శబరిమల మకరవిళక్కు తీర్థయాత్ర కాలంలో నిర్వహించే అత్యంత విశిష్టమైన పడిపూజ నేడు (జనవరి 16) ప్రారంభం కానుంది. కఠినమైన వ్రత నియమాలను పాటిస్తూ , ఇరుముడి ధరించిన భక్తులు పాదాలు మోపే ఆ పవిత్రమైన పద్దెనిమిది మెట్లను (పతినెట్టాంపడి) పూలతోనూ , పట్టు వస్త్రాలతోనూ , దివ్యమైన దీపాలతోనూ అలంకరించి ఈ పూజను నిర్వహిస్తారు.
పూజా విశేషాలు
నేటి సాయంత్రం దీపారాధన అనంతరం 6:45 గంటలకు పడిపూజ ప్రారంభమవుతుంది. ప్రధాన తంత్రి కంఠరారు మహేష్ మోహనరు , మేల్‌శాంతి ఇ.డి. ప్రసాద్ నంబూతిరిల నేతృత్వంలో సుమారు ఒక గంట పాటు ఈ క్రతువు కొనసాగుతుంది. పడిపూజ జరుగుతున్న సమయంలో భక్తులకు మెట్ల ద్వారా ప్రవేశం ఉండదు.
పద్దెనిమిది మెట్లలోని ప్రతి మెట్టులోనూ దైవిక చైతన్యం కొలువై ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శబరిమల సహా పద్దెనిమిది కొండలకు ఈ మెట్లు ప్రతిరూపాలని భావిస్తారు. దీప కాంతులతో ధగధగలాడుతూ , పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన పద్దెనిమిది మెట్ల ఆ అపూర్వ దృశ్యం భక్తులకు కనువిందు చేయడమే కాక , మనసుకి ఎనలేని ఆధ్యాత్మిక తృప్తిని ప్రసాదిస్తుంది.
ఇది కూడా చదవండి: Mumbai: మేయర్ పీఠం ఎవరిది?.. కాసేపట్లో ఉత్కంఠకు తెర!


