ముంచుకొస్తున్న మహా ఎల్‌ నినో!  | Pacific Ocean heating, Indian cities at highest risk from super El Nino 2026 | Sakshi
Sakshi News home page

ముంచుకొస్తున్న మహా ఎల్‌ నినో! 

May 17 2026 2:11 AM | Updated on May 17 2026 2:29 AM

Pacific Ocean heating, Indian cities at highest risk from super El Nino 2026

ప్రపంచవ్యాప్తంగా అసాధారణ వాతావరణ పరిస్థితులను సృష్టించనున్న సూపర్‌ ఎల్‌ నినో

భారత్‌ కరువుకోరల్లో చిక్కుకునే ప్రమాదం 

దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో అనావృష్టి పరిస్థితులు 

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ తీరప్రాంతాల్లో అతివర్షాలు కురిసే చాన్స్‌ 

చెన్నైకు పొంచి ఉన్న వరద ముప్పు 

సాగు దిగుబడులు తగ్గే ప్రమాదం 

ఆమేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంసిద్ధంగా ఉండాలన్న వాతావరణ శాస్త్రవేత్తలు

న్యూఢిల్లీ: ఇంకో పది రోజుల్లో భారత్‌ను నైరుతి రుతుపవనాలు పలకరించనున్న శుభవేళ ఎల్‌ నినో రూపంలో పెనుముప్ప ప్రపంచదేశాలను చుట్టేయనుందన్న చేదువార్త ఇప్పుడు చక్కర్లుకొడుతోంది. పసిఫిక్‌ మహాసముద్రంలోని ఉపరితల జలాలు అత్యధికంగా వేడెక్కి ఈసారి సూపర్‌ ఎల్‌ నినోను సృష్టించనున్నాయని తాజాగా వాతావరణ అంచనాలు వెలువడ్డాయి. దీంతో పలు దేశాల్లో అతివృష్టి, మరికొన్ని దేశాల్లో అనావృష్టి తాండవించనుందని వాతావరణ శాస్త్రవేత్తలు విశ్లేషించారు. 

భారత్‌లోనూ సూపర్‌ ఎల్‌నినో దు్రష్పభావాలు అధికంగా ఉండనున్నాయి. ఈసారి జూన్‌లో సూపర్‌ ఎల్‌ నినో ఏర్పడితే నైరుతి రుతుపవనాల ద్వారా భారత్‌లో లోటున వర్షపాతం నమోదుకానుందని తెలుస్తోంది. ఎల్‌ నినోతో ఏర్పడే అసాధారణ వాతావరణ పరిస్థితుల కారణంగా భారత్‌లో అత్యధిక రాష్ట్రాల్లో వర్షపాతం తగ్గిపోగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ తీరప్రాంతాల్లో అతివర్షాలు కురిసే ఆస్కారముందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. 

భూమధ్యరేఖ వెంబడి దక్షిణ అమెరికా ఖండం పశ్చిమతీరం వైపు పెరూ, ఈక్వెడార్‌ దేశాల సమీప పసిఫిక్‌ మహాసముద్రజలాలు అతిగా వేడెక్కితే ఆ దృగ్విషయాన్ని ఎల్‌నినోగా పిలుస్తాం. ఈ పరిస్థితుల్లో సముద్రగాలులు పశ్చిమానికి బదులు తూర్పునకు పయనిస్తాయి. దీంతో చాలా దేశాల్లో వర్షపాతం తగ్గే అవకాశాలు పెరుగుతాయి. ఈసారి జూన్‌ లేదా జూలైకల్లా సూపర్‌ ఎల్‌నినో ఏర్పడితే భారత్‌లో వర్షపాతం తగ్గే అవకాశముందని వాతావరణశాస్త్ర నిపుణుడు డాక్టర్‌ మాధవన్‌ నాయర్‌ తెలిపారు. 1997, 2015లో ఎల్‌నినో ఏర్పడినప్పుడు భారత్‌ చవిచూసిన దు్రష్పభావాలకంటే ఈఏడాది పరిస్థితులు మరింత దారుణంగా ఉండొచ్చని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. 

ఈసారి ఎలా ఉండొచ్చు? 
భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈసారి వర్షపాతం దీర్ఘకాలిక సగటు(ఎల్‌పీఏ) కేవలం 92 శాతానికి పరిమితంకావొచ్చు. అంటే వర్షపాతం సాధారణం కంటే తక్కువగా పరిమితమవుతుంది. 1971 నుంచి 2020 ఏడాది వరకు జూన్‌–సెప్టెంబర్‌(వర్షాకాలం)లో నమోదైన 870 మిల్లీమీటర్ల దీర్ఘకాలిక సగటు వర్షపాతాన్ని ప్రామాణికంగా తీసుకుని ఈ లెక్కలు కడతారు. ఈసారి లోటు వర్షపాతం నమోదయ్యే సంభావ్యత 35 శాతముంది. 

చరిత్రలో ఎప్పుడుచూసినా ఇది 16 శాతం కాగా ఈసారి ఏకంగా రెట్టింపునకు చేరడం ఆందోళనకరం. భారత్‌లో ఈసారి జూన్‌లో పెద్దగా వర్షాలు పడకపోవచ్చని వాతావరణశాఖతోపాటు ప్రైవేట్‌ వాతావరణ అంచనాల సంస్థ స్కైమేట్‌ తెలిపింది. ఉత్తర, పశ్చిమ, మధ్యభారతాల్లో సూపర్‌ ఎల్‌ నినో దెబ్బకు వర్షాకాలంలోనూ పొడివాతావరణం కొనసాగి కరువురావొచ్చు. దీంతో సాగుదిగుబడి తగ్గి రైతులకు ఆర్థిక కడగండ్లు మిగిలేప్రమాదముంది. ఆగస్ట్, సెప్టెంబర్‌లో పంజాబ్, హరియాణా, రాజస్తాన్‌లో వర్షపాతం తగ్గొచ్చు. 

లద్దాఖ్, రాజస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్యం, దక్షిణభారత ఈశాన్యభాగాలు, తెలంగాణలో దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే పరిస్థితి కాస్తంత మెరుగ్గా ఉండే అవకాశముంది. చెన్నైలో కుంభవృష్టి పడొచ్చు. ఈఏడాది తమిళనాడు రాజధానికి వరదముప్పు పొంచి ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనావేశారు. గతంలో 2015–16లో భారత్‌లో సూపర్‌ ఎల్‌ నినో పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు దీర్ఘకాలిక సగటు వర్షపాతం కేవలం 86 శాతంగా నమోదైంది. ఈఏడాది దారుణ పరిస్థితులు దాపురించనున్నాయన్న అంచనాలతో ఆ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రైతులు కార్యాచరణతో సంసిద్ధంకావాల్సిన తరుణం ఆసన్నమైందని వాతావరణ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement