సాక్షి,చెన్నై: తమిళనాడులో ఆసక్తి పరిణామాలు చోటు చేసుకున్నాయి. తమిళనాడులో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధినేతగా రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన సీఎం విజయ్, దేశ ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఒకే వేదికను పంచుకోవడం, కలిసి అధికారికంగా పబ్లిక్ ఈవెంట్ నిర్వహించడం ఇదే మొదటిసారి. కేవలం సభల్లో పాల్గొనడమే కాకుండా, ఇద్దరు అగ్రనేతలు ఒకే మెట్రో రైలులో పక్కపక్కనే కూర్చుని ప్రయాణించడం, సాధారణ ప్రయాణికులతో ముచ్చటించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చెన్నై నగర రవాణా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిన చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్ట్ రెండో దశ ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, సీఎం విజయ్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేశారు. దాదాపు రూ. 4,900 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ మెట్రో ఫేజ్-2 మొదటి విడతలో భాగంగా పూనమల్లి బైపాస్ నుంచి వడపలని వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర విస్తరించిన ఎలివేటెడ్ మార్గంలో రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయి.
ఈ తొలి మార్గంలో ప్రారంభంలో 15 రైళ్లను అందుబాటులో ఉంచగా.. రద్దీ వేళల్లో ప్రతి 10 నిమిషాలకు, సాధారణ సమయాల్లో ప్రతి 15 నిమిషాలకు ఒక రైలు నడుస్తాయని అధికారులు వెల్లడించారు. మెట్రో ప్రారంభంతో పాటు, దేశ ఆర్థిక వ్యవస్థను, రాష్ట్ర మౌలిక వసతులను బలోపేతం చేసే లక్ష్యంతో రూ. 13వేల కోట్లకు పైగా విలువైన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
జాతీయ రహదారులు, రైల్వేలు, చెన్నై పోర్ట్, వావొ చిదంబరనార్ పోర్ట్‌తో పాటు పెట్రోలియం రంగంలో చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, మనాలీ రిఫైనరీలో గ్రూప్ లూబ్ ఆయిల్ బేస్ స్టాక్స్ ప్రాజెక్ట్‌కు ప్రధాని శంకుస్థాపనలు చేశారు.
తమిళనాడు రాజకీయాల్లో మారుతున్న తాజా పరిణామాల నేపథ్యంలో.. విజయ్, మోదీతో కలిసి ఇలా ముఖాముఖిగా మెట్రోలో పర్యటించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే ప్రధాని మోదీ ప్రసిద్ధ జలకంఠేశ్వర ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన ఐఐటీ మద్రాస్ వేదికగా జరిగిన అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు
#WATCH | Chennai, Tamil Nadu: Prime Minister Narendra Modi undertakes a ride on the Chennai Metro from Porur Bypass Station to Poonamallee Bypass Station and back. CM C. Joseph Vijay also present. (Source: DD News) https://t.co/OBPay5hnYo
— ANI (@ANI) October 11, 2026


