వైద్యుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారా?: కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Playing With Doctors Future: SC to Centre over unfilled NEETPG Seats - Sakshi

న్యూఢిల్లీ: నీట్‌ పీజీ–21 కౌన్సిలింగ్‌లో ఏకంగా 1456 సీట్లు ఖాళీగా మిగిలిపోవడంపై సుప్రీంకోర్టు విస్మయం వెలిబుచ్చింది. దేశమంతా డాక్టర్ల కొరతతో అల్లాడుతుంటే ఇదేం నిర్వాకమంటూ మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ) తీరును తూర్పారబట్టింది. మెడికల్‌ పీజీ ఖాళీల భర్తీకి ప్రత్యేక కౌన్సిలింగ్‌ చేపట్టేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను న్యాయమూర్తులు జస్టిస్‌ ఎంఆర్‌ షా, అనిరుద్ధ బోస్‌లతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ బుధవారం విచారించింది. ‘‘ఒక్క సీటు మిగిలినా దాన్ని ఖాళీగా పోనీయొద్దు. అది మెడికల్‌ కౌన్సిల్‌ బాధ్యత. కానీ ఏటా ఇదే సమస్య పునరావృతమవుతోంది. ఇన్ని సీట్లు ఖాళీగా మిగిలిపోతే ఎలా?’’ అంటూ తూర్పారబట్టింది.

సీట్ల సంఖ్య, అడ్మిషన్ల సంఖ్య వెల్లడికి కటాఫ్‌ డేట్‌ ఉండాలని మేం గతంలోనే తీర్పు ఇచ్చాం. అయినా కౌన్సెలింగ్‌ మధ్యలో సీట్లను ఎందుకు జోడిస్తున్నారు? ఇలాంటి చర్యలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఎంతటి ఒత్తిడి పడుతుందో ఆలోచించారా? స్టూడెంట్ల భవిష్యత్తుకు సంబంధించిన విషయమిది. అహర్నిశలూ పట్టుదలగా చదివి పరీక్ష రాయాలి. 99 శాతం తెచ్చుకున్నా చివరికిలా అడ్మిషన్‌ సమస్యలు! ఇలాంటి పరిస్థితి వారినెంతటి నరకంలోకి నెడుతుందో మీకు అర్థమవుతోందా?’’ అని ప్రశ్నించింది. కేంద్రం తరఫున వాదించాల్సిన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ బల్బీర్‌సింగ్‌ వ్యక్తిగత సమస్యతో రాలేకపోయినందున వాయిదా ఇవ్వాలన్న విజ్ఞప్తికి తిరస్కరించింది.

‘‘ఇది వైద్య విద్యార్థుల హక్కులకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన అంశం. పైగా సుప్రీంకోర్టులో కేంద్రానికి ప్రాతినిధ్యం వహించేందుకు ఒక్క ఏఎస్‌జీ మాత్రమే లేరుగా!’’ అని పేర్కొంది. మొత్తం సీట్లు, ఖాళీలు, అందుకు కారణాలతో 24 గంటల్లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్రాన్ని, ఎంసీసీని ఆదేశిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. అడ్మిషన్ల వ్యవహారాలు చూసే డైరెక్టర్‌ జనరల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ గురువారం హాజరవాలని ఆదేశించింది. విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వకుంటే వారికి పరిహారమివ్వాల్సిందిగా ఆదేశాలిస్తామని పేర్కొంది. 
చదవండి: ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. ఆహుతైన కార్లు, బైక్‌లు, రిక్షాలు, ఫొటోలు వైరల్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top