జన్ జెడ్‌కు చేరువయ్యేందుకు మోదీ ప్రభుత్వ ప్రయత్నం
న్యూఢిల్లీ: దేశంలో పరీక్ష పత్రాల లీకేజీలు, పరీక్షల్లో అవకతవకలే ప్రధానాంశాలుగా విద్యార్థి, యువత కొనసాగిస్తున్న వరుస ఆందోళనల నేపథ్యంలో మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జన్ జెడ్‌కు చేరువయ్యే ప్రయత్నాలను ప్రారంభించింది. ఇందుకోసం ‘వన్ డే, వన్ యూనివర్సిటీ’ కార్యక్రమాన్ని తలపెట్టింది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రులు ప్రతి రోజూ ఒక యూనివర్సిటీకి వెళ్లి, అక్కడి యువతతో ముఖాముఖి చర్చలు జరుపుతారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకోవడంతోపాటు వారిని అర్థం చేసుకునేందుకు ప్రయతి్నస్తారు.
విద్యార్థులు, యువత కోసం ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను వారికి వివరిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి సంబంధించి వర్సిటీలతోపాటు, మంత్రుల పర్యటనల సమన్వయ బాధ్యతలను ప్రభుత్వం విద్యా మంత్రి ప్రల్హాద్ జోషి, యువజన వ్యవహారాల మంత్రి మన్సుఖ్ మాండవీయలకు అప్పగించింది. ‘వన్ డే, వన్ యూనివర్సిటీ’ కార్యక్రమంపై బుధవారం ప్రధాని మోదీ సారథ్యంలో జరిగిన కేబినెట్ భేటీలోనూ చర్చించారు. దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వర్సిటీలతోపాటు డీమ్డ్ వర్సిటీలు కలిపి 1,300 వరకు ఉన్నట్లు అంచనా.


