అధికారం కోసం ప్రజాస్వామ్యం బలి
బీఎల్‌వోల మరణాలపై రాహుల్ గాంధీ ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపట్టిన ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ‘ఎస్‌ఐఆర్)ను ఉద్దేశ పూర్వక కుట్రగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అధికారం కోసం ప్రజాస్వామ్యాన్ని బలిచేస్తు న్నారని మండిపడ్డారు. బీఎల్‌వోల మరణాలపై ఆదివారం ఎక్స్‌లో వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఎస్‌ఐఆర్ దేశవ్యాప్తంగా గందరగోళాన్ని సృష్టిస్తోంది. దీని ఫలితంగా మూడు వారాల్లో 16 మంది బీఎల్‌వోలు ప్రాణాలు తీసుకున్నారు. గుండెపోటు, ఒత్తిడి, ఆత్మహత్యలకు దారి తీశాయి.
ఎస్‌ఐఆర్ సంస్కరణ కాదు, ఇది మోపబడిన నేరం. మన దేశం ప్రపంచం కోసం అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్నది. కానీ కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికీ కాగితపు అడవిని సృష్టించాలనే పట్టుదలతో ఉంది. ఎస్‌ఐఆర్ ఉద్దేశపూర్వక కుట్ర. పౌరులు ఇక్కడ వేధింపులకు గురవుతున్నారు. అనవసరమైన ఒత్తిడి కారణంగా బీఎల్‌వోల మరణాలను అనుకోకుండా జరిగిన నష్టంగా భావించి విస్మరిస్తున్నారు. ఇది వైఫల్యం కాదు, కుట్ర. అధికారాన్ని కాపాడుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని బలి చేస్తున్నారు’అని రాహుల్ ఈసీ, కేంద్రంపై విరుచుకుపడ్డారు.
బీఎల్‌వోల పాలిట మృత్యుపాశం: ఖర్గే
వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన ఎస్‌ఐఆర్ ప్రక్రియ బీఎల్‌వోల పాలిట మృత్యుపాశంగా మారుతోందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. పని భారం తట్టుకోలేక బీఎల్‌వోలు ప్రాణాలు తీసుకుంటుండటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ప్రేక్షకపాత్ర వహించడంపై ఆయన నిప్పులు చెరిగారు. గతంలో నోట్ల రద్దు, కరోనా లాక్‌డౌన్ నిర్ణయాలను ప్రజల మీద ఎలాగైతే రుద్దారో.. ఇప్పుడు ‘ఎస్‌ఐఆర్’ను కూడా అలాగే ఎలాంటి ప్రణాళిక లేకుండా హడావుడిగా అమలు చేస్తున్నారని ఖర్గే మండిపడ్డారు.
దేశవ్యాప్తంగా కేవలం 19 రోజుల్లోనే 16 మంది బీఎల్‌వోలు పని ఒత్తిడి కారణంగా మరణించారని, ఇవి ఇంకా కొనసాగుతున్నాయని ఖర్గే ‘ఎక్స్’వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తుంటే మరణాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. కానీ ఈ కుటుంబాలకు న్యాయం చేసేదెవరు? బీజేపీ ఓట్ల చోరీ ఇప్పుడు ప్రాణాంతకంగా మారింది. అధికార దాహంతో రాజ్యాంగ సంస్థల అధికారులను ఆత్మహత్య చేసుకునేలా చేస్తున్నారు’అని విమర్శించారు.


