దాడులతో నన్ను భయపెట్టలేరు: మాలిక్‌

Nawab Malik Says Not Afraid Of ED Raids Controlled Wakf Board - Sakshi

ముంబై: వక్ఫ్‌ ఆస్తుల అమ్మకాల్లో అక్రమాలు జరిగాయంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ పలు చోట్ల సోదాలు చేస్తూ తనను భయపెట్టగలనని భావిస్తోందని, అది అసాధ్యమని మహారాష్ట్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి నవాబ్‌ మాలిక్‌ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో పలు చోట్ల వక్ఫ్‌ ఆస్తులను అక్రమంగా అమ్మేశారని, మనీ ల్యాండరింగ్‌ జరిగిందనే ఆరోపణలపై ఈడీ అధికారులు గురువారం పుణెసహా ఏడు చోట్ల సోదాలు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి మాలిక్‌ ముంబైలో మీడియాతో మాట్లాడారు. ‘ సోదాలు చేస్తే నేనేమీ భయపడను’ అని వ్యాఖ్యానించారు.

వక్ఫ్‌ బోర్డు అధీనంలోని 30వేల ఆస్తుల్లో నిరభ్యంతరంగా సోదాలు చేసుకోవచ్చని ఈడీకి ఆయన ఆహ్వానం పలికారు. బీజేపీ రాజకీయ ప్రత్యర్థి పార్టీలను భయపెట్టేందుకే మోదీ సర్కార్‌ ఈడీ, ఎన్‌సీబీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని మాలిక్‌ ఆరోపించారు. ‘ఈడీ విధినిర్వహణ నిజంగా చేయదలిస్తే, బీజేపీ అధికారంలో ఉన్న యూపీలోని ఉత్తరప్రదేశ్‌లో షియా వక్ఫ్‌ బోర్డు ఇచ్చిన ఫిర్యాదులను పట్టించుకోండి’ అని చురకలంటించారు. 

ఫడ్నవిస్‌కు పరువు నష్టం నోటీసులు పంపిన నవాబ్‌ అల్లుడు
తన ఇంట్లో మాదకద్రవ్యాలు దొరికాయంటూ బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్‌ తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ నవాబ్‌ మాలిక్‌ అల్లుడు సమీర్‌ ఖాన్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. పరువు నష్టం కింద రూ.5 కోట్లు చెల్లించాలని, క్షమాపణలు చెప్పాలని ఫడ్నవిస్‌కు తన లాయర్‌ ద్వారా సమీర్‌ నోటీసులు పంపించారు. ఈ నోటీస్‌పై చట్టపరంగానే స్పందిస్తామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెప్పారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top