నో పార్టీ.. ఓన్లీ సేవ: రజనీకాంత్‌

Rajinikanth announces he will not start a political party - Sakshi

పార్టీ ఏర్పాటుపై రజనీ యూటర్న్‌

మన్నించాలని వేడుకోలు

స్వాగతించిన పార్టీలు

సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజకీయపార్టీ స్థాపనపై వస్తున్న ఊహాగానాలకు తమిళనాడు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తెరదించేశారు. ఈనెల 31న పార్టీని ప్రకటించడం లేదని తెలిపారు. ఎన్నికల రాజకీయాలకు దూరంగా..ప్రజాసేవకు దగ్గరగా భావిజీవితాన్ని గడుపుతానని మంగళవారం ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ఒక ప్రకటన ద్వారా సుదీర్ఘ సంజాయిషీ ఇచ్చుకున్నారు. అందులోని వివరాలు యథాతథంగా..‘నా జీవనాధారమైన తమిళనాడు ప్రజలకు ప్రేమపూర్వక నమస్సులు. జనవరిలో పార్టీని ప్రారంభిస్తానని ప్రకటించి వైద్యుల సూచనలను ఖాతరు చేయకుండా అన్నాత్తే చిత్రం షూటింగ్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వెళ్లాను.

120 మంది సభ్యులతో కూడిన చిత్రబృందంలో నాతో సహా జాగ్రత్తలు తీసుకున్నా నలుగురికి పాజిటివ్‌ నిర్ధారణైంది. చిత్రదర్శకులు వెంటనే షూటింగ్‌ను నిలిపివేసి అందరికీ మరోసారి పరీక్షలు జరిపించగా నాకు నెగెటివ్‌ వచ్చింది. అయితే బీపీలో హెచ్చుతగ్గులు గుర్తించి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించుకున్నందున ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరించారు. దీంతో హైదరాబాద్‌లోనే చికిత్స చేయించుకున్నా. అన్నాత్తే చిత్ర షూటింగ్‌ను రద్దు చేయగా పలువురి ఉపాధి దెబ్బతింది, కొందరికి కోట్ల రూపాయల నష్టం ఏర్పడింది. వీటన్నింటికీ నా అనారోగ్యమే కారణం.

ఈ పరిణామాలు దేవుడు నాకు చేసిన హెచ్చరికగా భావిస్తున్నాను. నేను పార్టీ ప్రారంభించిన తరువాత మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే ప్రచారం చేస్తే ప్రజల్లో నేను ఆశించిన చైతన్యాన్ని తీసుకొచ్చి ఎన్నికల్లో ఘనవిజయం సాధించలేను. ఈ వాస్తవాన్ని రాజకీయ అనుభవజ్ఞులెవ్వరూ కొట్టిపారేయలేరు. ఎన్నికల ప్రచార సభలతో లక్షలాది మంది ప్రజలను కలుసుకోవాల్సి ఉంటుంది. 120 మంది చిత్రబృందంలోనే కరోనా సోకడంతో మూడు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి వచ్చింది. కరోనా కొత్తరూపుదాల్చి రెండోవేవ్‌ వ్యాపిస్తోంది.

ఎన్నికల ప్రచారానికి వెళ్లి అనారోగ్యం పాలైతే నన్ను నమ్ముకుని నా వెంట రాజకీయ ప్రయాణం చేసే వారిని సైతం సంకట పరిస్థితుల్లోకి నెట్టినవాడినవుతాను. నా ప్రాణం పోయినా పరవాలేదు, ఇచ్చిన మాటను మీరను. రాజకీయాల్లోకి వస్తానని చెప్పి ఇపుడు రావడం లేదని ప్రకటించడాన్ని నలుగురు నాలుగు విధాలుగా వ్యాఖ్యానిస్తారనే కారణంతో నమ్ముకున్న వారిని బలిపశువులను చేయలేను. ఈ కారణాలతో పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి రాలేకపోతున్నానని ఎంతో బాధాతప్త హృదయంతో చెబుతున్నాను. ఈ నిర్ణయం రజనీ మక్కల్‌ మన్రం నిర్వాహకులకు, అభిమానులకు, ప్రజలకు ఎంతో నిరాశను కలిగిస్తుంది. నన్ను క్షమించండి.

మూడేళ్లుగా నా మాటలకు కట్టుబడి, కరోనా కాలంలో ప్రజలకు సేవలందించిన నిర్వాహకుల శ్రమ వృథాపోదు. ఆ పుణ్యం మిమ్మల్ని, మీ కుటుంబాలను కాపాడుతుంది. మీరు నాపై చూపుతున్న ప్రేమాభిమానాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. రజనీ మక్కల్‌ మన్రం యథాప్రకారం పనిచేస్తుంది. మూడేళ్లుగా నా వెంట నిలిచిన తమిళరువి మణియన్‌కు, బీజేపీ నుంచి వైదొలిగి నాతో కలిసి పనిచేసేందుకు సమ్మతించిన అర్జున్‌మూర్తికి రుణపడి ఉంటాను. ఎన్నికల రాజకీయాల్లోకి రాకుండా ప్రజలకు వీలయినంత సేవ చేస్తాను. నిజాలు మాట్లాడేందుకు ఎన్నడూ వెనుకాడను. నేను తీసుకున్న ఈ నిర్ణయాన్ని పెద్ద హృదయంతో అందరూ అంగీకరించాలని వేడుకుంటున్నా’అని పేర్కొన్నారు.

ఆందోళనకు గురైన అభిమానులు
తమ అభిమాన హీరో రాజకీయ అరంగేట్రంపై మూడు దశాబ్దాలకుపైగా ఎదురుచూసిన అభిమానులు రజనీకాంత్‌ ప్రకటనతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మరో రెండురోజుల్లో పార్టీ ప్రకటన ఖాయమని ఎదురుచూస్తున్న తరుణంలో  ఈ వార్తతో తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. అన్నాడీఎంకే, కాంగ్రెస్, బీజేపీ సహా పలు రాజకీయపార్టీలు స్వాగతించాయి. ‘రజనీకాంత్‌ చేసిన ప్రకటనతో నా మానసిక పరిస్థితి ఆయన అభిమానుల్లానే ఉంది. కొద్దిగా నిరాశ చెందినా ఆయన క్షేమంగా ఉండాలి’అని నటుడు కమల్‌హాసన్‌ అన్నారు.  

అప్పట్నుంచే ఒత్తిడి  
► 1996 నుంచే రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రావాలని అభిమాన సంఘాల ఒత్తిడి.
► జయలలిత, కరుణానిధి మరణానంతరం 2017లో అభిమానులతో విస్తృత సమావేశాలు. అభిమాన సంఘాలను ప్రజా సంఘాలుగా మార్చి సభ్యత్వ నమోదు, జిల్లా ఇన్‌చార్జ్‌ల నియామకం పూర్తి.  
► డిసెంబర్‌ 31న పార్టీ ప్రకటన, జనవరిలో పార్టీ స్థాపన, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ నవంబర్‌లో ప్రకటన.
► ‘అన్నాత్తే’ చిత్రం షూటింగ్‌ కోసం ఈ నెల 13న చెన్నై నుంచి హైదరాబాద్‌ వెళ్లి, అనారోగ్యంపాలు.   

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top