టైమ్‌ మ్యాగజైన్‌ ‘అద్భుత ప్రాంతాల జాబితా’ 2023లో లద్దాఖ్‌, మయూర్‌భంజ్‌కు చోటు

Odisha Mayurbhanj And Ladakh Feature On TIME Magazine World Greatest Places In 2023 - Sakshi

న్యూఢిల్లీ: సమ్మర్‌ హాలీడేస్‌లో ఎక్కడికెవెళ్లాలి? పిల్లా పాపలతో కలిసి ఎక్కడికెళ్తే అన్నీ మర్చిపోయి హాయిగా ఎంజాయ్‌ చేస్తాం? పెద్దగా ఆలోచించకుండా లగేజ్‌ సర్దేసుకొని కశ్మీర్‌లోని లద్దాఖ్‌కో, ఒడిశాలో మయూర్‌భంజ్‌కు ప్రయాణమైపోవడమే! ఆ రెండే ఎందుకంటారా? ప్రఖ్యాత టైమ్‌ మ్యాగజైన్‌ ప్రపంచవ్యాప్తంగా అత్యంత అద్భుతమైన ప్రాంతాల జాబితా–2023లో మన దేశం నుంచి చోటు దక్కించుకున్న ప్రాంతాలు అవే మరి!

అరుదైన పులులు, పురాతన ఆలయాలు, సాహసంతో కూడిన ప్రయాణం, ఆహా అనిపించే ఆహారం. ఇవన్నీ లద్దాఖ్, మయూర్‌భంజ్‌లకు 50 పర్యాటక ప్రాంతాలతో టైమ్స్‌ రూపొందించిన ఈ జాబితాలో చోటు కల్పించాయి. లద్దాఖ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడ అడుగు పెడితే స్వర్గమే తలవంచి భూమికి చేరిందా అనిపించక మానదు. ‘‘మంచుకొండలు, టిబెటన్‌ బౌద్ధ సంస్కృతి కనువిందు చేస్తాయి. అక్కడి వాతావరణాన్ని ఫీల్‌ అవడానికి పదేపదే లద్దాఖ్‌ వెళ్లాలి’’ అని టైమ్స్‌ కీర్తించింది.

‘‘ఇక మయూర్‌భంజ్‌ అంటే పచ్చదనం. సాంస్కృతిక వైభవం, పురాతన ఆలయాలు, కళాకృతులకు ఆలవాలం. ప్రపంచంలో నల్ల పులి సంచరించే ఏకైక ప్రాంతం’’ అంటూ కొనియాడింది. ఏటా ఏప్రిల్లో మయూర్‌భంజ్‌లో జరిగే ‘చౌ’ డ్యాన్స్‌ ఫెస్టివల్‌ అదనపు ఆకర్షణ. ఒడిశా సాంస్కృతిక వారసత్వంతో పాటు ఏకశిలా శాసనాలు గొప్పగా ఉంటాయని టైమ్స్‌ పేర్కొంది. జాబితాలో అత్యధిక శాతం అమెరికా ప్రాంతాలకే చోటు దక్కింది. టాంపా (ఫ్లోరిడా), విల్లామెట్‌ (ఓరెగాన్‌), టక్సాన్‌ (అరిజోనా), యోసెమైట్‌ నేషనల్‌ పార్క్‌ (కాలిఫోర్నియా) వంటివి వాటిలో ఉన్నాయి.  
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top