రూ.182 కోట్ల 227.7 కిలోల క్యాప్టగాన్ సీజ్
సిరియా జాతీయుడి అరెస్ట్
సక్సెస్ అయిన ‘ఆపరేషన్ రేజ్ పిల్’
ఎన్‌సీబీకి అమిత్ షా అభినందనలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే తొలిసారిగా భారీ స్థాయిలో ‘క్యాప్టగాన్’ డ్రగ్ పట్టుబడింది. ‘జిహాదీ డ్రగ్’గా పిలిచే ఈ మత్తుపదార్థాన్ని అంతర్జాతీయ మార్కెట్‌కు తరలించేందుకు స్మ గ్లర్లు చేసిన యత్నాలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) సమర్థవంతంగా భగ్నం చేసింది. ‘ఆపరేషన్ రేజ్ పిల్’ పేరుతో చేపట్టిన ఈ ఆపరేషన్‌లో రూ.182 కోట్ల విలువైన 227.7 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకు న్నారు. ఈ వ్యవహారంతో ప్రమేయమున్న ఓ సిరియా జాతీయుడిని అరెస్ట్ చేశారు.
చపాతీ మిషన్.. గొర్రెల ఉన్ని..
భారత్ ట్రాన్సిట్ హబ్‌గా క్యాప్టగాన్ డ్రగ్స్ రవాణా జరుగుతోందని ఓ విదేశీ డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ ఎన్‌సీబీకి సమాచారం ఇచ్చింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు మే 11న న్యూఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో ఓ ఇంట్లో సోదాలు చేపట్టారు. వాణిజ్య అవసరాలకు వాడే చపాతీలు కట్ చేసే యంత్రంలో అత్యంత రహస్యంగా దాచిన 31.5 కిలోల క్యాప్టగాన్ మాత్రలను గుర్తించి సీజ్ చేశారు. వీటిని సౌదీ అరేబియాలోని జెడ్డాకు ఎగుమతి చేసేందుకు సిద్ధం చేసినట్లు విచారణలో తేలింది. ఈ దాడుల్లో సిరియా జాతీయుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
అతడు 2024 నవంబర్ 15వ తేదీన పర్యాటక వీసాపై భారత్‌కు వచ్చాడు. 2025 జనవరి 12వ తేదీతో అతడి వీసా గడువు ముగిసింది. అప్పటినుంచి నెబ్ సరాయ్‌లో అక్రమంగా అద్దెకు ఉంటూ ఈ దందాకు తెరతీశాడు. అతడిచ్చిన సమాచారంతో మే 14న గుజరాత్‌లోని ముంద్రా కంటైనర్ ఫెసిలిటేషన్ స్టేషన్ (సీఎఫ్‌ఎస్)లో ఎన్‌సీబీ తనిఖీలు చేపట్టింది. సిరియా నుంచి గొర్రెల ఉన్ని పేరుతో వచ్చిన ఓ కంటైనర్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేయగా మూడు బ్యాగుల్లో దాచిన 196.2 కిలోల క్యాప్టగాన్ పౌడర్ లభ్యమైంది. ఈ డ్రగ్స్‌ను భారత్ మీదుగా సౌదీ అరేబియా సహా గల్ఫ్, పశ్చిమాసియా దేశాలకు తరలించేందుకు స్మగ్లర్లు కుట్ర పన్నారని వెల్లడైంది.
ఎవరినీ ఉపేక్షించేది లేదు: అమిత్ షా
ఆపరేషన్ రేజ్ పిల్ విజయవంతం కావడంపై హోంమంత్రి అమిత్ షా ఎన్‌సీబీ అధికారులను అభినందించారు. డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యంగా మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మాదకద్రవ్యాల రవాణా, వాడకాన్ని ఏమాత్రం సహించేదిలేదని, భారత్‌ను రవాణా మార్గంగా వాడుకుంటూ దేశంలోకి ప్రవేశించే, బయటకు వెళ్లే ఒక్క గ్రాము డ్రగ్స్‌ను కూడా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం క్యాప్టగాన్ (ఫెనెథిల్లిన్ అనే రసాయన సమ్మేళనం) సైకోట్రోపిక్ డ్రగ్. పశ్చిమాసియా దేశాల్లో దీని వాడకం తీవ్రంగా ఉంది. భయం, అలసట, నిద్రను ఎక్కువ కాలంపాటు దరి చేరనివ్వకుండా యుద్ధ క్షేత్రంలో దూకుడుగా వ్యవహరించేందుకు తీవ్రవాదులు దీనిని వాడతారని, అందుకే దీనికి ‘జిహాదీ డ్రగ్’అనే పేరు వచ్చిందని చెప్పారు. భారత్‌లో ఈ డ్రగ్ పట్టుబడటం ఇదే తొలిసారి.


