కొడుకు చనిపోతే కోడలి తప్పేంటి? సునీతకు కన్యాదానం చేసిన అత్తామామలు

Rajasthan Widowed Daughter In Law Marriage By Mother in Law - Sakshi

కోడలిని కూతురిలా స్వీకరించే అత్తలు ఎంతమంది? ఆ సంగతి ఏమోగానీ ఇక్కడో అత్త.. కోడలిని కూతురిగానే భావించింది. కారణం.. కొడుకు తన కళ్ల ముందే కన్నుమూయడం. ఆ విషాదాన్ని దిగమింగుకున్న ఆ అత్త.. కోడలిని కన్నకూతురిలా దగ్గరుండి చదవించింది. అంతేకాదు మరో వ్యక్తిని చూసి పెళ్లి చేసింది కూడా! ఈ ఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీసింది.  

రాజస్థాన్‌ సికార్‌లో కమలా దేవి, దిలావర్‌ దంపతులు ఉన్నారు. వీళ్లకు శుభమ్‌ అనే కొడుకు ఉండేవాడు. 2016లో సునీత అనే అమ్మాయితో శుభమ్‌ వివాహం జరిగింది. సునీతది పేద కుటుంబం. కాకపోతే గుణం-రూపం రెండూ మంచివే. అందుకే పైసా కట్నం తీసుకోకుండా కోడలిగా స్వీకరించింది కమలా దేవి. చూడముచ్చటైన జంట అని ఊరంతా అంటుంటే.. దిష్టి తీసింది ఆ తల్లి.  ప్చ్‌.. దురదృష్టం కొద్దీ ఆరు నెలలకే సునీత భర్త చనిపోయాడు.  

కొడుకు శుభమ్‌ బ్రెయిన్‌ డెడ్‌తో చనిపోయాడు. అయితే చిన్నవయసులో భర్త చనిపోయిన సునీతను దూరం చేసుకునేందుకు ఆ వృద్ధ దంపతుల మనసు అంగీకరించలేదు. నష్టజాతకురాలు అని బంధువులంతా తిట్టిపోస్తుంటే.. కమలాదేవి వాళ్లను వారించింది. కొడుకు చనిపోతే? కోడలి తప్పేంటని సునీతకు మద్దతు నిలిచింది. పైగా పేదింటి బిడ్డ కావడంతో అమ్మగారింటికి పంపకుండా.. తమతోనే ఉంచాలని నిర్ణయించుకుంది. సునీతను మంచిగా చదవించింది. మంచి ఉద్యోగం వైపు ఆమెను ప్రొత్సహించింది. ఎంఏ బీఈడీ చదివిన సునీత.. ఈమధ్యే జూనియర్‌ లెక్చరర్‌గా ప్రభుత్వ ఉద్యోగం కూడా సంపాదించింది.

శనివారం(22, జనవరి 2022) సునీతను ముఖేష్‌ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. సునీత వివాహం చాలా ఘనంగా జరిగింది. ఆ వివాహంలో కాళ్లు కడిగి కన్యాదానం చేసింది కమలాదేవి-దిలావర్‌ దంపతులే.  అంతేకాదు అప్పగింతల సమయంలో వాళ్ల బంధం చూసి.. అత్తమామలు కాదు.. అమ్మానాన్న అనుకున్నారట అంతా. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ వివాహ వేడుక ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top