాక్‌తో ప్రజల జేబుకు చిల్లు 

రవాణా ఖర్చులు మరింత భారం 

ఆహార ద్రవ్యోల్బణం భయం 

కూరగాయలు నుంచి ఈ–కామర్స్‌ వరకు అన్ని వస్తువుల ధరలపై ప్రభావం

సాక్షి, బిజినెస్‌ డెస్క్: పెట్రో ధరల భారం ఎప్పుడూ పెట్రోల్‌ బంకుల వద్ద మాత్రమే ఆగదు. ప్రతి వంటగదిలోకి, ప్రతి పొలంలోకి, ప్రతి కుటుంబ బడ్జెట్‌లోకి చొరబడుతుంది. ఇప్పటికే పేదలు, మధ్యతరగతి ప్రజలు వంటగ్యాస్‌కు ఎక్కువ చెల్లిస్తున్నారు. రైతులు డీజిల్‌ ధరను ఎక్కువ భరిస్తున్నారు. కారి్మకులు రవాణాకు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, తక్కువ వేతనాలతో అనేక ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై పెట్రోలు, డీజిల్‌ ధరల పెంపుదల అదనపు భారాన్ని మోపుతుంది. అండర్‌ రికవరీల పేరుతో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ప్రజలపై ఆరి్ధక భారాన్ని మోపుతున్నాయని దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది.

గత సంవత్సరాల్లో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినప్పుడు, తక్కువగా ఉన్నప్పుడు ఆ లాభాలను చమురు సంస్థలు వినియోగదారులకు ఎప్పుడూ అందించలేదని, కానీ పెట్రోలియం ఉత్పత్తులపై భారీ పన్నుల భారం మాత్రం ప్రజలు సంవత్సరాలుగా భరించాల్సి వస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంధన ధరల పెంపు వల్ల రవాణా ఖర్చులు, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజల జీవనం అతలాకుతలమవుతుంది. మొత్తం ఆర్థిక వ్యవస్థపై వ్యతిరేక ప్రభావం చూపే అవకాశముంది. ముఖ్యంగా సీఎన్‌జీ, డీజిల్‌ ధరల పెంపుతో ఆటో డ్రైవర్లు, రవాణా కారి్మకులు, ప్రజా రవాణాపై ఆధారపడే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడే అవకాశముంది.  

ఇరాన్‌ యుద్ధం ప్రభావం 
ఇరాన్‌–ఇజ్రాయెల్‌ యుద్ధం ప్రపంచ చమురు మార్కెట్లను కుదిపేస్తుండగా భారత్‌లో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఆగి ఆగి ఎట్టకేలకు పెట్రోల్, డీజిల్‌ ధరలను లీటరుకు రూ.3 చొప్పున పెంచాయి. రెండు నెలలకు పైగా భారీ నష్టాలు భరించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. అదే సమయంలో సీఎన్‌జీ ధరలను కూడా కిలోకు రూ.2 పెంచడంతో రవాణా రంగంపై అదనపు ఒత్తిడి పడింది. ప్రజా రవాణా వ్యవస్థలో డీజిల్‌ కీలక పాత్ర పోషిస్తుంది. డీజిల్‌పై ఆధారపడే ట్రక్కులు, బస్సులు, వ్యవసాయ యంత్రాలు, కోల్డ్‌ స్టోరేజ్‌ వ్యవస్థలు, మార్కెట్‌ సరఫరా గొలుసులన్నింటిపై ఇప్పుడు అదనపు భారం పడనుంది.

రవాణా సంస్థలు ఇప్పటికే చార్జీలు కనీసం 3% పెరిగే అవకాశం ఉందని హెచ్చరించాయి. టాక్సీ, బస్సు రవాణా, డెలివరీ చార్జీలు కూడా వచ్చే మూడు నుంచి నాలుగు నెలల్లో పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కూరగాయలు, పాలు, ధాన్యాలు, మందులు, నిత్యావసర వస్తువుల నుంచి ఆన్‌లైన్‌ డెలివరీల వరకు ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. డీజిల్‌ ధరల పెంపుతో సాగు ఖర్చులూ పెరగనున్నాయి. రైతులు పంటలను మార్కెట్లకు తరలించే ఖర్చు కూడా పెరగడంతో ఆహార ధరలు మళ్లీ ఎగబాకే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

ద్రవ్యోల్బణం మళ్లీ వేగం? 
ఏప్రిల్‌లోనే రిటైల్‌ ద్రవ్యోల్బణం 3.48 శాతానికి చేరగా, హోల్‌సేల్‌ ద్రవ్యోల్బణం 8.3 శాతానికి ఎగిసింది. ఇప్పుడు ఇంధన ధరల పెంపు కారణంగా వచ్చే మూడు నెలల్లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 5% దాటే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇంధన ధరల పెంపుతో రిజర్వ్‌ బ్యాంక్‌కు ద్రవ్యోల్బణ నియంత్రణ మరింత క్లిష్టం కానుంది. ఇప్పటికే వడ్డీ రేట్ల కోతలపై ఆశలు తగ్గిపోగా, ఇప్పుడు మరింత కఠిన ఆర్థిక విధానాలు కొనసాగించే పరిస్థితి ఏర్పడే అవకాశముంది. దీనివల్ల ధరలు మరింత పెరుగుతాయి.   

ఇంకా పెరిగే చాన్స్‌ ఉందా? 
ప్రస్తుతం చేసిన రూ.3 పెంపు ఆయిల్‌ కంపెనీల నష్టాలను పూర్తిగా భర్తీ చేయదని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే మరోసారి పెట్రోల్, డీజిల్‌ ధరల పెంపు తప్పదనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఇక ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు ఈ ధరల పెంపు పూర్తి ఉపశమనం కాదని చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 105–110 డాలర్ల వద్ద కొనసాగితే, ఇప్పటికీ రోజుకు వందల కోట్ల నష్టాలు తప్పవని అంచనా. పరిస్థితి మరింత దిగజారితే మరోసారి ఇంధన ధరల పెంపు కూడా తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

పెట్రోల్‌ ఎగుమతులపై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌
డీజిల్, ఏటీఎఫ్‌పై సుంకం తగ్గింపు
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ పెట్రోల్‌ ఎగుమతులను కట్టడి చేసి దేశీయంగా లభ్యతను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పెట్రోల్‌ ఎగుమతులపై లీటరుకు రూ. 3 చొప్పున ప్రత్యేక అదనపు ఎక్సైజ్‌ సుంకం (ఎస్‌ఏఈడీ) పేరిట విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ విధించింది. డీజిల్‌ ఎగుమతులపై సుంకాన్ని లీటరుకు రూ. 23 నుంచి రూ. 16.5కి, విమాన ఇంధనంపై (ఏటీఎఫ్‌) రూ. 33 నుంచి రూ. 16కి తగ్గించింది. ఇవి మే 16 నుంచి అమల్లోకి వస్తాయని ఆర్థిక శాఖ ఒక నోటిఫికేషన్‌లో వెల్లడించింది. పెట్రోల్, డీజిల్‌ ఎగుమతులపై రోడ్, ఇన్‌ఫ్రా సెస్సు ఉండబోదని పేర్కొంది. నిర్దిష్ట పరిస్థితుల్లో ఇంధన సంస్థలకు వచ్చే అసాధారణ లాభాలపై తాత్కాలికంగా విధించే సుంకాలను విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌గా వ్యవహరిస్తారు.  

Advertisement
 
Advertisement
Advertisement