2022 నాటికి వాయుసేనలోకి ‘రఫేల్‌’

Raphael Aircraft Into Air Force By 2022 Says RKS Badauria - Sakshi

తూర్పు లద్దాఖ్‌ పరిస్థితులపై చైనాతో చర్చలు జరుపుతున్నాం

సరిహద్దుల్లో చైనా బలగాల మోహరింపును గమనిస్తున్నాం

కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ పరేడ్‌లో వాయుసేన చీఫ్‌ ఆర్కేఎస్‌ బదౌరియా

సాక్షి, హైదరాబాద్‌: భారత వాయుసేనలో 2022 నాటికి 36 రఫేల్‌ యుద్ధ విమానాలను ప్రవేశపెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నామని భారత వాయుసేన చీఫ్‌ ఆర్కేఎస్‌ బదౌరియా పేర్కొన్నారు. కరోనా కారణంగా ఫ్రాన్స్‌ నుంచి ఒకట్రెండు విమానాల రాకలో జాప్యం జరిగిందని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా రఫేల్‌ వినామాలను వాయుసేనలో ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో శనివారం నిర్వహించిన కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. భారత-చైనా సరిహద్దుల్లోని తూర్పు లద్దాఖ్‌లో పరిస్థితులపై ప్రశ్నించగా.. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సమస్య చర్చల దశలో ఉందని పేర్కొన్నారు. వివాదాస్పద ప్రాంతం నుంచి ఇరు దేశాల బలగాల ఉపసంహరణకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని, సరిహద్దుల్లో చైనా బలగాల మోహరింపులపై నిఘా కొనసాగుతోందని చెప్పారు. పరిస్థితులకు తగ్గట్లు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రక్షణపరమైన సవాళ్లు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన శిక్షణ పూర్తి చేసుకుని యువత ఎయిర్‌ఫోర్స్‌లోకి అడుగుపెడుతోందని పేర్కొన్నారు.

శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లైట్‌ క్యాడెట్లు 
ఫ్లయింగ్, గ్రౌండ్‌ డ్యూటీ విభాగంలో 161 మంది ఫ్లైట్‌ క్యాడెట్లు శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌ (సీజీపీ) నిర్వహించారు. ఆరుగురు నావికా దళ అధికారులు, ఐదుగురు ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ అధికారులు శిక్షణ పూర్తి చేసుకోవడంతో వారికి ‘వింగ్స్‌’ప్రదానం చేశారు. ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ ప్రజ్వాల్‌ అనిల్‌ కులకర్ణి పైలట్స్‌ కోర్సులో ప్రథమ స్థానంలో నిలిచి ప్రెసిడెంట్‌ పతకంతో పాటు ఎయిర్‌ స్టాఫ్‌ స్వోర్డ్‌ ఆఫ్‌ ఆనర్‌ అవార్డును అందుకున్నారు. గ్రౌండ్‌ డ్యూటీ విభాగంలో తొలి స్థానంలో నిలిచిన ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ కృతిక కుల్హారీకి ప్రెసిడెంట్‌ పతకం లభించింది. శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లయింగ్‌ అధికారులు గగనతలంలో శిక్షణ విమానాలు నడిపి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. హవాక్స్, చేతక్, సారంగ్‌ హెలికాప్టర్లు, కిరణ్‌ విమానాల ఏరోబాటిక్‌ విన్యాసాలు ఆహూతులను అలరించాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top