నోయిడా హింస.. విదేశాల నుండి డబ్బు | noida labour protest accused got over 1 crore from foreign countries | Sakshi
Sakshi News home page

నోయిడా హింస.. విదేశాల నుండి డబ్బు

May 15 2026 7:30 AM | Updated on May 15 2026 7:46 AM

noida labour protest accused got over 1 crore from foreign countries

యూపీ: నోయిడాలో గత నెలలో జరిగిన కార్మికుల నిరసన విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నిరసనలకు కారణమైన వ్యక్తికి విదేశాల నుంచి పెద్దమెుత్తంలో నిధులు జమయినట్లు అధికారులు గుర్తించారు. ఈ అంశంపై మరింత లోతుగా విచారణ చేపడుతున్నారు.

నోయిడాలో గత నెల ఏప్రిల్‌ 13న పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు జరిగాయి.  వివిధ రంగాలకు చెందిన సుమారు 40 నుండి 50 వేల మంది కార్మికులు నగర వ్యాప్తంగా గూమిగూడి హింసాత్మక ప్రదర్శనలు చేపట్టారు. సెక్టార్ 63 మరియు మదర్సన్ కంపెనీ ప్రాంగణ సమీపంలో కొంతమంది అల్లరి మూకలు  హింసకు పాల్పడటమే కాకుండా  పలు వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో ఆ రోజు సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. కాగా ఈ ఘటనపై పోలీసులు జరిపిన విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ కేసులో నిందితుడైన సత్యం వర్మ వ్యక్తిగత బ్యాంకు ఖాతాలోకి విదేశాల నుండి రూ.  కోటికి పైగా నగదు జమ అయినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి ఖాతాలోకి డాలర్లు, పౌండ్లు, యూరోల రూపంలో ఈ భారీ మొత్తం వచ్చిందని తెలిపారు. వాటిని సత్యం అనే వ్యక్తి ఇతర వ్యక్తుల ఖాతాలోకి బదిలీ చేసినట్లు పేర్కొన్నారు.

కాగా ఈ నిరసనల్లో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఆదిత్య ఆనంద్‌ అనే వ్యక్తిని పోలీసులు అంతకుముందే అరెస్టు చేయగా ఏప్రిల్ 19న లక్నోలో సత్యం వర్మ, హిమాన్షు ఠాకూర్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరు బిగుల్ మజ్దూర్ దస్తా అనే లెఫ్ట్ వింగ్ (వామపక్ష) కార్మిక హక్కుల సంఘంలో నాయకులని తెలిపారు.

అయితే, ఆ నిధులు ఏ దేశాల నుండి వచ్చాయి లేదా ఏయే సంస్థలపై విచారణ జరుగుతోంది అనే వివరాలను పోలీసులు ఇంకా బహిర్గతం చేయలేదు. ప్రస్తుతం బ్యాంక్ లావాదేవీలపై సమగ్ర విచారణ కొనసాగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement