బుల్డోజర్లు, కూల్చివేతలు

Prophet remarks row: UP govt brings out bulldozers in 2 cities - Sakshi

అల్లర్ల బాధ్యుల నివాసాలు నేలమట్టం

బెంగాల్, జార్ఖండ్‌ల్లో ఉద్రిక్తత

మోదీ మాట్లాడాలి: థరూర్‌

లక్నో/కోల్‌కతా/రాంచీ: ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యల నేపథ్యంలో రెండు రోజులుగా అల్లర్లు చెలరేగిన ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో ప్రశాంతత నెలకొంటోంది. చాలా ప్రాంతాల్లో నిషేధాజ్ఞలను ఎత్తేసి, ఇంటర్నెట్‌ సేవలను పునరుద్ధరిస్తున్నారు. బెంగాల్‌లో హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో పర్యటించేందుకు వెళ్లిన ప్రతిపక్ష నేత సువేందును అధికారులు అడ్డుకున్నారు. యూపీలో అల్లర్లకు బాధ్యులుగా భావిస్తున్న వారి అరెస్టులు, అనుమానితుల ఇళ్ల కూల్చివేతలు కొనసాగుతున్నాయి.

రాంచీలో ఉద్రిక్తతల దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి సస్పెండైన బీజేపీ నేతలు నుపుర్‌ శర్మ, నవీన్‌ కుమార్‌ జిందాల్‌కు మహారాష్ట్రలోని భివాండీ పోలీసులు సమన్లు జారీ చేశారు. శుక్రవారం పలు రాష్ట్రాల్లో జరిగిన అల్లర్లను బీజేపీ అనుబంధ ముస్లిం రాష్ట్రీయ మంచ్‌ ఖండించింది. వాటిలో పాల్గొన్న వారిని ఇస్లాం నుంచి వెలి వేయాలని మంచ్‌ వ్యవస్థాపకుడు, ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ఇంద్రేశ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. దేశంలో పెరుగుతున్న విద్వేష ప్రసంగాలు, ఇస్లాం విద్వేష ఘటనలపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్‌ నేత శిశిథరూర్‌ అన్నారు.

యూపీలో బుల్డోజర్లు
యూపీలో శుక్రవారం నాటి అల్లర్లకు బాధ్యులుగా భావిస్తున్న వారి అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సహరన్‌పూర్‌లో రాళ్లు రువ్వి న ఘటనలకు సూత్రధారిగా అనుమానిస్తూ ఇద్దరి ఇళ్లను అధికారులు శనివారం నేలమట్టం చేయడం తెలిసిందే. ప్రయాగ్‌రాజ్‌లో రాళ్లు రువ్విన ఘటనల్లో ప్రధాన నిందితుడిగా గుర్తించిన జావెద్‌ అహ్మద్‌ అనుమతుల్లేకుండా కట్టిన ఇంటిని ఆదివారం బుల్‌డోజర్లతో నేలమట్టం చేశారు. ‘శుక్రవారం తర్వాత శనివారం వస్తుంది. చట్ట వ్యతిరేక చర్యలకు దిగేవారు దీన్ని గుర్తుంచుకోవాలి’ అని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మీడియా సలహాదారు మృత్యుంజయ్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు.  అల్లర్లకు సంబంధించి మొత్తం 316 మందిని అరెస్ట్‌ చేశారు.

బెంగాల్లో హైడ్రామా
శుక్రవారం అల్లర్లకు సంబంధించి బెంగాల్‌లోని ముర్షిదాబాద్, హౌరా జిల్లాలకు చెందిన 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. పూర్బ మేదినీపూర్‌ జిల్లాలోని తామ్లుక్‌లో ఆదివారం ఉదయం హైడ్రామా నడిచింది. హౌరాలోని అల్లర్ల ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు వెళ్లిన విపక్ష నేత సువేందు అధికారిని పోలీసులు అడ్డుకున్నారు. రెండు గంటల అనంతరం నేరుగా కోల్‌కతాకు వెళ్లాలన్న షరతుతో ఆయన్ను వదిలేశారు.  జార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. హింసకు పాల్పడినట్లు గుర్తించిన 22 మందితోపాటు, గుర్తు తెలియని వేలాది మందిపై 25 కేసులు పెట్టారు. కొన్ని ప్రాంతాల్లో 144వ సెక్షన్‌ ఎత్తివేశారు. ఇంటర్నెట్‌ సేవలు పునరుద్ధరించారు. కశ్మీర్లోని
పలు పట్టణాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top