క్యూ వరసల్లో బెంచీలు | Provide Minimum Amenities at Polling States | Sakshi
Sakshi News home page

క్యూ వరసల్లో బెంచీలు

Mar 23 2026 3:13 AM | Updated on Mar 23 2026 3:13 AM

Provide Minimum Amenities at Polling States

నీడపట్టున నిలబడేలా ఏర్పాట్లు 

మొబైల్‌ ఫోన్ల డిపాజిట్‌కు ప్రత్యేక కౌంటర్లు 

పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్ల సంరక్షణ కోసం పలు చర్యలు 

ఈ మేరకు రాష్ట్రాల సీఈఓలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం

సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో జరగబోయే పలు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో కోట్లాది మంది ఓటర్లు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఓటేసేందుకు అనువుగా పో­లింగ్‌ కేంద్రాల వద్ద తగు సదుపాయాలు కల్పించా­లని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా వెంటనే ఈ మేరకు ఆదివా­రం రాష్ట్రాల చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌(సీఈఓ)లకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

 అస్సాం, కేరళ, పుదు­చ్చెరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ శాసనసభ ఎన్నికలతో పాటు 6 రాష్ట్రాల్లో జరగనున్న ఉప ఎన్నికల వేళ కచ్చితంగా కనీస సౌకర్యాలను కల్పించాలంటూ ‘అష్యూర్డ్‌ మినిమమ్‌ ఫెసిలిటీస్‌’ పేరిట కొన్ని సూచనలు చేసింది. మొత్తం 2,18,807 పోలింగ్‌ కేంద్రాల్లో ఈ సౌకర్యాలను యుద్ధప్రాతిపదికన సిద్ధం చేయాలని సీఈఓలను ఈసీ ఆదేశించింది. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు వేచి ఉండే చోట ఎండపడకుండా నీడ ఏర్పడేలా టెంట్లు, పరదాలు ఏర్పాటుచేయాలని సూచించింది. 

చాంతాడంత క్యూ వరసల్లో చాలాసేపు నిలబడి అలసిపోయే ఓటర్ల సౌక­ర్యం కోసం మధ్యమధ్యలో బెంచీలు ఏర్పాటు చేయాలని పేర్కొంది. తాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించింది. సరిపడా వెలుతురుతో టా­యి­లెట్లు ఏర్పాటుచేయాలని తెలిపింది. దివ్యాంగ ఓటర్ల కోసం సరైన గ్రేడియంట్‌ ఉన్న ర్యాంప్‌లను నిర్మించాలి. పోలింగ్‌ కేంద్రం చిరునామా, వివరాలు, అభ్యర్థుల జాబితా, ఓటు వేసే విధానం, పోలింగ్‌ కేంద్రంలో నిషేధిత పనులు, పోలింగ్‌కు ఏఏ గుర్తింపుకార్డులను అనుమతిస్తారనే వివరాలతో కూడిన ‘ఓటర్‌ ఫెసిలిటేషన్‌ పోస్టర్లు’ప్రతి కేంద్రం వద్ద ప్రదర్శించాలని స్పష్టం చేసింది. పోలింగ్‌ కేంద్రాల్లోకి ఫోన్లను అనుమతించకూడదని నిర్ణ­యించారు. 

ఈ నేపథ్యంలో ఓటర్లు తమ మొబైల్‌ ఫోన్లను బయటే భద్రపరుచుకునేలా పోలింగ్‌ కేంద్రం బయట ‘మొబైల్‌ ఫోన్‌ డిపాజిట్‌’సదుపాయా­న్ని కల్పించనున్నారు. తొలుత ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి అక్కడి వలంటీర్‌కు ఇస్తే, ఓటేశాక ఓటరుకు తిరిగి ఇచ్చేస్తారు. ఓటరు జాబితాలో తమ పేరు, సీరియల్‌ నంబర్‌ వెతుక్కునే పనిలేకుండా ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద ‘ఓటరు అసిస్టెన్స్‌ బూత్‌’లను ఏర్పా­టు చేయనున్నారు. బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు ఇక్కడ అందుబాటులో ఉండి ఓటర్లకు మార్గనిర్దేశం చేస్తా­రు. పోలింగ్‌కేంద్రంలో పోలింగ్‌ బూత్‌ నంబర్, సీ­రి­యల్‌ నంబర్‌ విషయంలో ఓటర్లకు బూత్‌స్థాయి అధికారులు సాయపడతారు. ఈ నిబంధనల అమ­లులో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, పోలింగ్‌ తేదీకల్లా తగు సౌకర్యాలను అందుబాటులోకి తేవాలని ఈసీ ఆదేశించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement