Padampur MLA: పద్మపూర్‌ ఎమ్మెల్యే మృతి 

Padampur MLA Bijay Ranjan Singh Bariha no more - Sakshi

భువనేశ్వర్‌: పద్మపూర్‌ శాసనసభ సభ్యుడు, మాజీమంత్రి బిజయ్‌రంజన్‌ సింఘ్‌ బొరిహా(65) స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం పద్మపూర్‌లో సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. పద్మపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన వరుసగా 5సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తొలి 2సార్లు జనతా దళ్‌ టికెట్‌తో పోటీ చేసి గెలుపొందారు.

బిజూ జనతాదళ్‌ ఆవిర్భావం నుంచి బీజేడీ టికెట్‌తో పోటీ చేసి, నిరవధికంగా గెలుపొందారు. 1990 నుంచి 2000 వరకు జనతాదళ్‌ అభ్యర్థిగా, 2000, 2009, 2019 ఎన్నికల్లో బిజూ జనతాదళ్‌ అభ్యర్థిగా శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. 2009లో రాష్ట్ర దళిత, హరిజన అభివృద్ధి విభాగం మంత్రి పదవి ఆయనకు వరించింది. ఈ సందర్భంగా సమర్ధవంతమైన నాయకుడిని బీజేడీ కోల్పోయిందని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సంతాపం ప్రకటించారు. ప్రజా సంక్షేమం ధ్యేయంగా అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తిగా ప్రత్యేక గుర్తింపు సాధించారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కుటుంబీకులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

చదవండి: (దసరా ఉత్సవాల్లో అపశ్రుతి.. స్టేజ్‌పైనే కుప్పకూలిన ప్రముఖ గాయకుడు)

శాసనసభ ఆవరణలో గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌ 
భువనేశ్వర్‌: బర్‌గడ్‌ జిల్లా పద్మపూర్‌ ఎమ్మెల్యే దివ్యరంజన్‌ బొరిహాకు శాసనసభ ఆవరణలో అంతిమ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం గార్డు ఆఫ్‌ ఆనర్‌ నిర్వహించారు. సాంఘిక సంక్షేమ, దివ్యాంగుల సాధికారిత విభాగం మంత్రి అశోక్‌చంద్ర పండా, ఆహార సరఫరా, వినియోగదారుల సంక్షేమశాఖ మంత్రి అతున్‌ సవ్యసాచి నాయక్, శాసనసభ విపక్షనేత జయనారాయణ మిశ్రా, పార్లమెంట్‌ సభ్యురాలు సులత దేవ్, ఎమ్మెల్యేలు ప్రణబ్‌ ప్రకాశ్‌దాస్, అనంత నారాయణ జెనా, సుశాంత రౌత్, మాజీ ఎమ్మెల్యే రమారంజన బలియార్‌ సింఘ్, రాష్ట్ర మహిళ కమిషన్‌ అధ్యక్షురాలు మీనతి బెహరా, రాష్ట్ర శాసనసభ కార్యదర్శి దాశరథి శత్పతి, పలువురు ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా హాజరై శ్రద్ధాంజలి ఘటించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top