లండన్/ఇస్లామాబాద్: భారత్, పాకిస్థాన్ మధ్య తెరవెనుక చర్చలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయా? పాక్ సైన్యాధిపతి జనరల్ అసిమ్ మునీర్ భారత్‌తో శాంతిని కోరుకుంటున్నారని, అయితే స్వదేశంలో తన ప్రతిష్ఠను కాపాడుకునేందుకు ఓ మార్గం అవసరమని పాక్ రాజకీయ విశ్లేషకురాలు డాక్టర్ ఆయేషా సిద్ధిఖా తెలిపారు. పాకిస్థాన్‌కు చెందిన ఓ మాజీ సీనియర్ రాయబారికి భారత వీసా లభించిందని, ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారని తెలిపారు. గత ఏడాది ఆయన వీసా దరఖాస్తు తిరస్కరణకు గురైందని పేర్కొన్నారు. భారత్‌తో అనధికారిక సంప్రదింపులకు వాతావరణం కల్పించేందుకే ఈ పర్యటన జరిగి ఉండవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.
పాక్ జర్నలిస్టు రజా రూమీతో మాట్లాడిన ఆయేషా సిద్ధిఖా.. భారత్, పాకిస్థాన్ మాజీ అధికారులు గతంలో పలుమార్లు చర్చలు జరిపినట్లు తెలిపారు. ఈ చర్చల్లో పాల్గొన్న అసిమ్ మునీర్‌కు సన్నిహితంగా ఉండే ఓ పాక్ మాజీ సైనిక అధికారి.. సైన్యాధిపతి శాంతిని కోరుకుంటున్నారని, అయితే ఆయన గౌరవానికి భంగం కలగకుండా చూడాలని చెప్పినట్లు వెల్లడించారు. ప్రభుత్వాల మధ్య నేరుగా చర్చలు జరపడం కంటే, తొలుత రెండు దేశాల సైనిక స్థాయిలో సంప్రదింపులు ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విశ్లేషించారు. ముఖ్యంగా ఇరు దేశాల నిఘా సంస్థల మధ్య సంభాషణ మొదలయ్యేలా చూడటం ఈ ప్రయత్నాల లక్ష్యమై ఉండవచ్చని పేర్కొన్నారు. అయితే ఈ పరిణామాలపై అధికారిక ధ్రువీకరణ లేదు.
షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సమావేశాలు కూడా భారత్-పాక్ సంబంధాల విషయంలో కీలకమని ఆయేషా సిద్ధిఖా అభిప్రాయపడ్డారు. ఎస్‌సీఓ సమావేశానికి భారత అధికారులు ఇస్లామాబాద్‌కు వెళ్లినప్పుడు వారికి మంచి ఆదరణ లభించిందని తెలిపారు. వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగనున్న ఎస్‌సీఓ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యేలా పాక్ ప్రయత్నించవచ్చని పేర్కొన్నారు. మరోవైపు, పశ్చిమాసియా వ్యవహారాల్లో పాకిస్థాన్ అవసరం దృష్ట్యా భారత్‌తో సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావాలని అమెరికా ఒత్తిడి చేస్తుండవచ్చని విశ్లేషించారు. అయితే అమెరికా ఒత్తిడిపై నిర్దిష్ట ఆధారాలను ఆమె వెల్లడించలేదు.
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 అంశంపై భారత్ వైఖరి కీలకమని ఆయేషా సిద్ధిఖా పేర్కొన్నారు. ఈ అంశాన్ని పక్కనపెట్టి సంబంధాల సాధారణీకరణపై దృష్టి పెట్టాలని భారత్ కోరుకుంటోందని ఆమె అభిప్రాయపడ్డారు. ఆర్టికల్ 370 రద్దు ప్రభావం పాకిస్థాన్‌లోనూ రాజకీయ పరిణామాలకు దారితీసిందని విశ్లేషించారు. పదవీకాలం పొడిగింపు పొందిన పాక్ సైన్యాధిపతులు భారత్‌తో సంబంధాలను మెరుగుపర్చేందుకు ప్రయత్నించడం గతంలోనూ కనిపించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో అసిమ్ మునీర్ కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తుండవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే భారత్-పాక్ మధ్య అధికారిక చర్చలు ప్రారంభమయ్యాయా? అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఇదీ చదవండి: ‘9/11’తో స్ఫూర్తి: షాకిస్తున్న ఫ్లైదుబాయ్ కో పైలట్ ప్లాన్!


