జాతి సంపదను ప్రైవేట్‌పరం చేయొద్దు

New Delhi: Ysrcp Mps Request Letter To Central Not To Privatise Visakha Steel Plant - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: జాతి ప్రయోజనాలు, వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విశాఖ ఉక్కును ప్రైవేటీకరించవద్దని పార్లమెంట్‌ ఉభయ సభలకు చెందిన 120 మంది ఎంపీలు ముక్తకంఠంతో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వివిధ పార్టీలకు చెందిన ఎంపీల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి శుక్రవారం ప్రధాని కార్యాలయంలో అందజేశారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలతోపాటు కాంగ్రెస్, తృణమూల్‌ కాంగ్రెస్, ఎన్సీపీ, బీజేడీ, బీఎస్పీ, టీఆర్‌ఎస్, ఎంఐఎం, సీపీఎం, ఐయూఎంల్, ఆర్‌ఎల్‌పీ తది తర పార్టీలకు చెందిన సభ్యులు దీనిపై సంతకాలు చేసినట్లు విజయసాయిరెడ్డి మీడియాకు తెలిపారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయంపై పునరాలోచించాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గతంలోనే ప్రధానికి లేఖ రాశారని గుర్తు చేశారు. 

వినతిపత్రంలో ముఖ్యాంశాలు ఇవీ...
► విశాఖ ఉక్కు 32 మంది బలిదానాలు, వేల మంది త్యాగాలకు ప్రతిరూపం. 64 గ్రామాలకు చెందిన 16,500 కుటుంబాలు సర్వస్వం కోల్పోయాయి. వేలమంది రైతులు 23 వేల ఎకరాల వ్యవసాయ భూములను కోల్పోయారు. 
►మూడు టన్నుల సామర్థ్యంతో నెలకొల్పిన ఈ పరిశ్రమకు కేంద్రం రూ.4,900 కోట్లను దశలవారీగా ఇచ్చింది. సొంతంగా గనులు లేకుండా ఉక్కు ఉత్పత్తి చేస్తున్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ ఉక్కు ఒక్కటే.  
► ప్రస్తుతం 17,500 మంది రెగ్యులర్, అంతే సంఖ్యలో కాంట్రాక్టు ఉద్యోగులు సంస్థలో పనిచేస్తున్నారు. వీరితోపాటు సీఐఎస్‌ఎఫ్, హోంగార్డులకు సంస్థ వేతనాలు చెల్లిస్తోంది. సంస్థ కారణంగా నివాసాలు కోల్పోయిన కుటుంబాల్లో 8,500 మందికే ఉపాధి కల్పించారు. మిగతా వారు ఇప్పటికీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. 
► విశాఖ ఉక్కు వచ్చిన తర్వాతే నగరం అభివృద్ధి చెంది మెట్రో సిటీ కార్పొరేషన్‌గా ఆవిర్భవించింది. ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ ఇంటర్న్‌షిప్‌ చేస్తున్నారు. సామాజిక బాధ్యతగా నిధులిచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో విశాఖ ఉక్కు పాలు పంచుకుంది. కరోనా వల్ల 150 మంది ఉద్యోగులు మృతి చెందినా 20 వేల టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసింది. 
► ప్రభుత్వంపై ఆధార పడకుండా నెలకు రూ.200 కోట్లను రుణాల వాయిదా కింద చెల్లిస్తూ సంస్థ లాభాల బాట పట్టింది. ఉత్పత్తి ఖర్చులో 65 శాతం ముడి పదార్థాలకే వెచ్చించాల్సి వస్తోంది. క్యాప్టివ్‌ మైన్స్‌ను కేటాయిస్తే విశాఖ ఉక్కు అద్భుతమైన లాభాలు ఆర్జిస్తుంది. 
► విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలు, మెట్రోలు, సర్దార్‌ పటేల్‌ విగ్రహం, వంతెనలు, సాగునీటి ప్రాజెక్టులు, ఎక్స్‌ప్రెస్‌ హైవేలు, పోర్టుల నిర్మాణ పనులకు ఉక్కును అందజేసి జాతి సంపదగా నిలిచింది.
►కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.4,900 కోట్లను దశలవారీగా విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం వెచ్చించగా రూ.45 వేల కోట్లను పన్నుల రూపంలో తిరిగి ఇచ్చింది. 
► 2021–22 తొలి మూడు త్రైమాసికాల్లో రికార్డు స్థాయిలో ఉత్పత్తి, రూ.19,403 కోట్ల రెవెన్యూ సాధించింది. పన్నులు చెల్లించిన తర్వాత రూ.790 కోట్ల లాభాల్లో ఉండగా ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.1,000 కోట్లకుపైగా లాభాలను ఆర్జించే అవకాశం ఉంది.

వైఎస్సార్‌సీపీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు
పార్లమెంటులోని వైఎస్సార్‌సీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడిగా పదవీ విరమణ చేయనున్న పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డిని పార్టీ ఎంపీలు సత్కరించారు. 

స్టీల్‌ ప్లాంట్‌పై టీడీపీ డ్రామాలు
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై ప్రతిపక్ష టీడీపీ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తోందని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాజీనామా చేయాలని చంద్రబాబు డిమాండ్‌ చేయడంపై స్పందిస్తూ.. విశాఖ ఉక్కుకు మద్దతుగా 120 మంది ఎంపీల సంతకాలతో ప్రధానికి వినతిపత్రం సమర్పిస్తే టీడీపీ ఎంపీలు మాత్రం అందుకు నిరాకరించడంలో ఔచిత్యం ఏమిటని ప్రశ్నించారు. దీన్ని బట్టి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను టీడీపీ సమర్థిస్తున్నట్లు స్పష్టమవుతోందన్నారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన కాలంలో చంద్రబాబు ఎరువుల కర్మాగారాలు, చక్కెర ఫ్యాక్టరీలు, డెయిరీలు తదితర 50 ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మారని గుర్తు చేశారు.

చదవండి: సంతకం పెట్టని టీడీపీ

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top