బెంగాల్‌ ఫైల్స్‌ బయటపెడతాం  | PM Narendra Modi Slams Mamata Banerjee Govt | Sakshi
Sakshi News home page

బెంగాల్‌ ఫైల్స్‌ బయటపెడతాం 

Apr 25 2026 4:37 AM | Updated on Apr 25 2026 6:14 AM

PM Narendra Modi Slams Mamata Banerjee Govt

మహిళలపై ప్రభుత్వ అరాచకాలను బహిర్గతం చేస్తాం 

ఇది మోదీ గ్యారంటీ 

ఫలితాలొచ్చాక టీఎంసీ గూండాలు దాక్కోడానికి రాష్ట్రంలో చోటే ఉండదు 

ప్రభుత్వం ఆర్జీకర్‌ బాధితురాలిని తల్లికి దూరం చేసింది 

బెంగాల్‌లో ఎన్నికల ప్రచార సభల్లో మమత సర్కార్‌పై ప్రధాని మోదీ విమర్శల జడి

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ రెండో దశ ఎన్నికల ప్రచారసభల్లో మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ పాలనపై ప్రధాని మోదీ విమర్శల నిప్పులు కురిపించారు. శుక్రవారం నార్త్‌ 24 పరగణాల జిల్లా, జాదవ్‌పూర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని బారూయ్‌పూర్, డమ్‌డమ్‌ లోక్‌సభ నియోజకవర్గంలోనే పానీహటిల్లో ఎన్నికల ప్రచారర్యాలీల్లో మోదీ ప్రసంగించారు.

 ‘‘టీఎంసీ అంటేనే మహిళా వ్యతిరేక పార్టీ. న్యాయం కావాలని బెంగాలీ మహిళలు అడిగితే టీఎంసీ ప్రభుత్వం ఇల్లుదాటి బయటకు రాకండి అని ఉచిత సలహాలు పడేస్తుంది. మేం అధికారంలోకి రాగానే టీఎంసీ ప్రభుత్వం మహిళలపై చేసిన అకృత్యాలు, ప్రజలపై దౌర్జన్యం, దోపిడీ సంబంధిత ప్రతి ఫైల్‌ను బయటపెడతాం. మహిళలపై అరాచకాల ప్రతి ఫైల్‌ను తెరుస్తాం. న్యాయం చేస్తాం. ఇది మోదీ గ్యారంటీ’’అని మోదీ అన్నారు. 

‘‘తొలిదఫా ఎన్నికల్లో పోలింగ్‌శాతం భారీస్థాయిలో నమోదైంది. ఇది టీఎంసీ సాగించిన మహా ఆటవిక పాలన అంతంకాబోతోందనడానికి సూచిక. ఇది టీఎంసీ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలంటూ బీజేపీ చేసిన ప్రచారానికి దక్కిన భారీ మద్దతు. 3.6 కోట్ల మంది ఓటర్లు ఏకంగా 93 శాతం పోలింగ్‌ నమోదుచేసి రాష్ట్రంలో మార్పురాబోతోందని స్పష్టంచేశారు’’అని మోదీ అన్నారు. 

కొన్ని నెలల క్రితం ఆర్జీకర్‌ బోధనాస్పత్రిలో వైద్యురాలి హత్యాచార ఘటనను మోదీ గుర్తుచేశారు. ‘‘తన కూతురు వైద్యురాలిగా మారేందుకు ఒక తల్లి ఎంతగానో శ్రమించింది. రాష్ట్రంలోని టీఎంసీ ప్రభుత్వం ఆ కుమార్తెను తల్లికి దూరం చేసింది. మేం ఆ అత్యాచార బాధితురాలి తల్లి రత్నా దేబ్‌నాథ్‌ను పానిహటీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చాం. సందేశ్‌ఖాలీ అరాచకాల బాధితుల్లో ఒక మహిళను సైతం అభ్యర్థిగా బరిలో నిలిపాం. 

మమతా బెనర్జీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాస్వామ్య దేవాలయాలను నేలమట్టం చేసింది. ఓటర్లు కదిలొచ్చి స్వయంగా మళ్లీ బ్యాలెట్‌ ఓట్ల ద్వారా ఆ ఆలయాలను పునర్‌నిర్మిస్తున్నారు. తొలి దశ పోలింగ్‌లో భారీ ఓటింగ్‌తో ఇది మొదలైంది. రెండో దశ పోలింగ్‌తో నిర్మాణం సంపూర్ణమవుతుంది. అప్పుడు మేం గెలిచి ప్రజాస్వామ్య ఆలయంపై విజయపతాక ఎగరేస్తాం. 

ఓటింగ్‌ వరద చూసి టీఎంసీ నేతలు వణికిపోతున్నారు. కోపంతో ఓటర్లు, బీజేపీ కార్యకర్తలను టీఎంసీ గూండాలు బెదిరిస్తున్నారు. తొలిదఫా ఎన్నికల ఓటింగ్‌ అధికార పార్టీ ఓటమిని కళ్లకు కట్టింది. మే 4వ తేదీన ఫలితాలొస్తాయి. అప్పుడు టీఎంసీ గూండాలకు రాష్ట్రంలో దాక్కోడానికి చోటే ఉండదు. మార్పు కావాల్సిందే... బీజేపీ సర్కార్‌ రావాల్సిందే అని బెంగాల్‌ ప్రతిధ్వనిస్తోంది’’అని మోదీ అన్నారు. 

ఇది పోరాటాల గడ్డ.. 
‘‘ఎన్నికలు అనేవి అతిపెద్ద సైద్ధాంతిక పోరాటం. పశ్చిమబెంగాల్‌ అనేది పోరాటాల గడ్డ. ధైర్యవంతుల అడ్డా. దాస్యశృంఖలాలు తెంపాలంటే రక్తం ధారపోయండి మీకు స్వేచ్ఛా స్వాతం్రత్యాలను సిద్ధింపజేస్తానని నేతాజీ సెలవిచ్చారు. ఇప్పుడు బెంగాల్‌లో మరో విప్లవం రావాల్సిన తరుణమొచ్చింది. మీ ఓటుతోనే ఈ విప్లవం సుసాధ్యం. ఏళ్ల కష్టాలను బీజేపీ ఒక్క దెబ్బతో తొలగించబోతోంది. 

భయం, అవినీతి, సిండికేట్‌ పాలన, మహిళలపై దౌర్జన్యాలు, నిరుద్యోగం, బలవంతపు వలసలు, చొరబాటుదారుల ఆక్రమణల నుంచి బీజేపీ శాశ్వత పరిష్కారం చూపిస్తుంది’’అని మోదీ హామీ ఇచ్చారు. ‘మీ సోదరుడిగా చెబుతున్నా. మహిళల భద్రతే మాకు అత్యంత ముఖ్యం. బెంగాల్‌లో మహిళా శక్తే ఈ రాష్ట్రంలో నూతన శకాన్ని లిఖించబోతోంది’అని అన్నారు.

దశాబ్దానికి మించి దారుణ దోపిడీ 
‘‘గత 15 ఏళ్లుగా మమతా బెనర్జీ పార్టీ రాష్ట్రాన్ని దోచుకుంటోంది. అవినీతి, చొరబాట్లతో రాష్ట్రం పరువు తీస్తోంది. బొగ్గు, ఇసుక, రేషన్, చిట్‌ఫండ్‌ ఇలా ప్రతిదాంట్లో కుంభకోణాలుచేశారు. అవినీతి మరకలు అంటని రంగమే లేదు. ఉన్నత విద్యా ప్రమాణాలతో భాసిల్లిన జాదవ్‌పూర్‌ వర్సిటీ వంటి ప్రతిష్టాత్మకవర్సిటీలను రాజకీయ క్రీడాస్థలిగా మార్చేసింది. విద్యార్థులతో బలవంతంగా ధర్నాలు, నిరసన ర్యాలీలు చేయిస్తున్నారు. 

ఇలాంటి దారుణాలకు మేం వచ్చాక చరమగీతం పాడుతాం. చిన్న దుకాణదారులు మొదలు పెద్ద వ్యాపారులదాకా, ట్యాక్సీ డ్రైవర్లు మొదలు రిక్షావాలాలదాకా, ప్రభుత్వ ఉద్యోగులు మొదలు పోలీస్‌లదాకా అందరూ ధైర్యంగా కమలదళానికి దన్నుగా నిలుస్తున్నారు. ఉపాధ్యాయులు, న్యాయవాదులు, వైద్యులు సైతం బీజేపీకే మద్దతు పలుకుతున్నారు. తొలిదఫాలో తొలిసారి ఓటేసిన వాళ్లూ మాకే అండగా నిలబడ్డారు. ఇక మీవంతు’’అంటూ యువ ఓటర్లకు మోదీ పిలుపునిచ్చారు.

హూగ్లీలో మోదీ పడవ షికారు 
ఎన్నికల ప్రచారం కోసం కోల్‌కతాకు 
వచ్చిన మోదీ అక్కడి ప్రిన్సిప్‌ ఘాట్‌కు చేరుకుని హూగ్లీ నదిలో కొద్దిసేపు బోటు షికారు చేశారు. అక్కడి రమణీయమైన దృశ్యాలను వెంటతీసుకొచ్చిన తమ కెమెరాలో బంధించారు. గంగానదికి హూగ్లీ ఉపనది. ‘‘గంగానది అనేది ప్రతి ఒక్క బెంగాళీ మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుంది. బెంగాల్‌ ఆత్మలో గంగానదీ సజీవంగా పారుతుంది. యావత్‌ మానవ నాగరికత స్ఫూర్తిని ఈ పవిత్రనదీజలాలు వెంటతీసుకొచ్చాయి. 

ఈరోజు ఉదయం కోల్‌కతాలో హూగ్లీ నది హొయలను నా కెమెరా కంటితో చూశా. కొన్ని జ్ఞాపకాలను ఫొటోలుగా కెమెరాలో బంధించా. విద్యాసాగర్‌ సేతు, ప్రఖ్యాత హౌరా వంతెనను పడవలో ప్రయాణిస్తూ దగ్గర్నుంచి తిలకించి ముగ్ధుడినయ్యా. హూగ్లీ నదీతీరంలో కాసేపు గడిపి గంగామాత రుణం తీర్చుకునే సదవకాశం సంపాదించా’’అని అన్నారు. తాను తీసిన ఫొటోలను తర్వాత మోదీ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్‌’ఖాతాలో పోస్ట్‌చేశారు. 

మోదీ తన పడవలో షికారుకు రావడంతో పడవనడిపే గౌరంగా బిశ్వాస్‌ ఆనందం వ్యక్తంచేశారు. ‘‘ప్రధాని రాబోతున్నారని నాకు ముందస్తుగా ఎవరూ చెప్పలేదు. హఠాత్తుగా అధికారులు వచ్చి షికారుకు వస్తావా? అని అడిగారు. సరేనన్నా. హఠాత్తుగా మోదీ వచ్చి పడవలో కూర్చున్నారు. గంటసేపు నదిలో తిప్పా. రూ.1,000 ఇచ్చారు’’అని బిశ్వాస్‌ వెల్లడించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement