బెంగాల్‌ ప్రభుత్వం ‘చెత్త’ నిర్వహణ.. రూ.3,500 కోట్లు జరిమానా

NGT Imposed Penalty Of Rs 3500 Crore On West Bengal government - Sakshi

కోల్‌కతా: టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వానికి నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) గట్టి షాకిచ్చింది. రాష్ట్రంలో ఘన, ద్రవరూప చెత్త నిర్వహణలో నిబంధనలు పాటించటం లేదని రూ.3500 కోట్లు జరిమానా విధించింది. 2022-2023 రాష్ట్ర బడ్జెట్‌ ప్రకారం పట్టణాభివృద్ధి, మున్సిపల్‌ వ్యవహారాలకు సంబంధించి 12,819కోట్లు రూపాయలు ఖర్చు చేసేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు ఉంది. అయితే.. పారిశుద్ధ్య నిర్వహణ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు మమతా బెనర్జీ సర్కారు ప్రాధాన్యమివ్వలేదని ఎన్‌జీటీ అసహనం వ్యక్తం చేసింది.

‘ప్రజలకు కాలుష్య రహిత పర్యావరణాన్ని అందించడం స్థానిక సంస్థలు, రాష్ట్రాల బాధ్యత. నిధుల కొరత ఉందని ప్రజలకు జీవించే హక్కును తిరస్కరించకూడదు. కేంద్ర ప్రభుత్వ నిధుల విడుదల కోసం వేచి చూస్తూ రాష్ట్రాలు తమ బాధ్యతలు నిర‍్వర్తించటంలో ఆలస్యం చేయకూడదు. పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పరిగణనలోకి తీసుకున్నాం. నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సిందే. రెండు నెలల్లోపు రూ.3500కోట్లను బెంగాల్‌ ప్రభుత్వం జమ చేయాలి‘ అని ఎన్‌జీటీ ఛైర్‌పర్సన్‌ జస్టిస్‌ ఏకే గోయెల్‌ నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. చెత్త నిర్వహణపై ఇకనైనా బెంగాల్‌ ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని, ఉల్లంఘనలు ఇలాగే కొనసాగితే అదనపు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. రాష్ట్రంలో రోజుకు 2,758 మిలియన్ల లీటర్ల మురుగు నీరు పోగవుతోందని, అయితే.. 44 ఎస్‌టీపీల ఏర్పాటుతో కేవలం 1,268 ఎంఎల్‌డీలు మాత్రమే శుభ్రం చేస్తున్నారని పేర్కొంది. రెండింటి మధ్య అంతరం భారీగా ఉందని అసహనం వ్యక్తం చేసింది.

ఇదీ చదవండి: ‘ప్రపంచం నుంచే కమ్యూనిస్టులు కనుమరుగు.. భవిష్యత్తు బీజేపీదే’.. అమిత్‌ షా ఆరోపణలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top