ప్రపంచంలోనే సుదూర నదీ పర్యాటకం | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే సుదూర నదీ పర్యాటకం

Published Wed, Jan 11 2023 3:17 AM

PM Modi to flag off worlds longest river cruise Ganga Vilas in Varanasi on Jan 13 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: నదీజలాల్లో పర్యాటకులు సుదూరాలకు విలాసవంత ప్రయాణం సాగించేలా రివర్‌ క్రూయిజ్‌ (షిప్‌) పర్యాటకానికి భారతీయ నదులు సిద్ధమయ్యాయి. 52 రోజులపాటు గంగావిలాస్‌ పేరుతో కొనసాగే ఈ పర్యాటక నౌక సేవలను ప్రధాని మోదీ ప్రారంభించనున్నాను. గంగా నది, బ్రహ్మపుత్ర నదుల మీదుగా కొనసాగే ఈ ప్రయాణం జనవరి 13న వారణాసిలో ప్రారంభం అవుతుంది.

దాదాపు 3,200 కిలోమీటర్ల పాటు 5 రాష్ట్రాల్లో మొత్తం 27 నదుల్లో ప్రయాణించి బంగ్లాదేశ్‌ మీదుగా మార్చి ఒకటిన అస్సాంలోని దిబ్రూగఢ్‌కు గంగా విలాస్‌ చేరుకుంటుందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి వెల్లడించారు. ప్రపంచంలో ఇంతవరకు ఇలా రెండు పొడవైన నదులపై క్రూయిజ్‌ (షిప్‌)లో పర్యటన సందర్భాలు లేవని తెలిపారు.

అందుకే తొలిసారిగా అత్యంత ఎక్కువ దూరాలకు గంగ, బ్రహ్మపుత్ర నదులపై కొనసాగే ఈ యాత్రపై ఆసక్తి నెలకొందని వివరించారు. ‘గంగా విలాస్‌ రివర్‌ క్రూయిజ్‌ ప్రాజెక్టు ద్వారా భారత్, బంగ్లాదేశ్‌ మధ్య సాంస్కృతిక బంధాన్ని ప్రపంచానికి చాటిచెప్తాం. భారతీయ పర్యాటకరంగ రూపురేఖలు మార్చడంలో ఈ ప్రాజెక్ట్‌ కీలక భూమిక పోషించనుంది’ అని ఉద్ఘాటించారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement